యాప్నగరం

మణప్పురం ఫైనాన్స్ దోపిడీ: 32 కిలోల బంగారం, నగదు అపహరణ

దోపిడీ దొంగలు మరోసారి మణప్పురం ఫైనాన్స్‌ని లక్ష్యంగా చేసుకుని సినీఫక్కీలో దోపిడీకి పాల్పడ్డారు.

TNN 10 Feb 2017, 9:06 am
దోపిడీ దొంగలు మరోసారి మణప్పురం ఫైనాన్స్‌ని లక్ష్యంగా చేసుకుని సినీఫక్కీలో దోపిడీకి పాల్పడ్డారు. హర్యానాలోని గురుగ్రామ్‌లో న్యూ రైల్వే రోడ్ మణప్పురం ఫైనాన్స్ బ్రాంచ్‌లో గురువారం పట్టపగలే ప్రవేశించిన దొంగలు సిబ్బందికి తుపాకీ గురిపెట్టి బ్రాంచ్‌లో వున్న 32 కిలోల బంగారం, రూ.7.8 లక్షల నగదు దోచుకెళ్లారు. బ్రాంచ్‌లోకి రావడంతోనే సీసీటీవీ కెమెరాలపై హోలీ రంగులు చల్లిన దొంగలు చల్లగా తమ పని కానిచ్చుకుని వెళ్లారు.
Samayam Telugu manappuram robbery thieves loot 32kg gold in gurugram
మణప్పురం ఫైనాన్స్ దోపిడీ: 32 కిలోల బంగారం, నగదు అపహరణ

ఎలా జరిగింది ?
మొదట బ్రాంచిలోకి ప్రవేశించిన ఓ వ్యక్తి ఆధార్ కార్డుని ఐడీ ప్రూఫ్‌గా చూపిస్తుండగానే అతడి వెంట వచ్చిన మరో వ్యక్తి అతడిని తోసుకుంటూ లోపలికి వెళ్లే ప్రయత్నం చేశాడు. అతడిని అడ్డుకోబోయిన గార్డ్ తలపై గట్టిగా తుపాకీతో దాడి చేశాడు ఆ రెండో వ్యక్తి. అనంతరం లోపలికి ప్రవేశించిన మరో ఆగురులు వ్యక్తులు సీసీటీవీ కెమెరాలకి హోలీ రంగులు పూసి విజువల్స్ రికార్డ్ అవకుండా జాగ్రత్తలు పాటించారు. రెండవ గార్డ్ రైఫిల్‌ని బద్దలుగొట్టి అతడి చేతిలో ఆయుధం లేకుండా చేసిన దొంగలు ఆ తర్వాత సిబ్బందిని తుపాకీతో బెదిరించి యదేచ్చగా దోపిడీకి పాల్పడ్డారు. ఈ అనుకోని పరిణామంతో ఆందోళనకి గురైన కస్టమర్లు సైతం భయంతో స్ట్రాంగ్ రూమ్ వద్దే కదలకుండా నిలుచుండిపోయారు.

గత 6 నెలల్లోపే ఇలా మణప్పురం ఫైనాన్స్ బ్రాంచ్‌లలో దోపిడీ జరగడం ఇది ఆరోసారి కావడం గమనార్హం. మొత్తం 8 మంది ఈ దోపిడీలో పాల్గొనగా అందరి వద్ద ఆయుధాలు వున్నాయి. కేరళలోని వలప్పాడ్ ప్రధాన కార్యాలయంగా వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్న మణప్పురం ఫైనాన్స్‌కి దేశంలోని 25 రాష్ట్రాల్లో మొత్తం 3,200 బ్రాంచిలు వున్నాయి.

జనవరి 5న చత్తీస్‌గఢ్‌లోని ఓ బ్రాంచిలో ఇలాగే దోపిడీ జరిగింది. గతేడాది కోల్‌కతా, థానె, నాగపూర్, జలందర్ వంటి ప్రాంతాల్లోనూ మణప్పురం ఫైనాన్స్ బ్రాంచిలు దోపిడీకి గురయ్యాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.