యాప్నగరం

అతిపెద్ద భగవద్గీతను ఆవిష్కరించిన ప్రధాని మోదీ

ప్రపంచంలోనే అతిపెద్దదైన భగవద్గీత. 2.8 మీటర్ల పొడవు, 2 మీటర్ల వెడల్పుతో భారీ గీత. మొత్తం 670 పేజీలు. ఢిల్లీలోని ఇస్కాన్‌లో ఆవిష్కరించిన ప్రధాని మోదీ.

Samayam Telugu 26 Feb 2019, 9:44 pm
ప్రపంచంలో అతిపెద్దదైన భగవద్గీతను ప్రధాని మోదీ ఆవిష్కరించారు. ఢిల్లీలోని ఇస్కాన్ ఆలయంలో మంగళవారం (ఫిబ్రవరి 26) జరిగిన కార్యక్రమంలో ప్రధాని మోదీ ఈ అతిపెద్ద భగవద్గీత పుస్తకాన్ని ఆవిష్కరించారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ఈ భగవద్గీత బరువు 800 కిలోలు. పొడవు 2.8 మీటర్లు, వెడల్పు 2 మీటర్లు (పుస్తకం మూసి ఉంచినప్పుడు). ఈ గీతా గ్రంథంలో మొత్తం 670 పేజీలున్నాయి. మనిషి ఎత్తు కంటే పొడవైన ఈ అరుదైన భగవద్గీత పుస్తకాన్ని వీక్షించడానికి త్వరలోనే సందర్శకులకు అవకాశం కల్పించనున్నారు.
Samayam Telugu gita


ఈ భారీ భగవద్గీత గ్రంథాన్ని తీర్చిదిద్దేందుకు ఇస్కాన్ సంస్థకు రెండున్నర ఏళ్లకు పైగా పట్టింది. దీన్ని ఇటలీలో ప్రత్యేకంగా తయారు చేయించారు. ఇటలీ నుంచి ఈ గ్రంథం భారత్ చేరుకునేందుకు నెల రోజుల సమయం పట్టింది. జనవరి 20న ఢిల్లీలోని ఇస్కాన్ మందిరానికి చేరుకుంది.

ఇస్కాన్ వ్యవస్థాపకులు ఆచార్య శ్రీమద్ ఎ.సి. భక్తివేదాంత స్వామి ప్రభుపాద.. గీతా ప్రచారాన్ని ప్రారంభించి 50 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా సంస్థ ఈ గ్రంథాన్ని రూపొందించింది. ఇందుకోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని ఇస్కాన్ కేంద్రాలు విరాళాలను సేకరించాయి. నవంబరు 11న దీన్ని ఇటలీలోని మిలాన్ పట్టణంలో ప్రదర్శించారు.

భగవద్గీతకు మరింత ప్రాచుర్యం కల్పించడానికి, నేటి తరానికి భగవద్గీత గొప్పదనాన్ని తెలియజెప్పడానికి ఈ భారీ గ్రంథాన్ని రూపొందించారు. గీతలో చెప్పిన బోధనలు ప్రపంచవ్యాప్తంగా ఎంతో మందికి స్ఫూ్ర్తినిచ్చాయని ప్రధాని మోదీ అన్నారు.

ప్రపంచంలోనే అతిపెద్దదైన భగవద్గీత గ్రంథాన్ని ఆవిష్కరించడానికి ప్రధాని మోదీ.. ఢిల్లీ మెట్రోలో ప్రయాణించారు. ఖాన్ మార్కెట్ నుంచి దక్షిణ ఢిల్లీలోని కైలాశ్ ప్రాంతానికి ఆయన మెట్రోలో చేరుకున్నారు. ఈ సందర్భంగా మెట్రోలో పలువురు సామాన్యులను మోదీ ఆప్యాయంగా పలకరించారు. రైలు బోగీలో ప్రయాణించిన కొంత మంది ముస్లిం వ్యక్తులతో ఆయన ఆసక్తికరంగా సంభాషించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.