యాప్నగరం

రాజకీయాల్లోకి రజినీ.. స్టాలిన్‌కు కొత్త టెన్షన్?

తమిళనాట రజనీ రాజకీయ ప్రవేశం ఆసక్తి రేపుతోంది. ఆయన సీఎం అయ్యే ఛాన్స్ ఉందో లేదో తెలియదు కానీ.. స్టాలిన్‌కు మాత్రం టెన్షన్‌ను పెట్టడం ఖాయంగా కనిపిస్తోంది.

TNN 17 Jan 2018, 1:27 pm
సూపర్ స్టార్ రజినీకాంత్ తమిళనాడు రాజకీయాల్లో రంగప్రవేశం చేయడం ఖాయమని తేలింది. రజినీ ఎన్నికల బరిలో దిగితే ఆయన సీఎం అవుతారో లేదో తెలియదు కానీ డీఎంకే మాత్రం ఓటు బ్యాంకును కోల్పోనుందని తెలుస్తోంది. ఇండియా టుడే-కార్వీ నిర్వహించిన పోల్‌లో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. ఇప్పటి వరకూ రజినీ పార్టీ పేరును ప్రకటించలేదు. కానీ ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే మాత్రం ఆయన పార్టీకి మాత్రం 33 సీట్లు వస్తాయని ఇండియా టుడే పోల్ అంచనా వేసింది.
Samayam Telugu rajinikanths plunge may catapult stalin to cm job opinion poll
రాజకీయాల్లోకి రజినీ.. స్టాలిన్‌కు కొత్త టెన్షన్?


తమిళనాట మధ్యంతర ఎన్నికలు వస్తే.. డీఎంకే లబ్ధి పొందనుంది. డీఎంకే, దాని భాగస్వామ్య పక్షాలు 130 స్థానాల్లో విజయం సాధిస్తుందని సర్వేలో వెల్లడైంది. 34 శాతం ఓట్లను డీఎంకే దక్కించుకుంటుదని తేలింది. కానీ రజినీకాంత్ ప్రభావం వల్ల గత ఎన్నికలతో పోలిస్తే డీఎంకే నాలుగు శాతం ఓట్లు తగ్గే అవకాశం ఉందని సర్వేలో తేలింది. ఓట్ల శాతం తగ్గినా అన్నాడీఎంకే పట్ల ఆదరణ తగ్గడం స్టాలిన్ పార్టీకి కలసి రానుంది.

ఇక జయ మరణంతో అంతర్గత కలహాలతో కొట్టుమిట్టాడుతున్న అన్నాడీఎంకే పరిస్థితి దిగజారనుంది. ఆ పార్టీ కేవలం 68 స్థానాలకే పరిమితం కానుంది. ఇప్పకిప్పుడు ఎన్నికలు జరిగితే అన్నాడీఎంకేకు 26 శాతం ఓట్లే దక్కనున్నాయి. గత ఎన్నికలతో పోలిస్తే ఇది 15 శాతం తక్కువ కావడం గమనార్హం.

ఇక సీఎం పదవికి ఎవరు సరైన అభ్యర్థి అనే విషయంలో 50 శాతం మంది స్టాలిన్‌కు మద్దతు పలకగా, 17 శాతం మంది రజినీ వైపు మొగ్గు చూపారు. పన్నీరు సెల్వం సీఎం అయితే బాగుంటుందని 17 శాతం మంది అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం సీఎం పళనిస్వామికి కేవలం ఐదు శాతం మందే ఓటేయడం గమనార్హం.

తాను రాజకీయాల్లోకి వస్తున్నానని ప్రకటించిన కమల్ హాసన్ సీఎం కావాలని కేవలం 4 శాతం మందే కోరుకుంటున్నారు. ఆర్కే నగర్ ఉపఎన్నికలో నెగ్గిన దినకరన్‌ సీఎం కావాలని 3 శాతం మంది ఆశిస్తున్నారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగే అవకాశం లేదు కాబట్టి.. 2021 నాటికి రజినీ పార్టీ బలపడితే స్టాలిన్‌కు కచ్చితంగా ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.