యాప్నగరం

పటేల్ కృషి అమోఘం, అవి చెప్పడానికే ఇక్కడికి వచ్చా: ప్రణబ్

సొంత పార్టీ నుంచి ఎన్ని ఒత్తిళ్లు వస్తున్నా.. ఎవరెన్ని విమర్శలు చేస్తున్నా.. ఇవేవీ లెక్కచేయలేదు కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆహ్వానం మేరకు.. తను అనుకున్నట్లుగానే నాగపూర్‌ పర్యటనకు వచ్చారు.

Samayam Telugu 7 Jun 2018, 10:15 pm
సొంత పార్టీ నుంచి ఎన్ని ఒత్తిళ్లు వస్తున్నా.. ఎవరెన్ని విమర్శలు చేస్తున్నా.. ఇవేవీ లెక్కచేయలేదు కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆహ్వానం మేరకు.. తను అనుకున్నట్లుగానే నాగపూర్‌ పర్యటనకు వచ్చారు. మొదట సంఘ్ వ్యవస్థాపకుడైన హెడ్గేవార్‌కు నివాళులర్పించిన ఆయన, తర్వాత ఆరెసెస్స్ ప్రధాన కార్యాలయంలో జరిగిన 'తృతీయ వర్ష్ వర్గ్' కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జాతీయత, దేశభక్తి అన్న భావనలపై తన అభిప్రాయాన్ని వెల్లడించేందుకే ఇక్కడికి వచ్చానని స్పష్టంచేశారు.
Samayam Telugu pranab1


భారతదేశం ఒక భాష, ఒక మతం అని ఎప్పటికీ ఊహించలేమని.. భారతీయత అనే భావన మహాజన పదాలతో ఏర్పడిందని ప్రణబ్ అన్నారు. అసహనం, ఆందోళన అన్నవి మన జాతీయ భావనను దెబ్బతీస్తాయన్నారు. జాతి, జాతీయత అనే భావనలు ఐరోపా కంటే ముందే మన దేశంలో ఏర్పడ్డాయన్నారు. అనేక మంది విదేశీ యాత్రికులకు భారతీయత గురించి స్పష్టమైన అవగాహన ఇచ్చారన.. తక్షశిల, నలంద, విక్రమ శిల వంటి విశ్వవిద్యాలయాలు భారతీయ విద్యా వ్యాప్తికి నిదర్శనమని కొనియాడారు. బహుళత్వాన్ని ఆస్వాదించే గుణం మన జీవన విధానంలోనే ఉందని ఆయన అన్నారు.

అశోక చక్రవర్తి సమయంలో దేశమంతా భౌగోళికంగా ఏకఛత్రాధిపత్యం కిందకు వచ్చిందని.. దేశాన్ని ఏకతాటిపైకి తీసుకొచ్చిన ఘనత కచ్చితంగా మౌర్యులకే చెందుతుందన్నారు. మన దేశానికి వచ్చిన అనేక జాతులు, సంస్కృతులు మన జీవనవిధానంలో విలీనమయ్యాయని.. సర్వమతాల ఏకత్వంలోనే భారతీయత ఉందని స్పష్టంచేశారు.

'స్వరాజ్యమే నాజన్మ హక్కు' అని నినదించిన ధీరుడు బాలగంగాధర తిలక్ అని.. స్వాతంత్ర్యం ఎవరో ఇచ్చిన బహుమానం కాదని, పోరాడి తెచ్చుకున్నదన్నారు. సంస్థానాల విలీనంతో భారతదేశానికి ఒకరూపు తెచ్చిన మహనీయుడు సర్దార్ పటేల్ అని కొనియాడారు. దేశం కోసం ప్రజలే ఏర్పాటు చేసుకున్న గొప్ప రాజ్యాంగం మనది అని అన్నారు. దేశ ప్రజలంతా వసుదైక కుటుంబం, సర్వేజనా సుఖినోభవంతు భావన కలిగి ఉండాలని పిలుపునిచ్చారు. దేశంలోని ప్రతీ పౌరుడు వైవిధ్యతను, భిన్నత్వాన్ని గౌరవించాలని ప్రణబ్ ముఖర్జీ సూచించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.