యాప్నగరం

G20 summit భారీ భద్రత మధ్యలో శ్రీనగర్.. భూమి, ఆకాశంలో డేగ కళ్లతో నిఘా

G20 summit ఈ ఏడాది జీ 20 అధ్యక్ష బాధ్యతలను నిర్వహిస్తోన్న భారత్.. దేశవ్యాప్తంగా పలు నగరాల్లో సమావేశాలను ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా టూరిజం కోసం జమ్మూ కశ్మీర్‌ను ఎంపిక చేసుకుంది. శ్రీనగర్‌లో సోమవారం నుంచి ప్రారంభం కానున్న జీ-20 సదస్సు మూడు రోజుల పాటు జరగనుంది. దీంతో అక్కడ భద్రతా దళాలు డేగ కళ్లతో నిరంతరం జల్లెడ పడుతున్నాయి. ఎన్‌ఎస్‌జీ దళాలు గగనతలం నుంచి గాలిస్తుండగా, నౌకాదళానికి చెందిన మెరైన్‌ కమాండోలు సుందరమైన దాల్‌ సరస్సులో మాక్‌ డ్రిల్‌తో పెట్రోలింగు నిర్వహిస్తున్నారు.

Authored byఅప్పారావు జివిఎన్ | Samayam Telugu 22 May 2023, 10:43 am

ప్రధానాంశాలు:

  • శ్రీనగర్‌లో టూరిజం వర్కింగ్ గ్రూప్ సమావేశం
  • అత్యధికంగా హాజరవుతున్న సింగ్‌పూర్ ప్రతినిధులు
  • 370 రద్దు తర్వాత కశ్మీర్‌లో ఓ అంతర్జాతీయ సదస్సు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu G20 Summit
జీ-20 టూరిజం వర్కింగ్ గ్రూప్ సమావేశానికి శ్రీనగర్ ఆతిథ్యం ఇవ్వనుండగా... సాయుధ బలగాలు డేగ కళ్లతో గస్తీ కాస్తున్నాయి. సోమవారం నుంచి మూడు రోజుల పాటు జరిగే ఈ సమావేశానికి జీ 20 కూటమి దేశాలకు చెందిన 60 మంది ప్రతినిధులు హాజరవుతున్నారు. అత్యధికంగా సింగ్‌పూర్ నుంచి వస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. 2019 ఆగస్టులో జమ్మూ కాశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్ 370 కేంద్రం రద్దు చేసిన తర్వాత ఓ అంతర్జాతీయ స్థాయి కార్యక్రమం జరగడం ఇదే మొదటిసారి.
శ్రీనగర్‌లోని కొన్ని ప్రాంతాలు, జీ-20 సమావేశానికి వేదిక అయిన షేర్-ఎ-కశ్మీర్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్‌కి వెళ్లే రహదారులను అష్ట దిగ్బంధనం చేశారు. అయితే, కశ్మీర్‌లో జీ-20 సమావేశాన్ని నిర్వహించడాన్ని చైనా తీవ్రంగా వ్యతిరేకించింది. ఈవెంట్ కోసం సౌదీ అరేబియా పేరు నమోదు చేసుకోకపోగా... దూరంగా ఉండాలని టర్కీ నిర్ణయించినట్లు తెలుస్తోంది.

వివాదాస్పద ప్రాంతాల్లో జీ 20 సమావేశాల నిర్వహణకు తాము వ్యతిరేకమని, అలాంటి వాటికి హాజరుకాలేమని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి వాంగ్ వెన్బిన్ వెల్లడించారు. ఈ నేపథ్యంలో శ్రీనగర్‌లో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. మెరైన్ కమాండోలు, నేషనల్ సెక్యూరిటీ గార్డ్సుతో గస్తీ, గగనతల భద్రతలో భాగంగా యాంటీ-డ్రోన్ యూనిట్లను ఏర్పాటు చేశారు.

జీ-20 ఈవెంట్‌కు విఘాతం కలిగించేందుకు కుట్రలు చేస్తున్నారన్న నివేదికల మధ్య ఆర్మీ, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్‌ఎఫ్), సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్‌పీఎఫ్), సశాస్త్ర సీమా బల్ (ఎస్‌ఎస్‌బీ), జమ్మూ కశ్మీర్ పోలీసులతో సంయుక్తంగా భద్రత ఏర్పాటు చేశారు. ప్రతినిధులు ప్రయాణించే మార్గంలో ట్రాఫిక్ కదలికపై కూడా ఆంక్షలు విధించారు. లాల్ చౌక్ ఏరియాలోని వ్యాపారాలకు ఎలాంటి ఇబ్బందీ లేకుండా దుకాణాలు తెరిచి ఉంచేందుకు ప్రత్యేక పాస్‌లు జారీ చేశారు. జీ-20 దేశాల పర్యాటక కార్యవర్గ సమావేశం విజయవంతం కావడం వల్ల జమ్మూ కశ్మీర్‌లో పర్యాటకుల రాక, పెట్టుబడులు పెరుగుతాయని లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఆశాభావం వ్యక్తం చేశారు.

జీ-20 చీఫ్ కో-ఆర్డినేటర్ హర్ష్ వర్దన్ ష్రింగ్లా మాట్లాడుతూ.. భారత్ జీ20 అధ్యక్ష పదవిని సగానికి చేరుకుందని, ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 118 సమావేశాలు జరిగాయని తెలిపారు. టూరిజంపై గతంలో నిర్వహించిన రెండు సమావేశాల కంటే శ్రీనగర్‌లో జరుగుతోన్న ఈ ఈవెంట్‌కు అత్యధిక సంఖ్యలో ప్రతినిధులు హాజరవుతున్నారని ఆయన చెప్పారు. 60 మంది ప్రతినిధులతో పాటు ప్రత్యేక ఆహ్వానితులుగా పలు దేశాల నుంచి వస్తున్నారని వివరించారు.

Read More Latest National News And Telugu News
రచయిత గురించి
అప్పారావు జివిఎన్
జీవీఎన్ అప్పారావు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ జాతీయ, అంతర్జాతీయ అంశాలకు సంబంధించిన తాజా వార్తలు, కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 10 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో విద్య, జాతీయ రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.