యాప్నగరం

అనంత్‌నాగ్‌లో ఎన్‌కౌంటర్.. ఓ జవాన్, ఇద్దరు ఉగ్రవాదులు మృతి

అమర్‌నాథ్ యాత్ర ప్రారంభానికి ముందు జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాదుల ఏరివేత చర్యలను సైన్యం ముమ్మరం చేసింది. రెండు రోజులుగా అనంత్‌నాగ్ జిల్లాల్లో రెండు ఎన్‌కౌంటర్లు చోటుచేసుకున్నాయి.

Samayam Telugu 18 Jun 2019, 11:53 am
జమ్మూ కశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లా అచబల్ ప్రాంతంలో సోమవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఆర్మీ మేజర్ కేతన్ శర్మతో సహా ఓ ఉగ్రవాది చనిపోయారు. మరో మేజర్‌ స్థాయి అధికారి, ఇద్దరు జవాన్లు గాయపడ్డారు. తాజాగా, మంగళవారం ఉదయం అనంత్‌నాగ్‌ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఓ జవాన్ ప్రాణాలు కోల్పోగా, ఇద్దరు ముష్కరులు హతమయ్యారు. బిజ్‌బెహరా ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న నిఘా వర్గాల సమాచారంతో భద్రతాదళాలు అక్కడకు చేరుకుని తనిఖీలు నిర్వహించారు. ఈ సమయంలో ఉగ్రవాదులు కాల్పులకు పాల్పడటంతో సైన్యం అప్రమత్తమైంది. దీంతో ఇరువర్గాల మధ్య భీకర కాల్పులు జరిగాయి. ఉగ్రవాదుల కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన జవాన్‌ను హాస్పిటల్‌కు తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందారు.
Samayam Telugu Encounter


కాగా, పుల్వామా జిల్లాలో సోమవారం ఆర్మీ పెట్రోలింగ్ వాహనాన్ని శక్తివంతమై పేలుడు పదార్థాల (ఐఈడీ)తో కూడిన వాహనంతో పేల్చేందుకు ఉగ్రవాదులు సోమవారం ప్రయత్నించారు. ఈ ఘటనలో తొమ్మిది మంది జవాన్లు, ఇద్దరు పౌరులు స్వల్పంగా గాయపడ్డారు. పుల్వామా జిల్లా ఈద్‌గాహ్‌ అరిహాల్‌ సమీపంలోని అరిహాల్‌- లస్సిపోర రహదారిపై ప్రయాణిస్తున్న 44 రాష్ట్రీయ రైఫిల్స్‌ వాహనశ్రేణిని లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారని రక్షణశాఖ అధికార ప్రతినిధి కల్నల్‌ రాజేశ్‌ కాలియా తెలిపారు. బుల్లెట్‌, మైన్‌ ప్రూఫ్‌ కేస్పర్‌ వాహనంలో ప్రయాణిస్తున్న సైనికులపై ఈ దాడి జరిగిందని వివరించారు. ఉగ్రదాడిలో గాయపడిన సైనికులను చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రిలో చేర్పించినట్టు వెల్లడించారు. పుల్వామాలో ఫిబ్రవరి 14న జరిగిన ఉగ్రదాడిలో 40 మంది సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు అమరులైన ప్రాంతానికి 27 కిలోమీటర్ల దూరంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.