యాప్నగరం

దేశం ఓ ముద్దుబిడ్డను కోల్పోయింది.. ఓ శకం ముగిసింది!

మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అస్తమించారు. ఆయన మరణవార్త విని పలువురు ప్రముఖులు స్పందించారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Samayam Telugu 31 Aug 2020, 11:56 pm
పర చాణక్యుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి, భారతరత్న ప్రణబ్‌ ముఖర్జీ (84) కన్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్యంతో పోరాడుతున్న ఆయన సోమవారం (ఆగస్టు 31) సాయంత్రం ఢిల్లీలోని ఆర్మీ హాస్పిటల్‌లో తుదిశ్వాస విడిచారు. ప్రణబ్ మరణం దేశానికి తీరని లోటని పలువురు ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని సహా పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు ప్రార్థించారు. ప్రణబ్ మృతిపై పలువురు ప్రముఖుల స్పందన వారి మాటల్లో..
Samayam Telugu ప్రణబ్ ముఖర్జీ
Pranab Mukherjee death condolences


మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ మరణవార్త నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ప్రణబ్ మరణంతో ఓ శకం ముగిసిపోయింది. దేశం ఓ ముద్దుబిడ్డను కోల్పోయింది. ప్రథమ పౌరుడిగా రాష్ట్రపతి భవన్‌ను ప్రజలకు చేరువ చేసిన ఘనత ఆయనది. ఆయన కుటుంబ సభ్యులకు, బంధువులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా - రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌

దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించడంలో ప్రణబ్ ముఖర్జీ చెరగని ముద్ర వేశారు. ఆయనో గొప్ప రాజనీతిజ్ఞుడు. రాజకీయ వర్గాల్లోనే కాకుండా, సామాన్యుల నుంచి కూడా మెప్పు పొందిన గొప్ప వ్యక్తి ఆయన. భారతరత్న ప్రణబ్‌ ముఖర్జీ మరణవార్త విని దేశం మొత్తం కంటతడి పెడుతోంది - ప్రధాని నరేంద్ర మోదీ

ప్రణబ్‌ ముఖర్జీ మరణం నన్ను కలచివేసింది. దేశం ఓ గొప్ప రాజనీతిజ్ఞుడిని కోల్పోయింది. ఎంతో శ్రమ, పట్టుదల, క్రమశిక్షణతో దేశ రాజ్యాంగ అత్యున్నత పదవిని చేపట్టారు. చేపట్టిన అన్ని పదవులకూ వన్నె తెచ్చారు. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా - ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు

ప్రణబ్‌ మృతితో దేశం పెద్ద రాజకీయ నేతను కోల్పోయింది. మాతృభూమికి ఆయన ఎనలేని సేవలు అందించారు. - హోం మంత్రి అమిత్‌ షా

ప్రణబ్‌ జీ మరణవార్తతో దేశం మొత్తం దు:ఖ సాగరంలో మునిగిపోయింది. యావత్‌ దేశంతో పాటు నేను కూడా ఆయనకు శ్రద్ధాంజలి ఘటిస్తున్నా. ప్రణబ్ కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా - కాంగ్రెస్ నేత రాహుల్‌ గాంధీ

భారతరత్న ప్రణబ్‌ ముఖర్జీ మనల్ని విడిచి వెళ్లిపోయారు. ఒక శకం ముగిసింది. ప్రణబ్‌ దాదాలేని ఢిల్లీ పర్యటన ఊహించుకోలేకపోతున్నా. నేను తొలిసారి ఎంపీగా గెలుపొందినప్పుడు ఆయన సీనియర్‌ కేబినెట్‌ మంత్రిగా ఉన్నారు. ఆయన రాష్ట్రపతిగా ఉన్నప్పుడు నేను ముఖ్యమంత్రిగా ఉన్నా. ఆయనతో ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి. రాజకీయాల నుంచి ఆర్థికశాస్త్రం దాకా అన్ని అంశాల్లో ఆయనొక లెజెండ్‌. నేను ఇవన్నీ తీవ్రమైన దు:ఖంతో రాస్తున్నా. అభిజిత్‌, శర్మిష్ఠకు నా ప్రగాఢ సానుభూతి. - పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ

తెలంగాణ అంశంతో ప్రణబ్‌ ముఖర్జీకి ఎంతో అనుబంధం ఉంది. యూపీఏ ప్రభుత్వం తెలంగాణ ఏర్పాటుకు వేసిన కమిటీకి ప్రణబ్‌ నాయకత్వం వహించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించిన బిల్లుపై సంతకం చేశారు. ప్రణబ్ ముఖర్జీ రాసిన ‘ద కొయలేషన్ ఇయర్స్’ పుస్తకంలోనూ తెలంగాణ అంశాన్ని ప్రస్తావించారు. యాదాద్రి దేవాలయాన్ని సందర్శించి, అక్కడ జరుగుతున్న పనులను అభినందించారు. వ్యక్తిగతంగా నా తరుఫున, తెలంగాణ ప్రజల తరుఫున ప్రణబ్‌కు నివాళులు అర్పిస్తున్నా - తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.