యాప్నగరం

సుప్రీంలో పిటిషన్ వెనక్కు తీసుకున్న కాంగ్రెస్.. గవర్నర్‌ను ఇరకాటంలోకి నెట్టడానికేనా?

రాజస్థాన్‌ ప్రభుత్వంలో ఏర్పడిన రాజకీయ సంక్షోభం ముదిరి పాకాన పడింది. తొలుత కాంగ్రెస్ అంతర్గత సంక్షోభంగా మొదలైన హైడ్రామా.. గవర్నర్‌ నిర్ణయంతో మరింత రక్తికడుతోంది.

Samayam Telugu 27 Jul 2020, 3:28 pm
ఎమ్మెల్యేల అనర్హత విషయంలో తదుపరి ఆదేశాలు వెలువరించే వరకూ నిర్ణయం తీసుకోరాదన్న హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో రాజస్థాన్ స్పీకర్ సీపీ జోషీ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. అయితే, అందరూ ఊహించినట్టుగానే ఈ పిటిషన్‌ను స్పీకర్ వెనక్కు తీసుకున్నారు. తిరుగుబాటు నేత సచిన్ పైలట్ వర్గంపై వేసిన పిటిషన్‌ను విరమించుకున్నట్టు సోమవారం ఉదయం కోర్టు కార్యకలాపాలు ప్రారంభ కాగానే కాంగ్రెస్ తరఫున న్యాయవాదులు కపిల్ సిబాల్, సునీల్ ఫెర్నాండెస్ విన్నవించారు. దీనికి జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కృష్ణ మురారీల త్రిసభ్య ధర్మాసనం అంగీకరించింది. దీంతో కాంగ్రెస్ వేసిన పిటిషన్‌ను విత్ డ్రా చేసుకున్నారు.
Samayam Telugu రాజస్థాన్ రాజకీయ సంక్షోభం
Rajasthan Political Crisis


ఈ సమస్య చాలా చిన్నదని, పార్టీలో చర్చించుకుని పరిష్కరించుకుంటే సరిపోతుందని సీనియర్ నేతలు ఒత్తిడి తేవడంతో వారి అభిప్రాయాలను గౌరవించాలని నిర్ణయించిన కాంగ్రెస్ అధిష్ఠానం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. అటు, ఎమ్మెల్యేల అనర్హత అంశం కోర్టు విచారణలో ఉన్నందున దీనిపై హైకోర్టు నిర్ణయం తీసుకునేంతవరకూ అసెంబ్లీని సమావేశ పరచరాదని గవర్నర్ కల్ రాజ్ మిశ్రా నిర్ణయించారు. ఈ నేపథ్యంలో సుప్రీంలో పిటిషన్‌ను వెనక్కు తీసుకుంటూ కాంగ్రెస్ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. పిటిషన్‌ను వెనక్కు తీసుకోవాలన్న కాంగ్రెస్ నిర్ణయం వెనుక గవర్నర్‌ను ఇరకాటంలో పెట్టాలన్న వ్యూహం కూడా ఉంది.

రాజస్థాన్ స్పీకర్ సీపీ జోషి తరఫున సుప్రీంకోర్టుకు హాజరైన కపిల్ సిబాల్, గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను హైకోర్టు పాటించకపోవడం దురదృష్టకరమని అన్నారు. ఇది తమకు బాధను కలిగిస్తోందని, తమ క్లయింట్ తన పిటిషన్‌ను వెనక్కు తీసుకుంటున్నారని, తాము సమస్యను కొనసాగించాలని భావించడం లేదని తన వాదన వినిపించారు. తిరిగి హైకోర్టుకు వెళతామని, అవసరమైతే తిరిగి సుప్రీంను ఆశ్రయిస్తామని అన్నారు.

1992 కిహోటో హోలోహన్ తీర్పును హైకోర్టు పాటించేలా తొందరపాటుతో సుప్రీంకోర్టులో స్పీకర్ పిటిషన్ దాఖలు చేశారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. అనర్హత ద్వారా అసమ్మతిని అణచివేయలేమని, దీనిపై పరిశీలనకు సోమవారం నుంచి రోజువారీ విచారణ చేపడతామని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.