యాప్నగరం

ప్రభాస్‌ను చూసి నేర్చుకోండి.. విరాళాలపై కేరళ మంత్రి ఫైర్

కేరళకు కోటి రూపాయలు విరాళం ఇచ్చిన ప్రభాస్‌‌పై కేరళ టూరిజం మంత్రి సురేంద్రన్ ప్రశంసల వర్షం కురిపించారు. ప్రభాస్‌ను చూసి నేర్చుకోవాలని మలయాళ నటులపై మండిపడ్డారు.

Samayam Telugu 3 Sep 2018, 4:12 pm
భారీ వర్షాలు, వరదలకు కేరళ అతలాకుతలమైన సంగతి తెలిసిందే. వరదల కారణంగా సర్వం కోల్పోయిన కేరళ ప్రజలను ఆదుకోవడానికి దక్షిణాది సినీ నటులు నడుం బిగించారు. కేరళ సీఎం రిలీఫ్ ఫండ్‌కు భారీగా విరాళాలు ఇచ్చారు. ముఖ్యంగా తమిళ, తెలుగు సినీ పరిశ్రమ నుంచి కేరళకు భారీగా విరాళాలు అందాయి. వాస్తవానికి మలయాళ సినీ నటులు ఇచ్చిన దానికన్నా ఎక్కువగా ఈ రెండు సినీ పరిశ్రమల నుంచి విరాళాలు ఇచ్చారు. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ కేరళ టూరిజం మంత్రి కడకంపల్లి సురేంద్రన్ మలయాళ నటులను కడిగిపారేశారు.
Samayam Telugu Prabhas


ముఖ్యంగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌ను ఉదాహరణగా చెబుతూ మలయాళ నటులను దుయ్యబట్టారు. ప్రభాస్‌ను పొగడ్తలతో ముంచెత్తారు. చీఫ్ మినిస్టర్ డిస్ట్రెస్ రిలీఫ్ ఫండ్ (CMDRF)కు కోటి రూపాయలు విరాళంగా ఇచ్చిన ప్రభాస్‌ను ఇటీవల జరిగిన ఓ సభలో సురేంద్రన్ ప్రశంసించారు. మలయాళ నటులు మాత్రం తూతూమంత్రంగా విరాళాలిచ్చారని మండిపడ్డారు. మలయాళ నటులు ప్రభాస్‌ను రోల్ మోడల్‌గా తీసుకోవాలని, ఆయన్ని చూసి నేర్చుకోవాలని క్లాస్ పీకారు. ఈ సభలో ముఖ్యమంత్రి పినరయి విజయన్ కూడా పాల్గొన్నారు.

‘మన రాష్ట్రంలో గొప్ప నటులున్నారు. ఒక్క సినిమాకి రూ.3 నుంచి రూ.4 కోట్లు తీసుకుంటారని నేను విన్నాను. కొంత మంది నటులు కనీసం రూ.3 కోట్ల కన్నా తక్కువ తీసుకోవడంలేదు. వీళ్లంతా ఆంధ్రలో ఒక నటుడిని చూసి నేర్చుకోవాలి. ఆయనకి మలయాళంతో ఎలాంటి సంబధం లేదు. కానీ కోటి రూపాయలు విరాళంగా ఇచ్చారు. మన రాష్ట్రంలో సంభవించిన విపత్తు గురించి తెలుసుకుని ముందుకొచ్చారు. వెనకడుగు వేయకుండా భారీ విరాళం ఇచ్చారు’ అని ప్రభాస్‌ను ఉద్దేశించి సురేంద్రన్ వ్యాఖ్యానించారు.

ఇదిలా ఉండగా.. ప్రభాస్‌ మాదిరిగానే తమిళ సినీ పరిశ్రమ నుంచి దర్శకుడు, కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ కూడా కేరళకు ఇటీవల కోటి రూపాయల విరాళం ప్రకటించారు. అలాగే నటుడు, రాజకీయ నాయకుడు విజయకాంత్ కూడా కోటి విరాళం ఇచ్చారు. దళపతి విజయ్ రూ.70 లక్షలు రిలీఫ్ ఫండ్‌కు పంపారు. తెలుగు సినీ పరిశ్రమ నుంచి మెగా ఫ్యామిలీ రూ.51 లక్షలు, అల్లు అర్జున్, ఎన్టీఆర్ చెరో రూ.25 లక్షలు ఇచ్చారు. అయితే మలయాళ స్టార్ హీరోలైన మోహన్ లాల్, మమ్ముట్టి, దుల్కర్ సల్మాన్ చెరో రూ.25 లక్షలు విరాళంగా ఇచ్చారు. అలాగే మలయాళ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (అమ్మ) రూ.50 లక్షలు రిలీఫ్ ఫండ్ ఇచ్చింది. ఇతర రాష్ట్రాల హీరోల కన్నా తమ హీరోలు విరాళాలు తక్కువ ఇవ్వడంపై మంత్రి పై విధంగా స్పందించారు.

Read this news in Malayalam

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.