యాప్నగరం

అసోంలో జలప్రళయం.. 9కి చేరిన మృతుల సంఖ్య, స్తంభించిన రవాణా

అసోంలో జల ప్రళయానికి ప్రజలు నిర్వాసితులయ్యారు. ఉన్న ఊరును, కట్టుకున్న గూడును కోల్పోయి.. అల్లాడుతున్నారు. ఊర్లకు ఊర్లు జల సమాధి అయ్యాయి. రోడ్లు తెగిపోయాయి. రవాణా స్తంభించిపోయింది. అసోంలో చాలా ప్రాంతాలు నీళ్లలో నానుతున్నాయి. అక్కడి ప్రభుత్వ భవనాల్లో తలదాచుకుంటున్నారు. పునరావాసంలో ఉన్న ప్రజలకు విమానాల ద్వారా ఆహారాన్ని అందిస్తున్నారు. అలాగే బాధితులను కాపాడ్డానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని అసోం రాష్ట్ర ముఖ్యమంత్రి హిమాంత బిశ్వ శర్మ వెల్లడించారు.

Authored byAndaluri Veni | Samayam Telugu 19 May 2022, 5:26 pm

ప్రధానాంశాలు:

  • కొనసాగుతున్న వరద బీభత్సం
  • నీట మునిగిన 1,089 గ్రామాలు
  • తెగిపోయిన కట్టలు, ధ్వంసమైన రోడ్లు, వంతెనలు
  • రూ.1000 కోట్లు మంజూరు చేసిన కేంద్రం

హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu అసోంలో వరదలు
అసోంలో వరద బీభత్సానికి ఎంతోమంది తమ గూడును, నీడను కోల్పోయారు. జలమయమైన గ్రామాల్లో ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ధీనంగా సాయం కోసం ఎదురుచూస్తున్నారు. వెళ్లే దారిలేక.. తినడానికి తిండి లేక అల్లాడుతున్నారు. ఈ జలవిలయానికి కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోయారు. ఇప్పటి వరకు అధికారికంగా చనిపోయిన వారి సంఖ్య తొమ్మిదికి చేరుకుంది. అనధికారంగా ఈ సంఖ్య ఇంకా ఎక్కువే ఉండే అవకాశం లేకపోలేదు. వరద ధాటికి రాష్ట్రంలో 27 జిల్లాలో ఆరు లక్షల మందికిపైగా ప్రజలు నిరాశ్రయులయ్యారు. అయితే వారందరికి అధికారులు ప్రభుత్వ భవనాల్లో పునరావాసం కల్పిస్తున్నారు. అలాగే 1,089 గ్రామాలు నీట మునిగాయి.

వంతెనలు, రోడ్లు ధ్వంసం..

జిల్లాలో కట్టలు తెగిపోయాయి. రోడ్లు, వంతెనలు ధ్వంసమయ్యాయి. దాంతో రవాణా వ్యవస్థ నిలిచిపోయింది. చాలా ప్రాంతాల్లో పాఠశాలల భవనాలు దెబ్బతిన్నాయి. కొన్నిచోట్ల కొండ చరియలు విరిగిపడడంతో చాలా ఇళ్లు కూలిపోయాయి. పంట పొలాలు నాశనం అయ్యాయి. ఒక్క నాగోన్ జిల్లాలోనే 2.88 లక్షల మంది ప్రజలు ప్రభావితమయ్యారు. కొండ ప్రాంతమైన డిమా హసావో జిల్లాలో రైలు, రోడ్డు కనెక్టివిటీ తెగిపోయింది. అదే ప్రాంతంలో కొండచరియలు విరిగిపడ్డాయి. కాచర్, కరీంగంజ్, హైలకండి జిల్లాలో రహదారులు కొట్టుకుపోయాయి. దాంతో రాకపోకలకు అవకాశం లేకుండా పోయింది. మరోవైపు ఆర్మీ, పారామిలట్రీ బలగాలు, పోలీసులు రంగంలోకి దిగి వరద బాధితులకు సాయం చేస్తున్నారు. ఇళ్లల్లో చిక్కుకుపోయిన వేలాది మందిని రక్షించారు.


వరద సాయం వెయ్యి కోట్లు మంజూరు...

దీంతో దక్షిణ అసోంకు కనెక్టివిటీని పునరుద్ధరించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ చెప్పారు. నిరాశ్రయులైన వారికి ఆహారం అందించే ఏర్పాట్లు చేశామని, ఇప్పటికే డిమా హసావోలో ప్రభుత్వం నాలుగు మెట్రిక్ టన్నుల ఆహారాన్ని విమానం ద్వారా అందజేసినట్టు తెలిపారు. వరద సాయం కింద అసోంకు కేంద్రం రూ.1000 కోట్లు మంజూరు చేసిందని, రాష్ట్ర ప్రభుత్వం రూ.150 కోట్లు విడుదల చేసిందని సీఎం వెల్లడించారు. కనెక్టివిటీని పునరుద్ధరించడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. అయితే రైల్వే లింక్‌ను పునరుద్ధరించడానికి 45 రోజులు సమయం పడుతుందన్నారు.


ప్రతి ఏటా జల విలయం..

ప్రకృతి వైపరీత్యమే అయినప్పటికీ మిగతా ప్రాంతాల్లో వరదలకు అసోంలో జల ప్రళయానికి చాలా తేడా ఉంది. ఎక్కువ వరదలకు గురయ్యే రాష్ట్రాల్లో అసోం కూడా ఒకటి. తరచుగా వరదలకు గురయ్యే భూభాగం గుజరాత్, రాజస్థాన్, బీహార్, అసోంలోని ఎక్కువగా ఉంది. ఇక్కడ అనేక సార్లు జల విలయాలు సంభవిస్తున్నాయి. హిమాలయాల్లో కురిసే భారీ వర్షాలకు నీరంతా బ్రహ్మపుత్ర, గంగా నదుల ఉపనదుల్లోకి చేరుతుంది. కానీ నీళ్లు ఎక్కువవడంతో వరద నీరు వెల్లువెత్తుతుంది. అసోంలో ప్రతి ఏటా ఎగువ, దిగువ ప్రాంతాల్లో వరదల సమస్య తలెత్తుతూనే ఉంది.

అయితే నదులకు ఆనకట్టలు కట్టడం వల్లే .. ఇది కొంత వరకు ఉపయోగపడినా అది ఖర్చుతో కూడిన పని. అందుకే ఆ నీటిని ఆయకట్టుకు మళ్లించేలా ప్రయత్నాలు చేయాలని నిపుణులు అంటున్నారు. ఆనకట్టలు నిర్మించడం, నదుల్లో పూడిక తీయడం వంటి పనులతో పాటు వరద నిర్వహణపై అధికారులు దృష్టి సారించాలని నిపుణులు అంటున్నారు. ముప్పు తగ్గించే విధంగా చర్యలు తీసుకోవాలంటున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.