యాప్నగరం

మహిళా పైలట్ సమయస్ఫూర్తి 261 మందిని కాపాడింది!

గాల్లో ఎదురెదురుగా ప్రయాణిస్తోన్న రెండు విమానాలు ఢీ కొనబోయి తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్న విషయం తెలిసిందే.

Samayam Telugu 12 Feb 2018, 9:14 am
గాల్లో ఎదురెదురుగా ప్రయాణిస్తోన్న రెండు విమానాలు ఢీ కొనబోయి తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్న విషయం తెలిసిందే. విస్తారా ఎయిర్‌లైన్స్‌, ఎయిరిండియాకు చెందిన విమానాలు ఎదురురెదురుగా దూసుకొచ్చి ఒక దాన్ని మరొకటి దాటుకుంటూ వెళ్లిన సమయంలో ఈ రెండింటి మధ్య దూరం కేవలం 100 అడుగులు మాత్రమే. అయితే ఈ ప్రమాదాన్ని తప్పించడంలో ఓ మహిళా పైలట్ సమయస్ఫూర్తితో వ్యవహరించారు. ప్రమాదాన్ని పసిగట్టిన ఆమె 261 మంది ప్రాణాలను రక్షించగలిగారు. ఢిల్లీ నుంచి పుణే వెళ్తున్న విస్తారా ఎ-320 విమానం 29 వేల అడుగుల ఎత్తులో ఎగరాలని ఏటీసీ సూచించింది. అదే సమయంలో ముంబై నుంచి భోపాల్‌కు ఎయిరిండియాకు చెందిన ఎయిర్‌బస్ ఏ-319 27 వేల అడుగులు ఎత్తులో ఎగురుతోంది. కానీ విస్తారా పైలెట్లు విమానాన్ని 27 వేల అడుగుల ఎత్తుకి దింపి నడిపారు.
Samayam Telugu near miss how ais woman pilot saved lives of 261 flyers
మహిళా పైలట్ సమయస్ఫూర్తి 261 మందిని కాపాడింది!


దీంతో బుధవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో ఈ రెండు విమానాలు ఎదురెదురుగా వచ్చాయి. దీంతో రెండు కాక్‌పీట్స్‌లోని సిబ్బంది సమన్వయంలో కొంత గందరగోళం నెలకొంది. ఆ సమయంలో విస్తారా విమానం కెప్టెన్ టాయిలెట్ బ్రేక్ తీసుకోవడంతో మహిళా కో-పైలట్ అధీనంలో ఉంది. ఎయిర్ఇండియా విమానం మహిళా కమాండర్, కెప్టెన్ అనుపమ కోహ్లీ నడుపుతున్నారు. తమకు ఎదురుగా వస్తున్న విస్తారా విమానాన్ని గుర్తించిన ఆమె, ఈ ఎత్తులో మీరు ఎందుకు వస్తున్నారని ఏటీసీ ద్వారా వారిని ప్రశ్నించారు. దీనికి విస్తారా పైలట్ ఎదురు ప్రశ్నించింది. మీరెందుకు ఈ ఎత్తులో వస్తున్నారో చెప్పాలని అడిగింది. విస్తారా మరింత దగ్గరగా రావడంతో కాక్‌పీట్‌లో డేంజర్ బెల్ మోగింది. దీంతో ఎత్తుకు వెళ్లాలని ఏటీసీ నుంచి ఎయిరిండియా విమానానికి హెచ్చరికలు రావడంతో కెప్టెన్ కోహ్లీ సెకెన్ల వ్యవధిలో పైకి తీసుకెళ్లారు.

విమానాన్ని కుడివైపునకు తిప్పి ఎత్తుకు తీసుకెళ్లడంతో ఒకదానిపై నుంచి మరొకటి కేవలం 100 అడుగుల దూరంలో దూసుకెళ్లాయి. విస్తారా విమానం కూడా 600 అడుగుల కిందకు వెళ్లడంతో కొద్ది సెకన్ల వ్యవధిలో పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డారు. రెండు విమానాలు ఒకదాన్ని మరొకటి ఢీకొట్టే ప్రమాదాన్ని పైలెట్లు తప్పించగలిగారు. సమయస్ఫూర్తితో వ్యవహరించి పెను ప్రమాదాన్ని తప్పించి, 261 మంది ప్రాణాలు కాపాడిన ఎయిర్ఇండియా కెప్టెన్ అనుపమ కోహ్లీపై ప్రశంసలు వర్షం కురుస్తోంది. ఇటీవలి కాలంలో భారత గగనతలపై కొద్దిలో తప్పి పోయిన భారీ ప్రమాద ఘటన ఇదేనని చెబుతున్నారు. ఆ సమయంలో విస్తారా విమానంలో 152 మంది, ఎయిర్‌ఇండియా విమానంలో 109 ప్రయాణికులు ఉన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.