యాప్నగరం

​ఇక అక్కడా బీజేపీదే పైచేయి..!

కేంద్రంలో మోడీ సర్కారు అధికారంలోకి వచ్చి మూడేళ్లు గడుస్తున్నా

TNN 31 Jul 2017, 8:20 am
కేంద్రంలో మోడీ సర్కారు అధికారంలోకి వచ్చి మూడేళ్లు గడుస్తున్నా రాజ్యసభలో మాత్రం బీజేపీకి ఇబ్బందులు తప్పడం లేదు. ఐదేళ్లకు ఒకసారి రద్దయ్యే లోక్‌సభలో సంపూర్ణమైన మెజారిటీని సంపాదించుకున్న కమలం పార్టీ, శాశ్వత సభ అయిన రాజ్యసభలో బాగా వెనుకబడింది. అయితే గత మూడేళ్లలో వివిధ రాష్ట్రాలో బీజేపీ అధికారాన్ని సంపాదించుకొంటూ ఉండటంతో ఇప్పుడిప్పుడు పెద్దల సభలో కమలం పార్టీ పరిస్థితి కాస్త మెరుగయ్యింది. అయినప్పటికీ మెజారిటీ మాత్రం సాధించలేదింత వరకూ. కానీ మారుతున్న రాజకీయ సమీకరణాల నేపథ్యంలో రాజ్యసభలో బీజేపీ బలోపేతం అవుతోంది. మెజారిటీ దిశగా సాగుతోంది.
Samayam Telugu nda to get mejority in rajyasabha
​ఇక అక్కడా బీజేపీదే పైచేయి..!


తాజాగా జేడీయూ వచ్చి ఎన్డీయేలో చేరడంతో కమలం పార్టీకి రాజ్యసభలో కాస్త బలం పెరిగింది. మొత్తం 243మంది సభ్యులున్న రాజ్యసభలో బీజేపీ, దాని మిత్రపక్షాల బలం ఇప్పుడు 89. నలుగురు రాజ్యసభ సభ్యులను కలిగిన జేడీయూ కలయిక అనంతరం ఈ సంఖ్యకు చేరింది ఎన్డీయే బలం. కొన్ని ఎన్డీయేతర పక్షాలు కూడా ఈ కూటమికి మద్దతుగా ఉంటున్నాయి. తమిళనాడుకు చెందిన అన్నాడీఎంకే, తెలంగాణ నుంచి టీఆర్ఎస్, ఏపీ నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ.. తదితర పక్షాలు అంశాల వారీగా ఎన్డీయేకు మద్దతును ఇస్తున్నాయి. ఇలాంటి పార్టీల బలాన్ని, స్వతంత్రులను, నామినేటెడ్ రాజ్యసభ సభ్యులను కలుపుకుంటే.. ఎన్డీయే బలం ఇప్పుడు 121కి చేరుతుంది. అంటే మెజారిటీకి కేవలం మరో రెండు సీట్లు మాత్రమే తక్కువ.

ప్రస్తుతం కొన్ని రాష్ట్రాల అసెంబ్లీల కోటాలో రాజ్యసభ సభ్యుల ఎన్నిక జరుగుతోంది. వాటి వల్ల బీజేపీలోని పక్షాల బలం పెరగడం కానీ, తరగడం కానీ జరగదు. అయితే గుజరాత్ లో కాంగ్రెస్ కు చెందే ఒక స్థానాన్ని సొంతం చేసుకోవాలని బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది. అలాగే మధ్యప్రదేశ్ నుంచి ఒక సీటుకు జరిగే ఉప ఎన్నికలోనూ బీజేపీ విజయం సాధించే అవకాశం ఉంది. మరి ఈ రెండు సీట్లనూ సొంతం చేసుకుంటే.. ఎన్డీయే బలం మ్యాజిక్ ఫిగర్ 123కు చేరుతుంది. ఇది కమలం పార్టీకి కొంత ఊరటనిచ్చే అంశమే.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.