యాప్నగరం

Kerala: కలచివేస్తున్న ఘటన.. రోడ్డు విస్తరణకు బలైన మూగజీవాలు..!

కేరళలో (Kerala) దారుణమైన ఘటన చోటుచేసుకుంది. దానిపై పర్యావరణ ప్రేమికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు విస్తరణ కోసం ఓ భారీ చెట్టును కూల్చేశారు. దానిపై ఉన్న ఎన్నో పక్షులు కుప్పకూలి ప్రాణాలు కోల్పోయాయి. దీనికి సంబంధించిన వీడియో బయటకు రావడంతో.. నెటిజన్లు సీరియస్ అయ్యారు. ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకుండా చెట్టును ఎలా కూల్చేస్తారని ప్రశ్నిస్తున్నారు. ఇదేనా పర్యావరణ పరిరక్షణ అని నిలదీస్తున్నారు. అధికారులు దీనిపై చర్యలు తీసుకున్నారు.

Authored byAndaluri Veni | Samayam Telugu 2 Sep 2022, 2:52 pm

ప్రధానాంశాలు:

  • కేరళలో చనిపోయిన వేలాది పక్షులు
  • సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో
  • ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పర్యావరణ ప్రేమికులు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Mass Death Of birds
Kerala: కాలుష్యం, చెట్లు లేకపోవడం వంటి కారణాలతో అనేక పర్యావరణ సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయి. అనేక జీవరాశులు నాశనం అవుతున్నాయి. రకరకాల వ్యాధులు పుట్టుకొస్తున్నాయి. ప్రకృతికి ఎంత దూరంగా జరుగుతుంటే.. మానవుల జీవితం అంత సంక్లిష్టం అవుతుంది. అయినా సరే.. వీటిని చాలామంది పెడచెవిని పెడుతున్నారు. పర్యావరణ రక్షణను ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. దీనికి అర్థం పట్టే ఓ ఘటన కేరళలో చోటుచేసుకుంది.
మలప్పురం జిల్లా తిరురంగడి నగర్‌లోని వీకే పాడి వద్ద జాతీయ రహదారిపై భారీ చెట్టును కూల్చేశారు. దాంతో వేలాది పక్షులు మృత్యువాత పడ్డాయి. 66వ జాతీయ రహదారిని విస్తరించేందుకు రోడ్డు పక్కన చెట్లను నరికేస్తున్నారు. అందులో భాగంగానే గురువారం కూడా భారీ వృక్షాన్ని కూల్చేశారు. దాంతో ఆ చెట్టుపై ఉండే కొన్ని పక్షులు ఎగిరిపోయాయి. కానీ చాలా పక్షులు నేల మీద పడి చనిపోయాయి. ఒక్కసారిగా చెట్టు కూలిపోవడంతో గూడుతోపాటు పక్షులు కూడా చెట్టు కొమ్మలకు చిక్కుకుని చనిపోయాయి.


దీనికిపై సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దాంతో చెట్టును నరికిన జేసీబీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. సంబంధిత అధికారుల అనుమతి లేకుండానే చెట్టును నరికివేసినట్లు సమాచారం. అటవీ శాఖ అధికారులు సంబంధిత కాంట్రాక్టర్‌పై కేసు పెట్టారు. మరోవైపు జంతు ప్రేమికులు దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చెట్టును నరికే ముందు కనీస జాగ్రత్తలు తీసుకోవాలి కదా అని ప్రశ్నిస్తున్నారు. చెట్టును తొలగించే ముందు పక్షులు అక్కడ నుంచి ఎగిరిపోయేలా చేయాలంటున్నారు. ఇవేవీ చేయకుండా ఒక్కసారిగా చెట్టు కూలిపోవడంతో చాలా పక్షులు నేలపై పడి చనిపోయాయి.

పక్షులు చనిపోవడాన్ని చూసిన చాలామంది నెటిజన్లు సీరియస్ అవుతున్నారు. పక్షులను కాపాడేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను చూడకుండా ఇలా చేయడం ఎంత వరకు కరెక్ట్ అని ప్రశ్నిస్తున్నారు. పరిణామాలతో సంబంధం లేకుండా విశాలమైన రోడ్ల కోసం ఇలా చేయడమేమిటని విస్తుపోతున్నారు. ఇక పర్యావరణ సమతుల్యత ఎలా సాధ్యమవుతుందని నిలదీస్తున్నారు. ఇన్ని పక్షులతో నిండిన చెట్టును కూల్చడానికి కఠినమైన మనస్సు ఉండాలని ఆక్షేపిస్తున్నారు.

Read Also:మహిళా ఎమ్మెల్యే పరిస్థితి కూడా ఇంతేనా..? భర్తే అంత పని చేశాడు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.