యాప్నగరం

‘ప్రార్థించే పెదవులకన్నా సాయం చేసే చేతులు మిన్న’ నినాదంతోనే విశ్వమాతగా ఎదిగిన మదర్ థెరిసా

అమ్మ.. ఈ పిలుపు వినడానికి అమృతంలా ఉంటుంది. ప్రతి మహిళ తన జీవితంలో ఈ పిలుపుకోసం తపించిపోతుంది. అటువంటి లక్షలాది మందితో అమ్మగా పిలుపించుకోవడం సామాన్యం విషయం కాదు. తన సేవలతో మదర్ థెరిసా ఆ ఘనతను సాధించారు.

Samayam Telugu 26 Aug 2020, 8:48 am
ఎక్కడ ఎలా పుట్టాం.. ఎలా పెరిగాం అన్నది కాదు.... మన ముగింపు ఎంత గొప్పగా ఉందనేది ముఖ్యం. పదిమందికి సాయం చేయాలనే ఆలోచనతో ఉండే వ్యక్తులు జీవితంలో ఎప్పటికైనా ఉన్నత స్థానానికి చేరుకుంటారు. అభాగ్యులకు సేవ చేయడాన్నే పరమావధిగా భావించి, జీవితం మొత్తం సేవకే అంకితం చేసిన మహోజ్వల మూర్తి మదర్ థెరిసా.. ఎక్కడో యుగోస్లేవియాలో పుట్టిన మదర్ థెరిసా, భారత్‌కు వచ్చి కోల్‌కతా మురికివాడలో అనాధ శరణాలయాన్ని స్థాపించి, లక్షలాది మందిని చేరదీసి అమ్మగా మారారు. ఆమె జీవితం నుంచి తెలుసుకోవాల్సింది.. నేర్చుకోవాల్సింది చాలా ఉంది.
Samayam Telugu మదర్ థెరిసా


ఎక్కడో యుగోస్లేవియాలో పుట్టి కోల్‌కత్తా మురికివాడల్లోని అభాగ్యుల జీవితాల్లో వెలుగునింపిన మహోన్నత వ్యక్తి మదర్ థెరిసా.. తోటివారికి సాయం చేయడానికి తన వ్యక్తిగత జీవితాన్నే త్యాగం చేసి, కష్టాల్లో ఉన్నవారికి వెతికి మరీ సాయమందించి వారికి అమ్మగా మారింది. భారతీయులతో ‘అమ్మ’అని పిలిపించుకున్న అంతటి మహనీయత గల వ్యక్తి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. 1910 ఆగష్టు 26న యుగోస్లేవియాలో జన్మించిన మదర్ థెరిసా అసలు పేరు ఆగ్నెస్ గోన్సా బొజాక్ష్యూ. మదర్ తండ్రి కూడా ఇతరులకు సేవ చేయడంలో ముందుండేవారు. అనాథల కోసం లెట్నికాలో ఆయన స్థాపించిన ఓ ఆశ్రమం ఇప్పటికీ ఎంతో మందిని అక్కున చేర్చుకుంటోంది.

తండ్రి వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న మదర్ థెరిసా... అనారోగ్యంతో 1919లో ఆయన కన్నుమూయగా, మృత్యువుకి ముందు తండ్రి పడిన బాధ చూసి తీవ్ర ఆవేదనకు గురైంది. 12 ఏళ్ల వయస్సులోనే సేవకు అంకితమైన మదర్.. తన 18వ ఏట సిస్టర్స్ ఆఫ్ లోరెటో సంఘంలో చేరింది. ఆ సంస్థకు చెందిన కోల్‌కతాలోని పాఠశాలకు 1937, మే 4న టీచర్‌గా వచ్చారు. కోల్‌కతాలోని మురికివాడల్లోని ప్రజల దయనీయ పరిస్థితి ఆమెను కలచివేసింది. దీంతో ఉపాధ్యాయ ఉద్యోగానికి రాజీనామ చేసి మానవ సేవకు శ్రీకారం చుట్టారు.

అనాథల కోసం మొతిజిల్ అనే పాఠశాలను ఏర్పాటు చేసి, వారి పోషణకు తగిన నిధులు లేకపోవడంతో కోల్‌కతా వీధుల్లో జోలెపట్టి కడుపు నింపారు. ఆమె సేవానిరతిని గుర్తించిన కొందరు స్వచ్ఛందంగా ముందుకొచ్చి సాయంగా నిలిచారు. ఆర్థికంగా ఆ పాఠశాలకు సాయం లభించడంతో 1950లో వాటికన్ అనుమతితో ‘మిషనరీస్ ఆఫ్ చారిటీ’ ఏర్పాటు చేశారు.

