యాప్నగరం

ఆ లంచావతారులకు జడ్జ్ ఝలక్.. కేరళకు సాయం చేయాలని ఆదేశం

వరదలతో నష్టపోయిన కేరళకు చేయూతనివ్వడానికి దేశవ్యాప్తంగా ప్రజలు స్పందిస్తుంటే, సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ముగ్గురు నిందితులకు జరిమానా విధిస్తూ ఆ మొత్తాన్ని కేరళ సీఎం సహాయ నిధికి పంపాలని ఆదేశించింది.

Samayam Telugu 28 Aug 2018, 1:52 pm
వరదలతో నష్టపోయిన కేరళకు చేయూతనివ్వడానికి దేశవ్యాప్తంగా ప్రజలు స్పందిస్తుంటే, సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ముగ్గురు నిందితులకు జరిమానా విధిస్తూ ఆ మొత్తాన్ని కేరళ సీఎం సహాయ నిధికి పంపాలని ఆదేశించింది. ఈ విలక్షణమైన ఆదేశాలను పంచకుల సీబీఐ న్యాయస్థానం వెలువరించింది. లంచం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ఎస్పీలు అనిల్ కుమార్, అజయ్ సింగ్‌లోపాటు కేంద్ర ఎక్సైజ్ అండ్ ఆడిట్ విభాగం మాజీ ఎస్ఐ రవీంద్ర దహియాలు ఒక్కొక్కరూ రూ.15,000 చొప్పున రూ.45,000 కేరళకు అందజేయాలని సూచింది. గతేడాది ఫిబ్రవరి 27న హరియాణాలోని సోనేపట్ సమీపంలో ఓ సంస్థ నుంచి రూ.3 లక్షల లంచం తీసుకుంటూ ఈ ముగ్గురు మాజీ అధికారులు పట్టుబడ్డారు.
Samayam Telugu అవినీతి అధికారులకు ఝలక్


ఈ కేసు విచారణ కొనసాగుతుండగానే సీబీఐ ప్రత్యేక కోర్టు జడ్జ్ జగ్‌దీప్ సింగ్ ఈ ఆదేశాలను జారీచేశారు. కేరళ సీఎం సహాయ నిధికి డబ్బు జమచేసి, దానికి సంబంధించిన రసీదును వచ్చే అక్టోబరు 1 నాటికి తమకు సమర్పించాలని తెలిపారు. తదుపరి విచారణను అక్టోబరు 1కి వాయిదా వేసిన న్యాయమూర్తి, తక్షణమే డబ్బు పంపాలని ఆదేశించారు. గతంలో ప్రాసిక్యూషన్ సమర్పించిన సాక్ష్యాలను ప్రశ్నించడంలో విఫలమైన నిందితుల తరఫున లాయర్ మరోసారి దీనికి అనుమతి ఇవ్వాలని సోమవారం కోర్టును కోరారు. మే 25న బార్ అసోసియేషన్ విధులను బహిష్కరించడం వల్లే ఆ రోజున క్రాస్ ఎగ్జామిన్ చేయలేకపోయామని పేర్కొన్నారు. అయితే వారి అభ్యర్థనను మన్నించిన న్యాయస్థానం, ఇదే సమయంలో కేరళ వరద బాధితులకు నిధులు అందజేయాలని సూచించింది.

డబుల్ బిల్లింగ్, ఎక్సైజ్ డ్యూటీ ఎగవేత లాంటి ఆరోపణలతో రూ.25 నుంచి 30 లక్షలు వరకు జరిమానా కట్టాల్సిన ఓ సంస్థను దాన్ని నుంచి బయటపడటానికి ఈ ముగ్గురు అధికారులూ రూ.10 లక్షలు లంచం కావాలని డిమాండ్ చేశారు. చివరకు రూ.9 లక్షలు డీల్ కుదరడంతో తొలి విడతగా రూ.3 లక్షలు ఇవ్వడానికి సదరు సంస్థ ముందుకొచ్చింది. దీనిపై అవినీతి నిరోధక శాఖ అధికారులకు సమాచారం అందడంతో వారిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.