యాప్నగరం

లవ్ జిహాద్‌కు వ్యతిరేకంగా దారుణం.. వ్యక్తి సజీవ దహనం

ఓ వ్యక్తిని సజీవ దహనం చేసి ‘లవ్‌ జిహాద్‌’కు వ్యతిరేకంగా హెచ్చరికలు చేస్తూ సోషల్‌ మీడియాలో పెట్టిన వీడియో ఆందోళన రేకెత్తిస్తోంది. ఒళ్లు గగుర్పొడిచేలా ఉన్న ఈ వీడియోను చూసి నెటిజన్లు ఒక్కసారిగా షాక్‌‌కు గురయ్యారు.

TNN 7 Dec 2017, 4:16 pm
ఓ వ్యక్తిని సజీవ దహనం చేసి ‘లవ్‌ జిహాద్‌’కు వ్యతిరేకంగా హెచ్చరికలు చేస్తూ సోషల్‌ మీడియాలో పెట్టిన వీడియో ఆందోళన రేకెత్తిస్తోంది. ఒళ్లు గగుర్పొడిచేలా ఉన్న ఈ వీడియోను చూసి నెటిజన్లు ఒక్కసారిగా షాక్‌‌కు గురయ్యారు. రాజస్థాన్‌లో చోటుచేసుకున్న ఈ భయానక ఘటన తాలూకు వివరాలిలా ఉన్నాయి.. రాజ్‌సమంద్‌ జిల్లాలోని ఓ రోడ్డుపై సగం కాలి పడి ఉన్న మృతదేహాన్ని చూసి స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అదే సమయంలో లవ్ జిహాద్‌కు పాల్పడిన వారందరికీ ఇదే గతి పడుతుందంటూ సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్‌గా మారింది. మృతదేహాన్ని పరిశీలించిన పోలీసులు.. అది వీడియోలో సజీవదహనానికి గురైన వ్యక్తికేదని బుధవారం (డిసెంబర్ 6) రాత్రి ధ్రువీకరించారు.
Samayam Telugu reprisal for love jihad man killed body set on fire in rajasthan
లవ్ జిహాద్‌కు వ్యతిరేకంగా దారుణం.. వ్యక్తి సజీవ దహనం


హత్యకు గురైన వ్యక్తిని మహమ్మద్‌ అఫ్రజుల్ ఖాన్‌గా పోలీసులు గుర్తించారు. ఖాన్‌ను ఓ వ్యక్తి అత్యంత దారుణంగా ఓ పరికరంతో చితకొట్టి, అనంతరం కిరోసిన్ పోసి తగులబెట్టాడు. నిందితుణ్ని శంబూనాథ్‌ రాయ్‌గర్‌‌గా గుర్తించిన పోలీసులు.. గురువారం ఉదయం అరెస్టు చేశారు. ఈలోగా లవ్‌ జిహాద్‌ నుంచి యువతిని కాపాడేందుకే తాను అలా చేశానంటూ అతడు తన చర్యను సమర్థించుకుంటున్న మరో వీడియో కూడా సోషల్ మీడియాలోకి వచ్చింది.

దేశాన్ని ఉలిక్కిపాటుకు గురి చేసిన ఈ ఘటన రాజస్థాన్‌లో ప్రకంపనలు సృష్టిస్తోంది. శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా పోలీసులు అప్రమత్తమయ్యారు. అదనపు బలగాలను రంగంలోకి దించారు. ఈ ఘటనపై విచారణకు ప్రత్యేక సిట్‌ బృందాన్ని ఏర్పాటు చేసినట్లు రాజస్థాన్‌ హోంమంత్రి గులాబ్‌ చంద్‌ కటారియా తెలిపారు.

తన కొడుకును ఎందుకు చంపారో తెలియదని అఫ్రజుల్ తల్లి బోరున విలపించింది. చనిపోయే ముందే తన కొడుకుతో ఫోన్‌లో మాట్లాడినట్లు ఆమె కన్నీరుమున్నీరైంది. తన కుమారుణ్ని దారుణంగా చంపిన వారిని కఠినంగా శిక్షించాలని ఆమె ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.