యాప్నగరం

గవర్నర్‌పై విమర్శలు.. సుప్రీంకు వెళ్లిన శివసేన, ‘మహా’ డ్రామాలో మరో మలుపు!

మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించాలని గవర్నర్ సిఫారసు చేసిన సంగతి తెలిసిందే. దీంతో శివసేన సుప్రీం కోర్టుకు వెళ్లింది. గవర్నర్ బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆ పార్టీ మండిపడింది.

Samayam Telugu 12 Nov 2019, 5:31 pm
మహారాష్ట్ర రాజకీయాలు ఉత్కంఠగా మారాయి. రాష్ట్రపతి పాలనకు గవర్నర్ కేంద్రానికి సిఫారసు చేయడం.. మోదీ కేబినెట్ వెంటనే దానికి ఆమోదం తెలపడంతో.. మహారాష్ట్ర పాలన ఇక కేంద్రం చేతుల్లోకి వెళ్లనుంది. గవర్నర్ నిర్ణయం పట్ల అసంతృప్తితో ఉన్న శివసేన.. సుప్రీం కోర్టుకు వెళ్లింది. వాస్తవానికి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు శివసేన సిద్ధంగా ఉంది. కానీ కాంగ్రెస్, ఎన్సీపీ నుంచి మద్దతు లేఖలు తేవడం కోసం మూడు రోజుల గడువు కోరింది.
Samayam Telugu uddav thackrey


కానీ అందుకు నిరాకరించిన గవర్నర్ ప్రభుత్వ ఏర్పాటుకు ఎన్సీపీని ఆహ్వానించారు. మంగళవారం రాత్రి వరకు ఎన్సీపీకి ఇచ్చిన సమయం ఉండగానే.. ఆయన రాష్ట్రపతి పాలనకు సిఫారసు చేశారు. సోమవారం రాత్రి 7.30 గంటలకు శివసేనకు గవర్నర్ ఇచ్చిన డెడ్‌లైన్ ముగియగా... ఆ గడువుకు కొద్ది సేపు ముందు శివసేన నేతలు కోశ్యారీని కలిశారు. మరో మూడురోజుల గడువు కావాలని కోరారు. కానీ గవర్నర్ గడువు పొడిగించడానికి నిరాకరించారు. దీంతో గవర్నర్ బీజేపీకి అనుకూలంగా పని చేస్తున్నారని శివసేన ఆరోపించింది.

ప్రభుత్వ ఏర్పాటు కోసం బీజేపీకి 48 గంటల సమయం ఇచ్చిన గవర్నర్.. శివసేనకు 24 గంటలు మాత్రమే ఇవ్వడం ఏంటి? ఎన్సీపీకి అంతకంటే తక్కువ గడువు ఇవ్వడం ఏంటని కాంగ్రెస్ నేత రణ్‌దీప్ సింగ్ సర్జేవాలా ప్రశ్నించారు.

శివసేన తరఫున కాంగ్రెస్ నేత, న్యాయవాది కపిల్ సిబల్ సుప్రీం కోర్టులో వాదనలు వినిపించనున్నారు. ఇప్పటికే కపిల్ సిబల్, అహ్మద్ పటేల్‌లతో ఉద్దవ్ థాక్రే భేటీ అయ్యారు. మహారాష్ట్ర పరిణామాలపై ఎన్సీపీ నేత శరద్ పవార్‌తో చర్చించేందుకు కాంగ్రెస్ సీనియర్ నేతలు మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్, అహ్మద్ పటేల్ ముంబై వెళ్లారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.