యాప్నగరం

#MeToo వార్తల కవరేజీలో నైతికతకు పెద్ద పీట.. ఇదే ‘సమయం’ పాలసీ

దేశవ్యాప్తంగా #MeToo ఉద్యమం జోరుగా సాగుతోంది. తాము ఎదుర్కొన్న లైంగిక వేధింపులు గురించి మహిళలు ధైర్యంగా బయటకు వెల్లడిస్తున్నారు. ఈ తరుణంలో ‘అజ్ఞాత’ వ్యక్తుల ఆరోపణలు కూడా హల్‌చల్ చేస్తున్నాయి. ఇలాంటి పోస్టులపై ‘సమయం తెలుగు’ పాటిస్తున్న నైతిక విధానాలు ఇవీ.

Samayam Telugu 23 Oct 2018, 4:08 pm
#MeToo ఉద్యమం ద్వారా ఎంతో మంది మహిళలు తాము ఎదుర్కొంటున్న లైంగిక వేధింపులు గురించి ధైర్యంగా వెల్లడిస్తున్నారు. ఈ ఉద్యమానికి ‘సమయం తెలుగు’ అన్నివిధాలా మద్దతు తెలుపుతుంది. స్వార్థ ప్రయోజనాల కోసం ఈ వేదికను దుర్వినియోగం చేసేవారి పట్ల అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. నైతిక విలువలను పాటిస్తోంది.
Samayam Telugu Untitled11


సమాజంలో మహిళలు గతంలో లేదా ప్రస్తుతం ఎదుర్కొన్న లైంగిక వేధింపులను #MeToo ద్వారా వ్యక్తం చేస్తున్నారు. ఈ ఉద్యమం స్ఫూర్తిని మేము గౌరవిస్తున్నాం. మీడియాలో వచ్చే ఈ కథనాలు ఎంతోమంది పాఠకులకు చేరుతాయి. ఈ నేపథ్యంలో #MeToo వార్తల విషయంలో మేము నైతికతకు కట్టుబడి ఉన్నాం. ఈ సందర్భంగా సోషల్ మీడియా సైట్లలో తమ పేర్లు వెల్లడించకుండా అజ్ఞాత వ్యక్తులు చేసే లైంగిక వేధింపుల పోస్టులను ప్రచురించకూడదని నిర్ణయించాం.

ట్విట్టర్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రమ్ వంటి సోషల్ మీడియా వేదికలపై కొందరు అజ్ఞాత వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా లైంగిక ఆరోపణల పోస్టులు పెడుతున్నారు. కొందరి ప్రతిష్ఠకు భంగం కలిగించే విధంగా ఈ వేదికను దుర్వినియోగం చేస్తున్నట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చాలామంది బాధితులు తమ భద్రతకు, ప్రైవసీకి భంగం వాటిల్లకూడదనే ఉద్దేశంతో ఇలా అజ్ఞాతంగా తమ చేదు అనుభవాలను వ్యక్తం చేస్తున్నట్లు మేము అర్థం చేసుకోగలం. అయితే, తప్పుడు ఆరోపణలు, ఇతరుల గౌరవానికి భంగం కలిగించేందుకు ఈ వేదికను దుర్వినియోగం చేసేవారికి ఆ అవకాశం ఇవ్వకూడదనే ఉద్దేశంతో అజ్ఞాత వ్యక్తుల పోస్టులను రిపోర్ట్ చేకూడదని నిర్ణయించాం.

మేం ఒకవేళ ఎవరైనా బాధితురాలిని నేరుగా కలిసి ఆమె దగ్గర వివరాలు తెలుసుకున్నప్పుడు పాత్రికేయ నిబంధనలకు లోబడి ఆమె కథనాన్ని ప్రచురిస్తాం. ఒకవేళ ఆమె అజ్ఞాత వ్యక్తిగా ఉండాలనుకుంటే ఆమె పేరును ఎట్టిపరిస్థితుల్లోనూ ప్రచురించం. అలాగే, వేధింపులకు సంబంధించి వేరే మీడియా సంస్థ కథనాన్ని ప్రచురిస్తే దానిలో నిజమెంత, అదనపు సమాచారం వంటి విషయాలను మేం సేకరిస్తాం. వీటిలో వార్త వేయగలిగే సమాచారం, మానవాసక్తి కోణం ఉంటే ఆ మీడియా సంస్థకు క్రెడిట్ ఇస్తూ కథనాలను ప్రచురిస్తాం. ఈ వార్తల కవరేజీలో పాత్రికేయ నిబంధనలకు లోబడే పనిచేస్తాం.

ఇతర వార్త సంస్థలు, వెబ్‌సైట్లు, టీవీ న్యూస్ చానెళ్లు అజ్ఞాత వ్యక్తుల ఫిర్యాదులను ఆధారంగా చేసుకుని వార్తలు అందిస్తున్నాయి. దేశంలోనే అతి పెద్ద మీడియా సంస్థ అయిన ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’లో భాగమైన ‘సమయం తెలుగు’ బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ ఆ వార్తల్లో నిజమెంతో తెలుసుకుంటోంది. నైతిక ప్రమాణాలను పాటిస్తూ #MeToo మద్దతుగా నిలుస్తోంది. పనిచేసే చోట ఉద్యోగులకు సురక్షిత వాతావరణం కల్పించేందుకు ‘బీసీసీఎల్’, ‘టైమ్స్ ఇంటర్నెట్ లిమిటెడ్’, ‘టైమ్స్ గ్రూప్’కు చెందిన సోదర సంస్తలన్నీ కట్టుబడి ఉన్నాయి. ప్రత్యేకమైన కమిటీ ఏర్పాటు చేసి ‘లైంగిక వేధింపుల నివారణ’ విధానాన్ని కచ్చితంగా అమలు చేస్తున్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.