యాప్నగరం

రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌పై అవిశ్వాస తీర్మానం.. ఎన్నికై వారం గడవకముందే!

No-Confidence Motion: రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్‌పై విపక్షాలు అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చాయి. వ్యవసాయ బిల్లుల ఆమోదం విషయంలో ఏకపక్షంగా వ్యవహరించారని ఆరోపించాయి.

Samayam Telugu 20 Sep 2020, 10:10 pm
వ్యవసాయ బిల్లులపై చర్చ సందర్భంగా రాజ్యసభలో రేగిన రగడ ప్రకంపనలు రేపుతోంది. రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌ హరివంశ్‌ నారాయణ్ సింగ్‌పై ప్రతిపక్ష పార్టీలు అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చాయి. జేడీయూ నుంచి ఎంపీగా గెలిచిన ఆయన ఆరు రోజుల కిందటే రాజ్యసభకు తిరిగి ఎన్నికైన విషయం తెలిసిందే. వ్యవసాయ బిల్లులను కేంద్ర ప్రభుత్వం అప్రజాస్వామికంగా ఆమోదింపజేసుకుందని.. అందుకు హరివంశ్ నారాయణ సింగ్ సహకరించారని విపక్షాలు ఆరోపించాయి. ఆదివారం (సెప్టెంబర్ 20) 12 పార్టీలు కలిసి ఈ తీర్మానం ఇచ్చినట్లు కాంగ్రెస్‌ ఎంపీ అహ్మద్‌ పటేల్‌ తెలిపారు.
Samayam Telugu రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్
Rajya Sabha Deputy Chairman Harivansh Narayan Singh


అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చిన పార్టీల్లో కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్, సీపీఐ, సీపీఎం, ఆర్జేడీ తదితర పార్టీలు ఉన్నాయి. రైతు, వ్యవసాయ విధానాలపై రాజ్యసభలో ఆదివారం చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఈ నోటీసు ఇచ్చినట్లు అహ్మద్ పటేల్ తెలిపారు. దేశ చరిత్రలో ఇదో చీకటి రోజు అని ఆయన పేర్కొన్నారు.

లోక్‌సభలో ఆమోదం పొందిన ‘ఫార్మర్స్‌ ప్రొడ్యూస్‌ ట్రేడ్‌ అండ్‌ కామర్స్‌ బిల్లు’, ‘ఫార్మర్స్‌ అగ్రిమెంట్‌ ఆన్ ప్రైస్‌ అస్యూరెన్స్‌ అండ్ ఫార్మర్స్‌ సర్వీసు’ బిల్లులపై రాజ్యసభలో వాడీవేడీ చర్చ జరిగింది. బిల్లును వ్యతిరేకిస్తూ విపక్ష సభ్యులు పోడియం వద్దకు దూసుకొచ్చారు. బిల్లు పత్రాలను చించివేసి వైస్ ఛైర్మన్ మీదకు విసిరేశారు. ఈ గందరగోళం నడుమే బిల్లు ఆమోదం పొందినట్లు రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌ హరివంశ్‌ నారాయణ సింగ్‌ ప్రకటించారు. మూజువాణి ఓటుతో బిల్లు ఆమోదం పొందినట్లు తెలిపారు.

సభ్యులు ఓటింగ్ జరపాలని కోరినప్పటికీ డిప్యూటీ ఛైర్మన్‌ తిరస్కరించడం పట్ల విపక్షాల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ప్రజాస్వామ్య సంప్రదాయాలకు డిప్యూటీ ఛైర్మన్ తూట్లు పొడిచారని మండిపడ్డాయి. బిల్లులకు వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తమవుతున్న సమమయంలో సభ రేపటికి వాయిదా వేయాలని కోరినప్పటికీ.. డిప్యూటీ ఛైర్మన్‌ ఏకపక్షంగా వ్యవహరించారని అహ్మద్‌ పటేల్‌ ఆరోపించారు. సంబంధిత మంత్రి సమాధానం ఇచ్చిన అనంతరం ఓటింగ్‌ నిర్వహించాలని కోరినప్పటికీ ఆయన వినిపించుకోలేదని పేర్కొన్నారు.

మరోవైపు.. వ్యవసాయ బిల్లులు పార్లమెంట్ ఆమోదం పొందడం పట్ల ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఇవి రైతులకు ఎంతగానో దోహదపడతాయని ఆయన పేర్కొన్నారు. బిల్లులకు ఆమోదం లభించగానే తనకు సంతోషంతో ఆనందబాష్పాలు వచ్చాయని ఆయన తెలిపారు.

Also Read: కరోనా వ్యాక్సిన్ లేకుండా హెర్డ్ ఇమ్యూనిటీకి ప్రయత్నిస్తే దారుణ పరిణామాలు: కేంద్రం

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.