యాప్నగరం

గోవుల కోసం ముస్లింలు ప్రాణాలర్పించారు: మోహన్ భగవత్

గోసంరక్షణ పేరిట కొంతమంది హత్యలకు పాల్పడుతున్నారని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ ఆరోపించారు.

TNN 30 Sep 2017, 2:26 pm
గోసంరక్షణ పేరిట కొంతమంది హత్యలకు పాల్పడుతున్నారని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ ఆరోపించారు. ఆవు ఒక మతానికి చెందినది కాదని, దేశంలోని ఎంతోమంది ముస్లింలు ఆవులను పెంచి పోషిస్తున్నారని ఆయన అన్నారు. గో రక్షణ కోసం చాలా మంది ముస్లింలు తమ ప్రాణాలు అర్పించారని గుర్తు చేశారు. విజయదశమి సందర్భంగా మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో సంస్థ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటుచేసిన సమావేశంలో భగవత్ కార్యకర్తలనుద్దేశించి ప్రసంగించారు. గోసంరక్షణ, రోహింగ్యాల వలసలు, దేశ భద్రత, ముంబై ఎల్ఫిన్‌స్టోన్ రైల్వే స్టేషన్ ప్రమాద ఘటన తదితర అంశాలపై ఆయన మాట్లాడారు.
Samayam Telugu many muslims have sacrificed their life in gauraksha says mohan bhagwat
గోవుల కోసం ముస్లింలు ప్రాణాలర్పించారు: మోహన్ భగవత్


రైల్వేస్టేషన్‌లో తొక్కిసలాట జరిగి ప్రాణాలు కోల్పోయిన వారికి ముందుగా మోహన్ భగవత్ నివాళులర్పించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు. గోసంరక్షణ పేరిట కొంతమంది హత్యలకు పాల్పడుతున్నారని భగవత్ ఆరోపించారు. ఆవులను దొంగ రవాణా చేసే వారి చేతుల్లో గోసంరక్షకులు ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారన్న విషయాన్ని కూడా గుర్తించాలన్నారు. గోసంరక్షకులపై పశ్చిమ బెంగాల్, కేరళ ప్రభుత్వాలు ప్రవర్తిస్తున్న తీరుపై మోహన్ భగవత్ ధ్వజమెత్తారు. సంఘవిద్రోహ చర్యలను, హింసను ఈ రాష్ట్రాలు ప్రేరేపిస్తున్నాయని ఆరోపించారు.

రోహింగ్యా ముస్లిం శరణార్థుల వల్ల దేశ భద్రతకు ముప్పు పొంచిఉందని భగవత్ హెచ్చరించారు. ఇప్పటికే భారత్‌లోకి వలస వస్తున్న బంగ్లాదేశీ శరణార్థుల కారణంగా దేశం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోందని, రోహింగ్యాల విషయంలో దేశ భద్రతను దృష్టిలో ఉంచుకొని నిర్ణయం తీసుకోవాలని కేంద్రానికి సూచించారు. మయన్మార్ నుంచి వచ్చే రోహింగ్యాల అక్రమ చొరబాటును ఆపేందుకు ప్రయత్నించాలన్నారు. మరోవైపు చైనాతో డోక్లామ్ సమస్యను పరిష్కరించుకున్న భారత ప్రభుత్వ తీరును భగవత్ ప్రశంసించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.