యాప్నగరం

అమావాస్య.. అర్ధరాత్రి.. అడవిలో ముగ్గురి ఆత్మహత్య.. మిస్టరీ తేల్చిన నాలుగో చీర!

పశువులను మేపడానికి అటవీ ప్రాంతంలోకి వెళ్లిన ఓ వ్యక్తికి చెట్టుకు వేలాడుతూ మూడు మృతదేహాలు కనిపించాయి. ఆ పక్కనే నాలుగో చీర కూడా కనిపించింది. కేసు విచారణలో ఆ చీరే కీలకమైంది.

Samayam Telugu 26 Nov 2020, 4:26 pm
మహారాష్ట్ర: థానే జిల్లాలోని షాహాపూర్‌ సమీపంలోని అటవీ ప్రాంతం అది. నవంబర్ 20న రూపేశ్ సపాలే అనే ఓ పశువుల కాపరి తన పశువులను మేపుకుంటూ అడవి లోపలికి వెళ్లాడు. పశువులను మేపుతుండగా.. దుర్గంధం రావడంతో నిశితంగా గమనించగా.. ఓ చెట్టుకు మూడు శవాలు వేలాడుతూ కనిపించాయి. వెంటనే అప్రమత్తమైన అతడు గ్రామ పెద్దలకు చెప్పగా.. వారు పోలీసులకు సమాచారం అందించారు.
Samayam Telugu నమూనా చిత్రం


రంగంలోకి దిగిన పోలీసులు విచారణ జరపగా మతిపోయే వివరాలు వెల్లడయ్యాయి. ఓ బాబా ఇచ్చిన సలహాతోనే ముగ్గురూ ఆత్మహత్య చేసుకున్నారని తేలింది. అమావాస్య లక్ష్మీ పూజ రోజు రాత్రి చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంటే అతీంద్రియ శక్తులు వస్తాయని.. చెట్టు నుంచి కిందకు వస్తామని నితిన్ బెహార్ అనే బాబా.. మహేంద్ర దుబేలే, ముకేశ్ గైవట్ అనే ఇద్దరికి నమ్మబలికాడు.

దీంతో వీరు నవంబర్ 14న షాహాపూర్ దగ్గర్లోని చందా గ్రామానికి చేరువలో ఉన్న దట్టమైన అడవిలోకి వెళ్లారు. ఓ చెట్టుకు చీరలతో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ముగ్గురితోపాటు సచిన్ కంకోచే అనే వ్యక్తి ధార్మిక ప్రదేశాల్లో తరచుగా కనిపిస్తుండేవారు.

ఆ కోణంలో విచారించిన పోలీసులు సచిన్‌ను అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. కంకోచే కూడా ఆరోజు ఆత్మహత్య చేసుకోవాల్సిందట. కానీ బాబా మాటలపై నమ్మకం కుదరకపోవడంతో అతడు సూసైడ్ చేసుకోవాలనే ప్రయత్నాన్ని విరమించుకున్నాడు. బాబా అర్ధరాత్రి 12.30 గంటల సమయంలో సచిన్ కంకోచేకి ఫోన్ చేసి తమతో కలిసి రావాలని సూచించాడు. అక్కడికి వెళ్లిన కంకోచే.. మా నాన్న రమ్మంటున్నారని అబద్దం చెప్పి తిరిగొచ్చాడు. వారు ఆత్మహత్య చేసుకున్న ప్రదేశంలో నాలుగో చీర కనిపించింది. దాన్ని కంకోచే కోసమే తీసుకెళ్లి ఉంటారని భావిస్తున్నారు.

బెహారే ఇంటికివెళ్లిన పోలీసులు.. అతడి ఇంట్లో క్షుద్ర పూజలకు సంబంధించిన పుస్తకాలు, దేవుళ్ల ఫొటోలను గుర్తించారు. ఆత్మహత్యలకు కారణమైన బాబాతోపాటు.. తెలివిగా తప్పించుకున్న సచిన్ కంకోచేపైనా పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.