యాప్నగరం

చైనాతో యుద్ధమే వస్తే తప్పనిసరిగా పాక్ కల్పించుకుంటుంది.. పంజాబ్ సీఎం సంచలన వ్యాఖ్యలు

సరిహద్దుల్లో పాకిస్థాన్, చైనాల వైఖరిపై పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో మాదిరిగా భారత్‌పై దాడికి దిగితే చైనా మూల్యం చెల్లించుకోకతప్పదని అన్నారు.

Samayam Telugu 27 Aug 2020, 3:26 pm
పొరుగు దేశాలతో పొంచి ఉన్న ముప్పుపై పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సైన్యాన్ని మరింత బలోపేతం చేయాలని కేంద్రానికి సూచించారు. ఒకవేళ చైనాతో యుద్ధం ఎప్పుడు జరిగినా దాయాది పాకిస్థాన్ జోక్యం చేసుకుని తీరుతుందని అమరీందర్ పేర్కొన్నారు. ‘నా మాటలను గుర్తుంచుకోండి.. చైనాతో యుద్ధం అంటూ వస్తే పాక్ కూడా కల్పించుకుంటుంది. రెండు దేశాలు కుమ్మక్కువతాయి’ అని ఆయన వ్యాఖ్యానించారు.
Samayam Telugu పంజాబ్ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్
Punjab CM Amarinder Singh


లడఖ్‌లో చైనాతో నెలకొన్న సరిహద్దు వివాదంపై కూడా ఆయన స్పందిస్తూ.. మునపటి కంటే దేశం పరిస్థితి ఎంతో మెరుగయ్యిందని, మనపై దాడి చేయగలమని చైనా భావిస్తే.. అది మూర్ఖత్వమే అవుతుందని ఉద్ఘాటించారు. గాల్వాన్ లోయలోకి చైనా చొచ్చుకురావడం ఇదే తొలిసారి కాదని, 1962లోనూ చొరబడిందన్నారు.. అప్పటి కంటే భారత్ చాలా చాలా మెరుగైన స్థితిలో ఉందన్నారు. కానీ, సరిహద్దుల్లో టిబెట్ పీఠభూమి నుంచి హిందూ మహాసముద్రం వరకు డ్రాగన్ విస్తరించే ప్రయత్నాలు కొనసాగిస్తోందని, సైన్యాన్ని మరింత బలోపేతం చేయాల్సిన అవశ్యకత ఉందని అన్నారు.

హిమాచల్‌ ప్రదేశ్, సిక్కిమ్, అరుణా‌చల్ ప్రదేశ్‌లను తమవేనంటూ వాదిస్తోన్న చైనాకు సైనిక చర్య ద్వారానే అడ్డుకట్ట వేయగలమని అమరీందర్ సింగ్ ఉద్ఘాటించారు. చైనాను ధీటుగా ఎదుర్కోడానికి పర్వత ప్రాంతాల్లో దళాలు ఇంకా అందుబాటులోకి రాలేదన్న పంజాబ్ సీఎం.. ప్రస్తుతం ఇతర మార్గాల ద్వారా లడఖ్‌కు సైన్యాలను పంపించాల్సి వస్తోందన్నారు.

తప్పనిసరిగా సైన్యాన్ని బలోపేతం చేయాలని, మనం బలంగా ఉన్నప్పుడు శత్రువులు దాడిచేయడానికి ఒకటికి మూడుసార్లు ఆలోచిస్తారని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీలోని 23 మంది సీనియర్ల తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీకి లేఖ రాయడం తనను ఆశ్చర్యానికి గురిచేసిందని కెప్టెన్ అమరీందర్ సింగ్ పేర్కొన్నారు. ఏదైనా సమస్య ఉంటే కలిసి మాట్లాడాలని అన్నారు.

కరోనా వైరస్ విషయంలో కేంద్ర ప్రభుత్వం నుంచి సరైన సహకారం లభించకపోవడం దురదృష్టకరమని అన్నారు. మహమ్మారితో పోరాటం చేస్తున్నామని, దీనికి వనరులు అవసరమన్నారు. ఇప్పటి వరకూ కేంద్రం నుంచి తమకు కేవలం రూ.101 కోట్ల మాత్రమే అందినట్టు తెలిపారు. పంజాబ్ ప్రభుత్వం రూ.500 కోట్లు ఖర్చుచేసిందని, అన్ని కార్యకలాపాలు స్తంభించిపోవడంతో ఆర్ధిక వనరుల కొరత ఏర్పడిందన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.