యాప్నగరం

Maharashtra Politics:ఉద్ధవ్‌‌ ఠాక్రే‌కి గవర్నర్ డెడ్‌లైన్... రేపే అసెంబ్లీలో బలపరీక్ష

మహారాష్ట్ర రాజకీయాలు చివరి అంకానికి చేరుకున్నారు. రేపు బలపరీక్షకు సిద్ధమవ్వాలని ఉద్ధవ్ ప్రభుత్వానికి గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ సూచించారు. ఈ మేరకు అసెంబ్లీని ప్రత్యేకంగా సమావేశపర్చాలని ఆదేశించారు.

Authored byవీరేష్ బిళ్ళ | Samayam Telugu 29 Jun 2022, 9:52 am
Samayam Telugu Image
మహారాష్ట్ర రాజకీయాలు చివరి అంకానికి చేరుకున్నాయి. గురువారం బల పరీక్షకు సిద్ధం కావాలని సీఎం ఉద్ధవ్ ఠాక్రేని రాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ ఆదేశించారు. ఇందుకోసం అసెంబ్లీని ప్రత్యేకంగా హాజరుపరచాలని.. సాయంత్రం 5 గంటల్లోగా బల నిరూపణ చేసుకోవాలని సూచించారు. ఈ నేపథ్యంలోనే రేపు ఉదయం 11 గంటలకు మహారాష్ట్ర సర్కారు బల నిరూపణకు సిద్ధమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. తాజా పరిణామాలతో గౌహతిలో బస చేస్తున్న ఏక్‌నాథ్ షిండే వర్గం ఎమ్మెల్యేలు ఈరోజు రాత్రికి ముంబై బయలుదేరనున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వం పడిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీ కూటమిగా ఏర్పడిన మహావికాస్ అఘాడీ ప్రభుత్వం మూన్నాళ్ల ముచ్చటగానే ముగిసిపోనుంది. 288 సీట్లున్న మహారాష్ట్ర అసెంబ్లీలో 144 మ్యాజిక్ ఫిగర్ అయితే.. మహా వికాస్ అఘాడీ ప్రభుత్వానికి ఇటీవల వరకు 152 ఎమ్మెల్యేల మద్దతు ఉంది. అయితే ఏక్ నాథ్ షిండే తిరుగుబాటుతో 40 పైగా ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి మద్దతును ఉపసంహరించుకున్నారు. దీంతో 106 మంది ఎమ్మెల్యేలు ఉన్న బీజేపీ.. ఏక్ నాథ్ షిండే వర్గంతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు పావులు కదుపుతోంది. ఈ క్రమంలోనే బీజేపీ కేంద్ర నాయకత్వం నుంచి పిలుపు రావడంతో మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌ హుటాహుటిన ఢిల్లీకి వెళ్లారు.

మహారాష్ట్రలో భాజపా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన షిండే వర్గానికి కీలక పదవులు ఇవ్వాలని బీజేపీ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు బీజేపీ - షిండే వర్గం మధ్య ఒప్పందం కుదిరినట్లు తెలుస్తోంది. దీనిపై అగ్రనేతలతో సమావేశమై తుది నిర్ణయం తీసుకోవడానికే ఫడణవీస్ దిల్లీ వెళ్లినట్లు ఆ పార్టీలు చెబుతున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ఉద్ధవ్ ఠాక్రే తన బలాన్ని నిరూపించుకుంటారా?.. లేక తిరుగుబాటు నేత ఏక్‌నాథ్ షిండే తన పంతం నెగ్గించుకుంటారా?.. అన్నది ఆసక్తిగా మారింది.
రచయిత గురించి
వీరేష్ బిళ్ళ
వీరేశ్ బిల్లా సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ రాజకీయ, సినీ రంగాలకు చెందిన తాజా వార్తలు, స్టోరీలు అందిస్తుంటారు. దీంతో పాటు వీడియో టీమ్‌కు సేవలు అందిస్తున్నారు. తనకు జర్నలిజంలో 10 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాజకీయాలు, క్రీడలు, సినిమా రంగాలకు సంబంధించి ఆర్టికల్స్ రాశారు... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.