యాప్నగరం

గడప దాటాలంటే మాస్క్ తప్పనిసరి.. రాష్ట్రాల కీలక నిర్ణయాలు

లాక్‌డౌన్ వేళ అత్యవసరంగా బయటకు వెళ్లాలని భావించే వారు తప్పనిసరిగా ఫేస్ మాస్కులను ధరించాలని ముంబై నగర పాలక సంస్థ ప్రజలకు సూచించింది. ఢిల్లీ, యూపీ, జమ్మూ కశ్మీర్, లడఖ్ ప్రభుత్వాలు కూడా ఇదే తరహా ఆదేశాలు జారీ చేశాయి.

Samayam Telugu 8 Apr 2020, 9:22 pm
కరోనా వైరస్ కేసుల సంఖ్య వేగంగా పెరుగుతున్న వేళ మాస్కులు ధరించడాన్ని తప్పనిసరి చేస్తూ.. ముంబై నగర పాలక సంస్థ నిర్ణయం తీసుకుంది. ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వాలు కూడా ఇదే నిర్ణయం తీసుకున్నాయి. ఇళ్ల నుంచి బయటకు వచ్చే ప్రజలు కచ్చితంగా ముఖానికి మాస్క్ ధరించాల్సిందేనని ముంబై నగర పాలక సంస్థ సూచించింది. మాస్కులు లేకుండా బయటకు వస్తే శిక్ష తప్పదని హెచ్చరించింది. ఎపిడమిక్ డిసీజెస్ యాక్ట్ 1897 ప్రకారం బీఎంసీ ఈ నిర్ణయం తీసుకుంది. దేశంలో కరోనా కేసుల సంఖ్య 5000 దాటగా.. ఒక్క మహారాష్ట్రలోనే కోవిడ్ కేసుల సంఖ్య 1000 దాటింది.
Samayam Telugu masks


ఢిల్లీ ప్రభుత్వం కూడా ఇళ్ల నుంచి బయటకు వచ్చే వారు మాస్కులు ధరించడాన్ని తప్పనిసరి చేసింది. మాస్కులు ధరించడం వల్ల కరోనా వ్యాపించే ముప్పు తగ్గుతుందని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. మాస్కులు అందుబాటులో లేకపోతే క్లాత్‌లతో తయారు చేసిన మాస్కులను కూడా ధరించొచ్చని కేజ్రీవాల్ తెలిపారు. ఢిల్లీలో 20 హాట్ స్పాట్‌లను గుర్తించామని ఆయన చెప్పారు.

ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు తప్పకుండా మాస్కులు ధరించాలని ఉత్తర ప్రదేశ్ సర్కారు రాష్ట్ర ప్రజలకు సూచించింది. 66 కోట్ల ట్రిపుల్ లేయర్ ఖాదీ మాస్కులకు యోగి ప్రభుత్వం ఇప్పటికే ఆర్డర్ ఇచ్చింది. వీటిని ఉతికి మళ్లీ వాడుకోవచ్చు. పేదలకు ఈ మాస్కులను ఉచితంగా అందించనుండగా.. ఇతరులకు నామమాత్ర ధరకు అందించనున్నారు.

Read Also: సింపుల్‌గా ఇంట్లోనే ఫేస్ మాస్క్ తయారు చేసుకోండిలా..

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.