యాప్నగరం

వందేళ్ల కళాపిపాసి.. కుమారుల పేర్లు మరిచినా, ఆ పాటలు మాత్రం మరవడు!

వందేళ్లు పైబడిన యక్షగాన కళాకారుడు. తన కుమారుల పేర్లను మరచిపోతాడేమో గానీ, ఒక్కసారి తాళం వేస్తే యక్షగానం పాటలను ఇట్టే అందుకుంటాడు. కర్ణాటక కళాకారుడిపై ప్రత్యేక కథనం..

Samayam Telugu 12 Feb 2019, 9:29 pm
సంగీతానికి, కళలకు ఉండే అద్భుత శక్తి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రాళ్లను సైతం కరిగించే శక్తి సంగీతానికి ఉందని చెబుతారు. అలాంటి కోవలోకే వస్తుంది ఈ శతాధిక వృద్ధుడి కథ. వందేళ్లు పైబడి వయసుకు సంబంధించిన మతిమరుపు (అల్జీమర్స్) వ్యాధితో బాధపడుతున్నా.. యక్షగానానికి సంబంధించిన పాటలను అలవోకగా పాడుతున్నాడు కర్ణాటకకు చెందిన ఓ పెద్దాయన. ఈయనకు తన కుమారుల పేర్లను కూడా మరచిపోయిన సందర్భాలున్నాయి.. కానీ, సరైన తాళం వినిపిస్తే.. దానికి సంబంధించిన యక్షగానాన్ని వెంటనే అందుకుంటారు.
Samayam Telugu nayak


కర్ణాటకకు చెందిన వెంకట్రాయ నాయక్.. యక్షగానంలో సుప్రసిద్ధులు. 50 ఏళ్లుగా రామాయణ, మహాభారతంలోని కథలను యక్షగానం ద్వారా ఆలపిస్తూ ప్రజాదరణ పొందారు. తన 13వ ఏట నుంచే యక్షగానం పాటలు పాడటం మొదలుపెట్టారు. సుప్రసిద్ధ గాయకులు, కళాకారులతో కలిసి పనిచేశారు. వివిధ ప్రాంతాల్లో లెక్కకు మిక్కిలి ప్రదర్శనలు ఇచ్చారు.

నాయక్ సతీమణి ఇటీవలే మరణించారు. ఆమె మరణించిన తర్వాత 13వ రోజున సంతాపం సందర్భంగా ఓ వ్యక్తి యక్షగానానికి సంబంధించిన తాళం వేశాడు. ఇంకేం.. ఆ పాటను వెంటనే అందుకున్న నాయక్.. అవలీలగా పాడి ఔరా అనిపించారు. దానికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.


నాయక్‌కు ఐదుగురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు. వీరందరూ తమ సంప్రదాయ యక్షగాన కళను కొనసాగిస్తున్నారు. వీరి పిల్లలు కూడా ఆ కళను కాపాడుతూ వస్తున్నారు. నాయక్ కుమారుల్లో ఒకరైన శంకర్.. ముంబైలో యక్షగానానికి సంబంధించి ఓ టీమ్‌ను నిర్వహిస్తున్నారు. చాలా మంది యువకులకు యక్షగానంలో శిక్షణ ఇస్తున్నారు.


నాయక్ యక్షగానానికి సంబంధించిన చాలా వీడియోలు సోషల్‌మీడియాలో విశేష ఆదరణ పొందాయి. యక్షగానం కోసం ఆయన ఇంత చేసినా.. ప్రభుత్వం నుంచి సరైన ప్రోత్సాహం లేదని నాయక్ కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Read this in Kannada

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.