యాప్నగరం

కాకి మృతి.. ఎర్రకోట బంద్

Bird Flu: ఎర్రకోటను జనవరి 26 వరకు మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. కోటలో కొన్ని రోజుల కిందట చనిపోయిన కాకుల నమూనాల్లో బర్డ్‌ఫ్లూ ఆనవాళ్లు కనిపించాయి. దీంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.

Samayam Telugu 20 Jan 2021, 5:16 pm
కాకులు మృతి చెందడంతో ఎర్రకోటను మూసేశారు. రిపబ్లిక్ డే వేడుకలకు ముందు ఇది కలకలం రేపుతోంది. జనవరి 26 వరకు కోటలోకి సందర్శకులను అనుమతించబోమని అధికారులు స్పష్టం చేశారు. ఈ మేరకు మంగళవారం (జనవరి 20) అధికారిక ప్రకటన చేశారు. ఇంతకీ ఏం జరిగింది? ఆ వివరాలు..
Samayam Telugu ఎర్రకోట
Red Fort, Delhi


జనవరి 10న ఎర్రకోట ప్రాంగణంలో 15 కాకులు చనిపోయి ఉండటాన్ని అధికారులు గుర్తించారు. మృతి చెందిన కొన్ని కాకుల నమూనాలను పరీక్షల కోసం జలంధర్‌లోని లాబొరేటరీకి పంపించారు. పరీక్షల్లో ఓ కాకి నమూనాలో బర్డ్‌ఫ్లూ సోకినట్లు తేలింది.

ఎర్రకోటలో మృతి చెందిన కాకి నమూనాలను భోపాల్ లాబొరేటరీకి పంపించి బర్డ్‌ఫ్లూ కారక H5N1 వైరస్ ఉన్నట్లు నిర్ధారించుకున్నామని ఢిల్లీ పశు సంరక్షణ విభాగం డైరెక్టర్‌ రాకేష్‌ సింగ్‌ తెలిపారు. ఈ నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యలు చేపట్టినట్లు తెలిపారు.

‘ఏదైనా ప్రాంతంలో ఏవియన్ ఇన్‌ఫ్లూయెంజా ఉందని తేలితే.. యాక్షన్ ప్లాన్ ప్రకారం దాన్ని అలర్ట్ జోన్‌గా ప్రకటిస్తాం. వైరస్ వ్యాప్తి చెందకుండా చర్యలు చేపడతాం’ అని పశు సంరక్షణ విభాగం అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో జనవరి 26 వరకు ఎర్రకోట లోపలికి సందర్శకులను అనుమతించడం లేదని వివరించారు. జనవరి 26న ఎర్రకోటలో రిపబ్లిక్ డే వేడుకలు యథావిధిగా జరుగుతాయని తెలిపారు.

ఇప్పటికే దేశంలోని పలు రాష్ట్రాల్లో బర్డ్‌ఫ్లూ కేసులు వెలుగులోకి వచ్చాయి. పలు ప్రాంతాల్లో కాకులు, కోళ్లు, ఇతర పక్షులు వేల సంఖ్యలో మృత్యువాతపడ్డాయి. తాజాగా మంగళవారం పంజాబ్‌లోనూ బర్డ్‌ఫ్లూ కేసు నమోదైంది.

బర్డ్‌ఫ్లూ వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం ఇప్పటికే పలు చర్యలు చేపట్టింది. ఢిల్లీ శివారు ప్రాంతాల నుంచి ప్యాకెజ్‌డ్, ప్రాసెస్‌డ్ చికెన్‌ను నగరంలోకి తరలించకుండా నిషేధం విధించింది. ఢిల్లీలో అతి పెద్దదైన గాజీపూర్ పౌల్ట్రీ మార్కెట్‌ను 10 రోజుల పాటు మూసివేస్తూ ఆదేశాలు జారీ చేశారు. శనివారం ఢిల్లీ జంతు ప్రదర్శనశాలలో చనిపోయిన ఓ గుడ్లగూబ మృతదేహం నమూనాలను పరీక్షించగా.. బర్డ్‌ఫ్లూ సోకినట్లు తేలింది.

Also Read:

అలాంటి వారు మా టీకా తీసుకోవద్దు: సీరం ఇన్‌స్టిట్యూట్

ఆన్‌లైన్ పాఠాలు వినే దారిలేక విద్యార్థిని ఆత్మహత్య

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.