యాప్నగరం

జైట్లీ అంత్యక్రియలు పూర్తి.. కన్నీటి సంద్రమైన బోధ్ ఘాట్‌

ఢిల్లీ బోధ్ ఘాట్‌కు తరలివచ్చిన బీజేపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు. తమ అభిమాన నేతకు అంతిమ వీడ్కోలు. కన్నీటి పర్యంతమైన ఉపరాష్ట్రపతి వెంకయ్య, బీజేపీ నేతలు.

Samayam Telugu 25 Aug 2019, 4:05 pm
కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత అరుణ్ జైట్లీ అంత్యక్రియలు పూర్తయ్యాయి. ఢిల్లీలోని యమునా నది ఒడ్డునున్న బోధ్‌ ఘాట్‌లో ప్రభుత్వ లాంఛనాలతో అంతిమ సంస్కారాలు నిర్వహించారు. అనంతరం జైట్లీ చితికి కుమారుడు రోహన్‌ నిప్పంటించారు. అంత్యక్రియలకు ముందు ఉపరాష్ట్రపతి వెంకయ్య.. కేంద్రమంత్రులు అమిత్‌షా, రాజ్‌నాథ్‌సింగ్‌, బీజేపీ, ఇతర పార్టీల నేతలు జైట్లీకి చివరి సారిగా నివాళులు అర్పించారు.. జైట్లీకి తుది వీడ్కోలు పలికారు. ప్రధాని మోదీ విదేశీ పర్యటనల్లో ఉండటంతో అంత్యక్రియలకు రాలేకపోయారు.
Samayam Telugu jaitly.


ఆదివారం ఉదయం నివాసం నుంచి ఢిల్లీలోని బీజేపీ ఆఫీసుకు జైట్లీ భౌతికకాయన్ని తరలించారు. అక్కడ నేతలు, కార్యకర్తలు, అభిమానుల సందర్శనార్థం ఉంచారు. మధ్యాహ్నం పార్టీ కార్యాలయం నుంచి అంతిమ యాత్ర జరిగింది. బీజేపీ నేతలు, కార్యకర్తలు తమ అభిమాన నేతకు చివరిసారిగా వీడ్కోలు పలికేందుకు భారీగా తరలివచ్చారు. యమునా నది ఒడ్డువరకూ అంతిమయాత్ర కొనసాగింది.

అరుణ్ జైట్లీ అనారోగ్యంతో శనివారం ఢిల్లీ ఎయిమ్స్‌లో తుదిశ్వాస విడిచారు. ఆగష్టు 9న ఆరోగ్యం క్షీణించడంతో కుటుంబ సభ్యులు ఆయన్ను ఎయిమ్స్‌లో చేర్పించారు. 15 రోజులపాటు చికిత్స పొందిన ఆయన.. ఆరోగ్యం విషమించడంతో కన్నుమూశారు. జైట్లీ ప్రాణాలు నిలిపేందుకు వైద్యులు శతథా ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. డయాబెటిస్ కారణంగా బాగా బరువు పెరిగిపోయిన జైట్లీ 2014లో బేరియాట్రిక్ సర్జరీ చేయించుకున్నారు. 66 ఏళ్ల జైట్లీ గత ఏడాది కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయించుకున్నారు. ఆయనకు క్యాన్సర్ రావడంతోనే చికిత్స కోసం జనవరిలో అమెరికా వెళ్లారని ప్రచారం జరిగింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.