యాప్నగరం

లాక్‌డౌన్ 5.0 తప్పదా? పొడిగిస్తే ఎలా ఉండబోతుంది?

PM Modi: దేశవ్యాప్త లాక్‌డౌన్‌ను మరోసారి పెంచనున్నారా? లాక్‌డౌన్ 5.0 తప్పదా? దీనికి ఔననే సంకేతాలు వస్తున్నాయి. మన్ కీ బాత్ సందర్భంగా ప్రధాని మోదీ దీనిపై స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది.

Samayam Telugu 28 May 2020, 3:18 pm
రోనా కట్టడి కోసం విధించిన లాక్‌డౌన్‌‌ను మరోసారి పొడిగించనున్నారా? లాక్‌డౌన్ 4.0 గడువు దగ్గర పడుతుండటంతో దేశంలో ఈ చర్చ ఊపందుకుంది. దీనికి ఔననే సంకేతాలు అందుతున్నాయి. లాక్‌డౌన్‌ 5.0 ఉంటుందనే వార్త ఢిల్లీలో అధికార వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. మే 31 తర్వాత మరో రెండు వారాల పాటు లాక్‌డౌన్‌ కొనసాగించే యోచనలో మోదీ ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రధాని మోదీ వచ్చే ఆదివారం (మే 31) నిర్వహించనున్న ‘మన్ కీ బాత్’ రేడియో కార్యక్రమంలో దీనికి సంబంధించి ప్రకటన చేయవచ్చని తెలుస్తోంది. లాక్‌డౌన్ 4.0కు మే 31 చివరి రోజు కావడం గమనార్హం.
Samayam Telugu లాక్‌డౌన్ పొడిగింపు
Lockdown 5.0


లాక్‌డౌన్ 5.0లో మరిన్ని సడలింపులు ఇచ్చే అవకాశం ఉంది. ఈ దఫా లాక్‌డౌన్‌లో దేశంలో 70 శాతానికి పైగా కేసులు నమోదైన 11 ప్రధాన నగరాల పైనే ప్రధానంగా దృష్టి పెట్టే అవకాశం ఉంది. వీటిలో ఢిల్లీ, ముంబైతో పాటు బెంగళూరు, చెన్నై, కోల్‌కతా, అహ్మదాబాద్, పుణే, థానే, జైపూర్, సూరత్, ఇండోర్‌ ఉన్నాయి. ఈ నగరాల్లో కఠిన ఆంక్షలు కొనసాగించనున్నట్లు తెలుస్తోంది.

ఈ 11 నగరాలు మినహా.. దేశంలోని మిగిలిన ప్రాంతాల్లో అన్ని రకాల కార్యకలాపాలకు సడలింపులు ఇచ్చే అవకాశం ఉంది. ఈసారి ఆలయాలు, ఇతర ప్రార్థనా మందిరాల్లో భక్తులకు దర్శనాన్ని పున: ప్రారంభించే అవకాశం ఉంది. ఈ దిశగా కర్ణాటక ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయాన్ని ప్రకటించింది. తమ రాష్ట్రంలో జూన్ 1 నుంచి ఆలయాల్లోకి భక్తులను అనుమతించనున్నట్లు ప్రకటించింది.

మాస్క్‌లు ధరించడం, భౌతిక దూరం పాటించడం తదితర నిబంధనలతో దేవాలయాల్లోకి భక్తులను అనుమతించే అవకాశం ఉంది. జాతరలు, పండుగలు, సామూహిక ప్రార్థనలకు మాత్రం అనుమతించకపోవచ్చని తెలుస్తోంది. ఇప్పటికే కర్ణాటక ప్రభుత్వం ఇందుకు సంబంధించి ఇవే తరహా నిబంధనలను ప్రకటించింది. ఇక సినిమా హాళ్లు, పాఠశాలలు, కాలేజీలు, షాపింగ్‌ మాల్స్, బార్లు, పబ్బులు లాంటి ప్రజలు భారీగా గుమికూడే అవకాశం ఉన్న వాటిపై ఆంక్షలు మరికొన్ని రోజులు కొనసాగే అవకాశం ఉంది.

కేంద్ర హోం మంత్రిత్వ శాఖ మాత్రం లాక్‌డౌన్ పొడిగింపు వార్తలను తోసిపుచ్చింది. ఇప్పటివరకు అలాంటి ప్రణాళికలేవీ లేదని చెప్పడం గమనార్హం.

Also Read: నేపాల్ ప్రధానికి బిగ్ షాక్.. కొత్త మ్యాప్‌కు బ్రేక్, భారత్ ప్రమేయం లేకుండానే!
Must Read: కరోనా వైరస్ మరోసారి విజృంభించే ప్రమాదం: WHO

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.