యాప్నగరం

భారత్‌కు అమెరికా మద్దతుపై చైనా ఆక్రోశం.. మూడో వ్యక్తి జోక్యం తగదని ప్రకటన

ప్రతిష్ఠాత్మక ‘2+2 చర్చలు’ ముగిసిన అనంతరం కీలక ప్రకటన చేసిన అమెరికా.. సార్వభౌమత్వం, స్వేచ్ఛను కాపాడుకునేందుకు భారత్‌ చేసే ప్రయత్నాల్లో నిరంతరం వెన్నంటి నిలుస్తామని ఉద్ఘాటించింది.

Samayam Telugu 28 Oct 2020, 3:53 pm
సార్వభౌమత్వం, స్వేచ్ఛను కాపాడుకోవడానికి భారత్ చేసే ప్రయత్నాలకు తమ సహకారం ఎప్పుడూ ఉంటుందని అమెరికా రక్షణ, విదేశీ వ్యవహారాల మంత్రులు మార్క్‌ ఎస్పర్‌, మైక్‌ పాంపియోలు చైనాకు పరోక్షంగా హెచ్చరికలు పంపిన విషయం తెలిసిందే. ఈ ప్రకటనలపై డ్రాగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ పాంపియో, ఎస్పర్‌ పర్యటనపై విమర్శలు గుప్పించింది. సరిహద్దు సమస్య రెండు దేశాలకు సంబంధించిన ద్వైపాక్షిక అంశమని ఇందులో మూడో పక్షం జోక్యం అనవసరమని ఎదురుదాడికి దిగింది.
Samayam Telugu అమెరికా-భారత్ బెకా ఒప్పందం


భారత్‌-చైనా విషయంలో అమెరికా జోక్యం ఎంతమాత్రం తగదంటూ ఢిల్లీలోని చైనా రాయబార కార్యాలయం ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. అగ్రరాజ్యంపై విమర్శల దాడికి దిగిన చైనా.. అమెరికాది పక్షపాత ధోరణి, ప్రచ్ఛన్న యుద్ధ మనస్తత్వం అంటూ విరుచుకుపడింది.

‘సరిహద్దు సమస్య అనేది చైనా, భారత్‌ మధ్య ద్వైపాక్షిక అంశం. దౌత్య, సైనిక పరమైన చర్చల ద్వారా ఉద్రిక్తతలను తగ్గించడానికి ఇరు దేశాలు ప్రయత్నిస్తున్నాయి. విభేదాలను పరిష్కరించుకునే తెలివి, సామర్థ్యం భారత్‌, చైనాకు ఉన్నాయి. ఇందులో మూడో పక్షం జోక్యం చేసుకునేందుకు ఎలాంటి అవకాశం లేదు’ అని చైనా ఎంబసీ కార్యాలయం ఆ ప్రకటనలో పేర్కొంది.

అమెరికా తన ఆధిపత్యాన్ని కొనసాగించడానికి ‘ఇండో-పసిఫిక్ వ్యూహం’ పేరుతో వివిధ సమూహాల మధ్య ఘర్షణను ప్రేరేపించడం, భౌగోళిక రాజకీయ పోటీని రేకెత్తించడం, ప్రత్యేకమైన సైద్ధాంతిక సమూహాలను నిర్వహిస్తోందని తూర్పారబట్టింది. ‘చైనా ముప్పు’ అని పదేపదే చెబుతూ అమెరికా ప్రపంచంపై తన ఆధిపత్యాన్ని పెంచుకోవాలని చూస్తోందని దుయ్యబట్టింది.

‘చైనీస్‌ కమ్యూనిస్ట్‌ పార్టీవి బెదిరింపు వ్యూహాలు అని పాంపియో చాలాసార్లు విమర్శించారు. కానీ అదే కమ్యూనిస్ట్‌ పార్టీ నాయకత్వంలో చైనా ప్రజలు కొవిడ్‌ వైరస్‌పై వ్యూహాత్మక విజయాన్ని సాధించారు’ వ్యాఖ్యానించింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.