యాప్నగరం

తప్పుడు చికిత్సతోనే జన్యుమార్పులు.. కొత్త స్ట్రెయిన్‌పై ఐసీఎంఆర్ సంచలన వ్యాఖ్యలు

UK Covid Strain ఇప్పటికే పలు దేశాల్లో పాదం మోపింది. భారత్‌లో ఇప్పటి వరకు 20 మందిలో ఈ జన్యువును గుర్తించారు. ఈ నేపథ్యంలో ఐసీఎంఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

Samayam Telugu 30 Dec 2020, 1:08 pm
యునైటెడ్ కింగ్‌డమ్‌లో బయటపడిన కొత్తరకం కరోనా పలు దేశాలకు విస్తరించింది. ఈ మహమ్మారి భారత్‌లోకి ప్రవేశించింది. అయితే, ఇది అంత ప్రమాదికారి కాదని నిపుణులు అంటున్నా.. అత్యంత వేగంగా వ్యాప్తి చెందడమే ఆందోళనకు గురిచేస్తోంది. అయితే, వైరస్‌లో జన్యుమార్పులకు కారణం తప్పుడు వైద్యమేనని భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) హెచ్చరించింది.
Samayam Telugu ఐసీఎంఆర్ డైరెక్టర్


ప్రస్తుతం కోవిడ్-19కు సంబంధించినంత వరకు తప్పుడు వైద్యం వల్లే వైరస్ జన్యుపరంగా ఉత్పరివర్తనం చెందుతోందని ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ బలరామ్ భార్గవ అన్నారు. అనవసరమైన చికిత్సలను ఉపయోగించడం వల్లే మార్పులు జరుగుతున్నాయని, బ్రిటన్ స్ట్రెయిన్ కూడా అలా వచ్చిందేనని బలరాం భార్గవ అభిప్రాయపడ్డారు.

సాధారణంగా వైరస్‌లో జన్యు మార్పులు జరుగుతాయి.. కానీ, బ్రిటన్ స్ట్రెయిన్ విషయంలో మాత్రం వేగంగా వ్యాపించడమే కలవరానికి గురిచేస్తోందని అన్నారు. తప్పుడు చికిత్సలతో వైరస్ మీద రోగనిరోధక ఒత్తిడి పెరగడం వల్లే మార్పులు జరుగుతున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. వాతావరణ పరిస్థితులే మహమ్మారిలో ఉత్పరివర్తనాలకు కారణమని నిపుణులు చెబుతున్నా.. అశాస్త్రీయ వైద్యంతో వైరస్‌పై ఒత్తిడి పెంచే ప్రయత్నం చేసినా మార్పులు జరుగుతాయని వివరించారు.

వైద్యులు, శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని స్పష్టం చేశారు. యాంటీ వైరల్ లేదా యాంటీ కోవిడ్ థెరపీల వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదని శాస్త్రీయ పరిశోధన పత్రాలు వెల్లడించిన విషయాన్ని గుర్తుచేశారు.

టీకాతో కరోనా రోగనిరోధకశక్తి పెరుగుతుందని, కాబట్టి వ్యాక్సినేషన్‌ను కొంచెం జాగ్రత్తగా పరిశీలించాల్సి ఉంటుందని సూచించారు. కోవిడ్-19కు ప్రస్తుత టీకాలన్నీ వైరస్‌లోని ఎస్ ప్రొటీన్‌ను లక్ష్యంగా చేసుకుని అభివృద్ధి చేసినవేనని, కొన్ని ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్లూ ఉన్నాయని ఆయన చెప్పారు. ఈ టీకాలన్నీ ప్రస్తుతానికి వైరస్‌పై సమర్ధంగా పనిచేస్తున్నాయని వివరించారు.

‘కాబట్టి వైరస్‌పై ఎక్కువ రోగనిరోధక శక్తి ఒత్తిడిని మన శాస్త్రీయ సమాజం కలిగించరాదు.. ప్రయోజనం ఉండే చికిత్సలను క్రమ విధానంలో నిర్వహించాలి. ప్రయోజనం ఉండకపోతే ఆ చికిత్సలను ఉపయోగించకూడదు. అలా కాకుండా వైరస్ మీద విపరీతమైన రోగనిరోధక ఒత్తిడిని కలిగించడంతో మరింత పరివర్తన చెందుతుంది’ అన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.