యాప్నగరం

కశ్మీర్‌: ఉగ్రవాదుల కాల్పుల్లో ఓ జవాన్ మృతి

జమ్మూ కశ్మీర్‌లో ఆదివారం ఉదయం సైన్యం, తీవ్రవాదుల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఓ జవాన్ ప్రాణాలు కోల్పోగా, మరో ఇద్దరు జవాన్లు గాయపడ్డారు.

Samayam Telugu 12 Aug 2018, 9:18 am
జమ్మూ కశ్మీర్‌లో ఆదివారం ఉదయం సైన్యం, తీవ్రవాదుల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఓ జవాన్ ప్రాణాలు కోల్పోగా, మరో ఇద్దరు జవాన్లు గాయపడ్డారు. శ్రీనగర్ సమీపంలోని బటమాలూ ప్రాంతంలో తీవ్రవాదులు సంచరిస్తున్నారనే సమాచారంతో జమ్మూ కశ్మీర్ పోలీసులు, సీఆర్పీఎఫ్ దళాలు అక్కడకు చేరుకుని సోదాలు చేపట్టారు. ఈ సమయంలో తీవ్రవాదులు కాల్పులకు తెగబడటంతో సైన్యం అప్రమత్తమైంది. దీంతో వారి మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన జమ్మూ కశ్మీర్‌ పోలీస్‌కు చెందిన ఓ జవాన్ అమరుడయ్యాడు. ఈ ఘటనలో మరో ఇద్దరు సీఆర్పీఎఫ్ జవాన్లు గాయపడ్డారు. ఓ ఇంట్లో దాగి ఉన్న ఉగ్రవాదులను మట్టుబెట్టడానికి సైన్యం తీవ్రంగా శ్రమిస్తోంది. ఆపరేషన్ ఇంకా కొనసాగుతున్నట్టు జమ్మూ కశ్మీర్ డీజీపీ ఎస్పీ వైద్ తెలిపారు.
Samayam Telugu కశ్మీర్ ఎన్‌కౌంటర్


మరోవైపు లష్కరే తొయిబా కమాండర్ నవీద్ జాట్‌ను భద్రతా దళాలు మట్టుబెట్టినట్టు విశ్వసనీయ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. కాల్పుల కారణంగా బటమాలూ ప్రాంతంలో ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. వదంతులు వ్యాపించకుండా మొబైల్ ఇంటర్నెట్ సేవలు నిలిపివేసినట్టు అధికారులు ప్రకటించారు. అక్కడ ఎంత మంది ఉగ్రవాదులు ఉన్నది స్పష్టంగా తెలియరాలేదు. ఆపరేషన్ పూర్తయితే గానీ వివరాలు వెల్లడించడానికి సైన్యం నిరాకరించింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.