యాప్నగరం

లెఫ్టినెంట్ గవర్నర్ vs ఢిల్లీ సర్కారు: సుప్రీంలో ఆప్‌కి ఊరట

లెఫ్టినెంట్ గవర్నర్ వ్యవహారంలో సుప్రీం కోర్టు అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వానికి ఊరటనిచ్చింది. లెఫ్టినెంట్ గవర్నర్‌కు స్వతంత్ర అధికారాలు లేవని అత్యున్నత ధర్మాసనం స్పష్టం చేసింది.

Samayam Telugu 4 Jul 2018, 11:57 am
లెఫ్టినెంట్ గవర్నర్ వ్యవహారంలో సుప్రీం కోర్టు అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వానికి ఊరటనిచ్చింది. లెఫ్టినెంట్ గవర్నర్‌కు స్వతంత్ర అధికారాలు లేవని అత్యున్నత ధర్మాసనం స్పష్టం చేసింది. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానికే రాజ్యాంగం ప్రాధాన్యం ఇచ్చిందని, లెఫ్టినెంట్ గవర్నర్‌కు సొంత నిర్ణయాలు తీసుకునే అధికారం లేదని తేల్చింది. ప్రభుత్వానికి ఆటంకాలు కల్పించొద్దని ఐదుగురు జడ్జిల బెంచ్ లెఫ్టినెంట్ గవర్నర్‌ను ఆదేశించింది.
Samayam Telugu lg supreme


ఢిల్లీకి పూర్తి రాష్ట్ర హోదా కల్పించడానికి సుప్రీం కోర్టు నిరాకరించింది. సాధారణ అంశాలపై రాష్ట్ర ప్రభుత్వానికి, భద్రత వంటి అంశాలపై లెఫ్టినెంట్ గవర్నర్‌కు అధికారాలు ఉంటాయని తెలిపింది. కేబినెట్ నిర్ణయాలను లెఫ్టినెంట్ గవర్నర్‌కు తెలియజేయాలని ఆప్ సర్కారును ఆదేశించింది. లెఫ్టినెంట్ గవర్నర్, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య విబేధాలు తలెత్తితే.. రాష్ట్రపతి పరిష్కరించాలని సూచించింది. ఢిల్లీ పాలనకు సంబంధించిన అన్ని అంశాలను రాష్ట్రపతికి నివేదించొద్దని సుప్రీం ఆదేశించింది.

ముఖ్యమంత్రి, లెఫ్టినెంట్ గవర్నర్‌లలో ఎవరూ అధికులు కారని సుప్రీం తెలిపింది. లా అండ్ ఆర్డర్‌ విషయంలో మాత్రం సుప్రీం కోర్టు కేంద్రానికే పూర్తి అధికారం కట్టబెట్టింది.

కేంద్రం, ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆప్ సర్కారు మధ్య గత కొన్నేళ్లుగా రాజధాని ప్రాంతం విషయంలో ఆధిపత్య పోరాటం జరుగుతోంది. సుప్రీం తీర్పుతో దానికి తెరపడే అవకాశం ఉంది. భారీ మెజార్టీతో ఢిల్లీలో అధికారంలోకి వచ్చిన క్రేజీవాల్ సర్కార్ ఆది నుంచి లెఫ్టినెంట్ గవర్నర్‌ వైఖరితో విభేదిస్తోంది. ఢిల్లీ అభివృద్ధిని, మంత్రి మండలి నిర్ణయాలను లెఫ్టినెంట్ గవర్నర్లు అడ్డుకుంటున్నారని ఆ పార్టీ ఆరోపిస్తోంది. ఢిల్లీ పరిపాలన విషయంలో లెఫ్టినెంట్ గవర్నరే బాస్ అని 2016లో ఢిల్లీ హైకోర్టు తీర్పు వెలువరించింది. తాజాగా సుప్రీం వెలువరించిన తీర్పు ఆమ్ ఆద్మీ ప్రభుత్వానికి ఊరటనివ్వనుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.