యాప్నగరం

Third Front భేటీ కాదు.. నేటి సమావేశంపై శరద్ పవార్ క్లారిటీ

నరేంద్ర మోదీ, బీజేపీని ధీటుగా ఎదుర్కొనేలా ప్రతిపక్ష కూటమిని ఏర్పాటుచేస్తున్నట్టు వస్తున్న వార్తలను శరద్ పవార్ ఖండించారు. ఢిల్లీలో జరిగే సమావేశంపై స్పష్టతనిచ్చారు.

Samayam Telugu 22 Jun 2021, 11:30 am
సీనియర్ రాజకీయ నేతలు ఎన్‌సీపీ అధినేత శరద్ పవార్, తృణమూల్ కాంగ్రెస్ నేత యశ్వంత్ సిన్హాలు సంయుక్తంగా సమావేశం ఏర్పాటుచేస్తున్న విషయం తెలిసిందే. మూడో కూటమి ఏర్పాటుకు జరుగుతున్న ప్రయత్నాలుగా మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఈ ప్రచారంపై ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ స్పందిస్తూ.. ఇది థర్డ్ ఫ్రంట్ కోసం నిర్వహించే సమావేశం కాదన్నారు. రాజకీయ నేతలు, మేధావులతో ప్రస్తుతం అంశాలపై చర్చించనున్నామని స్పష్టం చేశారు. 2018లో ఏర్పాటుచేసిన ‘రాష్ట్ర మంచ్’ రాజకీయ కార్యాచరణ గ్రూప్ ఆధ్వర్యంలో ఈ సమావేశం జరుగుతోంది.
Samayam Telugu శరద్ పవార్
NCP President and MP Sharad Pawar


2024 ఎన్నికలలో బీజేపీకి వ్యతిరేకంగా మూడో ఫ్రంట్ ఏర్పాటుకు, ఈ సమావేశానికి ఎటువంటి సంబంధం లేదని ఇప్పటికే ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ స్పష్టం చేశారు. రాజకీయ నాయకులతో పాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను ఈ సమావేశానికి ఆహ్వానించారు. దీంతో ఇది రాజకీయ భేటీ కాదనేది స్పష్టమవుతోంది.

ఈ సమావేశంపై శివసేన చీఫ్ సంజయ్ రౌత్ మాట్లాడుతూ.. ‘ఇది ప్రతిపక్ష కూటమి ఏర్పాటుకు చేస్తున్న ప్రయత్నాలుగా తాను భావించడంలేదు.. ఎందుకంటే శివసేన, సమాజ్‌వాదీ పార్టీ, బీజేపీ, చంద్రబాబు నాయుడులను పిలవలేదు.. బహుశా ప్రతిపక్షాలను ఏకం చేయడానికి ఇది తొలి అడుగు కావచ్చు’ అన్నారు.

తరుచూ సమావేశమయ్యే ఈ వేదికలో తనకు సభ్యత్వం ఉందని జేడీ (యూ) మాజీ నాయకుడు పవన్ వర్మ అన్నారు. ‘బిజెపి మినహా వివిధ పార్టీలు, పలు రంగాలకు చెందిన సభ్యులను మేము ఆహ్వానిస్తున్నాం’ అని వర్మ పేర్కొన్నారు. తాజా సమావేశానికి మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎస్‌వై ఖురేషి, సీనీయర్ లాయర్ కేటీఎస్ తులసి, మాజీ దౌత్యవేత్త కేసీ సింగ్, బాలీవుడ్ సంగీత దిగ్గజం జావేద్ అక్తర్, దర్శకుడు ప్రీతీశ్ నంది, మీడియా నుంచి కరణ్ థాపర్, అశుతోష్ తదితరులు హాజరవుతున్నారు.

నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూక్ అబ్దుల్లాను ఆహ్వానించగా ఆయన కుమారుడు ఒమర్ అబ్దుల్లా హాజరవుతున్నారు. సోమవారం శరద్ పవార్‌తో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్‌ భేటీ కావడం, అనంతరం సమావేశంపై ప్రకటన రావడంతో రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే, తనకు ఈ భేటీతో ఎటువంటి సంబంధం లేదని పీకే ప్రకటించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.