యాప్నగరం

అతడికి భూమ్మీద నూకలున్నాయి.. వేటాడి వదిలేసిన పులి.. ఒళ్లు గగ్గుర్పొడిచే వీడియో

పెద్దపులి పంజాకు దొరికితే ప్రాణాలతో బయటపడటం దాదాపు అసాధ్యం. అటువంటిది ఓ వ్యక్తి ఈ భూమ్మీద ఇంకా నూకలు ఉన్నట్టు ఉంది. అందుకే వెంబడిచిన పులి అనూహ్యంగా వెనక్కి వెళ్లిపోయింది.

Samayam Telugu 25 Nov 2020, 12:00 pm
పులి పంజా విసిరితే బతికి బట్టకట్టడం అసాధ్యమని అంటారు. ‘పులి గోకడం.. అయ్య బతకడం’ అనే నానుడి కూడా ఉంది. కానీ ఓ వ్యక్తి మాత్రం అదృష్టవశాత్తు పులి పంజా నుంచి ప్రాణాలతో బయటపడ్డాడు. అతడికి ఈ భూమ్మీద నూకలు ఉండటంతో బతుకుజీవుడా అంటూ ఊపిరి పీల్చుకున్నాడు. ఈ ఘటన అసోంలోని తేజ్‌పూర్ సమీపంలోని వ్యవసాయ క్షేత్రాల్లో మంగళవారం చోటుచేసుకుంది. సమీపంలోని అడవుల నుంచి పొలాల్లోకి వచ్చిన రాయల్ బెంగాల్ టైగర్‌ స్థానికులను భయాందోళనలకు గురిచేసింది. వారిపై దాడికి ప్రయత్నించడంతో ప్రాణాలను అరచేతుల్లో పెట్టుకుని తలో దిక్కుకు పరుగులు తీశారు.

వారిలో ఓ యువకుడిని వెంటబడి తరమడమే కాదు పంజా విసిరింది. పులి నుంచి తప్పించుకోడానికి ఆ వ్యక్తి పరుగులు తీసి ఓ గోతిలో దూకేశాడు. పులి కూడా అమాంతం అతనితో పాటే గోతిలోకి దూకింది. కానీ, ఎందుకనో వెంటనే వెనక్కి వచ్చేసి ఇసుక తెన్నెలు మీదుగా సమీపంలోని పొదల్లోకి వెళ్లిపోయి మాయమైంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను అటవీశాఖ అధికారులు ట్విట్టర్‌లో షేర్ చేశారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

పులి నుంచి తప్పించుకునే క్రమంలో పరుగులు పెట్టడంతో ఇద్దరు గాయపడ్డారు. ఘటన గురించి తెలుసుకున్న అటవీ శాఖ అధికారులు అక్కడకు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. సమీపంలోని కజిరంగా నేషనల్ పార్క్ లేదా నమేరి నేషనల్ పార్క్ నుంచి వచ్చి ఉంటుందని అనుమానిస్తున్నారు. ‘ఒకవేళ పెద్ద పులి కజిరంగా పార్క్ నుంచి బయటకు వచ్చిన విషయం తెలియదు.. సాధారణంగా, నమేరిలోని పులులు కదలిక కోసం జియా భరాలి నది వెంట ఒక పాచ్ ఉపయోగిస్తాయి’ అని కజిరంగా జాతీయ పార్క్ ఫీల్డ్ డైరెక్టర్ పి శివకుమార్ అన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.