యాప్నగరం

మరోసారి సుప్రీం తలుపుతట్టిన నిర్భయ దోషి.. తక్షణ విచారణకు అభ్యర్థన

నిర్భయ నిందితులకు ఉరిశిక్ష అమలుచేయాలని రెండోసారి ఢిల్లీ కోర్టు డెత్ వారెంట్ జారీచేసిన విషయం తెలిసిందే. దోషులు కూడా తమకున్న అన్ని అవకాశాలను వినియోగించుకునే ప్రయత్నం చేస్తున్నారు.

Samayam Telugu 27 Jan 2020, 1:23 pm
నిర్భయ దోషులను ఫిబ్రవరి 1న ఉరితీయడానికి ఏర్పాట్లు చేస్తుంటే, దానిని ఎలాగైనా పొడిగించుకోవాలని దోషులు ప్రయత్నిస్తున్నారు. తాజాగా, నిర్భయ దోషి ముఖేశ్ కుమార్ సింగ్ సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. క్షమాభిక్ష కోసం తాను చేసిన పిటిషన్‌ను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ తిరస్కరించడాన్ని సవాల్ చేస్తూ సోమవారం సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశాడు. ముఖేశ్ కుమార్ పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్‌ను జనవరి 17న రాష్ట్రపతి తిరస్కరించిన విషయం తెలిసిందే. తన పిటిషన్‌పై తక్షణమే విచారణ చేపట్టాలని ముఖేశ్ కోరాడు.
Samayam Telugu nirbhaya


ఈ పిటిషన్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బాబ్డే, జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ సూర్య కాంత్‌ల త్రిసభ్య ధర్మాసనం ముందుకు వచ్చింది. దీనిపై చీఫ్ జస్టిస్ మాట్లాడుతూ.. ఒకరిని ఉరి తీయబోతున్నట్లయితే దీని కంటే మరేమీ అత్యవసరం కాదన్నారు. ఫిబ్రవరి 1న ఉరిశిక్ష అమలుచేయాలని ఆదేశించిన అధికారిని సంప్రదించాలని ముఖేశ్ తరఫు లాయర్‌కు సూచించారు.

నలుగురు దోషులకు ఫిబ్రవరి 1న ఉదయం 6 గంటలకు ఉరిశిక్ష అమలుచేయాలని ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టు రెండోసారి డెత్ వారెంట్ జారీచేసింది. దోషి ముఖేశ్ కుమార్ సింగ్ క్యూరేటివ్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసిన తర్వాత క్షమాభిక్ష కోసం రాష్ట్రపతికి అర్జీ పెట్టుకున్నాడు.

మరోవైపు, దోషులు పవన్‌ కుమార్, అక్షయ్‌ తరఫున లాయర్ ఏపీ సింగ్‌ పాటియాలా హౌస్‌ కోర్టులో శుక్రవారం పిటిషన్‌ వేశారు. తన క్లయింట్స్ క్యురేటివ్‌, క్షమాభిక్ష పిటిషన్లు దాఖలుచేయడానికి అవసరమైన పత్రాలను ఇవ్వడంలో తీహార్ జైలు అధికారులు జాప్యం చేశారని, అందువల్లే ఆ ఇద్దరూ క్షమాభిక్ష పిటిషన్‌ వేయడంలో ఆలస్యమైందని ఆరోపించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.