ఈ సంస్థ ద్వారా దాదాపు 45 ఏళ్లు ఎందరో అభాగ్యులు, పేదలు, రోగులకు సేవలందించారు. అనేక అనాథ శరణాలయాలు, ధర్మశాలలు, హెచ్ఐవీ, కుష్టు వ్యాధిగ్రస్తులకు ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేసి స్వాంతన చేకూర్చారు. మదర్ థెరిసాకు 1951లో భారత పౌరసత్వం లభించింది. 1979లో ఆమె సేవలకు గుర్తింపుగా అత్యున్నత పురస్కారం నోబెల్ శాంతి బహుమతి లభించింది. ఇక, 1980లో భారతరత్న పురస్కారం ఆమెను వరించింది. థెరీసా సేవలు కేవలం భారత్‌కే పరిమితం కాలేదు. ఆసియా, ఐరోపా, ఆఫ్రికా, రోమ్, టాంజానియా, ఆస్ట్రియాలకు సైతం తన సేవలను విస్తరించారు.

జాయన్ గ్రాఫ్ క్లూకాస్ రాసిన జీవితచరిత్ర ప్రకారం12 ఏళ్ల తర్వాత ఆమె తన జీవితాన్ని మతానికి అంకితం చేయాలని నిశ్చయించుకున్నారు. కేవలం నిరాశ్రయులకే కాకుండా వరద బాధితులకు, అంటురోగాలు సోకినవారికి, బాధితులు, శరణార్థులు, అంధ, వికలాంగ, వృద్ధులకు, మద్యపాన వ్యసనానికి బానిస అయినవారికి సైతం థెరీసా సేవలందించారు. 1982లో ఇజ్రాయిల్ - పాలస్తీనా గెరిల్లాల పోరు మధ్య చిక్కుక్కున్న 37 మంది పిల్లలను థెరీసా కాపాడారు. రెడ్ క్రాస్ కార్యకర్తలతో కలిసి ఆమె అక్కడికి వెళ్లి వైద్య సేవలు అందించారు.

1997న మార్చి 13న మిషనరీస్ ఆఫ్ చారిటీ అధినేత పదవికి థెరీసా రాజీనామా చేశారు. అదే ఏడాది తీవ్ర అనారోగ్యంతో సెప్టెంబర్ 5న మరణించారు. అయితే, ఆమెను ఇప్పటికీ బోర్డు అధినేతగా ఎన్నుకుంటూ ఆమె తమతోనే ఉందని చారిటీ సభ్యులు చాటిచెబుతున్నారు. ‘ప్రార్థించే పెదవులకన్నా సాయం చేసే చేతులు మిన్న’అన్న నినాదం తోనే విశ్వమాతగా పేరు గాంచిన మదర్ థెరీసాకు సెయింట్‌హుడ్ హోదా కూడా దక్కింది. తమ మరణం తర్వాత కూడా కొన్ని అద్బుతాలను చేసేవారికి వాటికన్ సిటీ ‘సెయింట్’హోదా ప్రకటిస్తుంది. ఇలా ప్రకటించాలంటే కనీసం రెండు అద్బుతాలు జరగాలి అప్పుడే వారు దేవత స్థానాన్ని పొందుతారు.

ఇదే తరహాలో కడుపులో కణితితో బాధపడుతున్న ఓ బెంగాలీ గిరిజన మహిళను థెరిసా స్వస్థపరచడాన్ని ఆమె చేసిన మొదటి అద్భుతంగా 1998లో గుర్తించారు.
థెరీసాకు చేసిన ప్రార్థనల వల్లే తనకు కణితి పూర్థిగా నయమైపోయిందని ఆమె చెప్పినప్పుడు రెండో అద్బుతం కోసం చూసింది. ప్రాణాంతక మెదడు వ్యాధితో బాధపడుతున్న బ్రెజిల్‌కు చెందిన ఓ వ్యక్తిని మదర్‌థెరిసా తన దివ్యశక్తితో నయం చేయడాన్ని ఆమె చేసిన రెండో అద్భుతంగా గుర్తించి మదర్ థెరీసాను సెయింట్‌గా గుర్తిస్తూ వాటికన్ సిటీ ప్రకటించింది.

ఎక్కడో విదేశాల్లో పుట్టి, సేవా మార్గంలో పయనించి, భారతదేశంలోని కోల్‌కతాలో స్థిరపడి, అనారోగ్యంతో బాధపడుతున్నవారి చేరదీసి, సేవలు చేసిన ‘తల్లి’ థెరీసా రాయడానికి వీల్లేనంత దయనీయ స్థితిలో రోగంతో బాధపడ్తున్నవారిని అక్కునచేర్చుకున్న ‘దేవత’. పట్టుకుంటే ఆ రోగం తమకెక్కడ అంటుకుంటుందోనని కుటుంబ సభ్యులు రోడ్డున పడేసిన అభాగ్యులు, మదర్‌ థెరీసా పుణ్యమా అని కోలుకున్నారు. ఇక బతికే అవకాశం లేదని తెలిసీ, చివరి రోజుల్లో మథర్ థెరీసా సపర్యలతో బాధల్ని మర్చిపోయారు కొందరు అభాగ్యులు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.