యాప్నగరం

Aaftab Poonawala జిత్తులమారి.. విచారణలో రిహార్సిల్ సమాధానాలు.. శ్రద్ధా కేసులో వెలుగులోకి మరో కొత్త విషయం!

Aaftab Poonawala దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన శ్రద్ధా వాకర్‌‌ దారుణ హత్యోదంతంలో పోలీసుల విచారణ కొనసాగుతోంది. ఆమెను చంపడమే కాకుండా అత్యంత దారుణంగా శవాన్ని ముక్కలుగా కోసి పలు ప్రాంతాల్లో నిందితుడు అఫ్తాబ్ విసిరేశాడు. అయితే, నిందితుడు పాలీగ్రాఫీ, నార్కో ఎనాలిసిస్ పరీక్షల్లో వెల్లడించిన సమాధానాలు ముందుగానే రిహార్సిల్స్ చేసుకున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. తనను వదిలి వెళ్లిపోతానని బెదిరించడంతోనే శ్రద్ధాను హత్య చేశానని అఫ్తాబ్ నార్కో పరీక్షల్లో చెప్పినట్టు పోలీసులు తెలిపారు.

Authored byఅప్పారావు జివిఎన్ | Samayam Telugu 4 Dec 2022, 11:54 am

ప్రధానాంశాలు:

  • తిహార్ జైల్లో విచారణ ఖైదీగా ఉన్న అఫ్తాబ్ పూనావాలా
  • అమెరికా రచయిన నవల కాావాలన్న నిందితుడు
  • రిహార్సిల్ సమాధానాలు చెప్పినట్టు అనుమానం.
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Aaftab Poonawala
Aaftab Poonawala ప్రస్తుతం తీహార్ జైల్లో విచారణ ఖైదీగా ఉన్న శ్రద్ధా వాకర్‌ను హత్యచేసిన నిందితుడు అఫ్తాబ్ పూనావాలా.. ప్రముఖ అమెరికా రచయిత పాల్ థెరౌక్స్ నవల అడిగినట్టు జైలు వర్గాలు తెలిపాయి. అతడి కోరిక మేరకు ‘ది గ్రేట్ రైల్వే బజార్; బై ట్రెయిన్ త్రూ ఆసియా’ పుస్తకాన్ని ఢిల్లీ పోలీసులు ఇచ్చినట్టు పేర్కొన్నాయి. ‘‘ఇది నేరం ఆధారంగా లేని పుస్తకం.. ఇతరులకు లేదా తనకు హాని కలిగించే కంటెంట్‌ ఇందులో లేకపోవడంతో జైలు అధికారులు నిందితుడికి ఆ పుస్తకాన్ని ఇచ్చారు’’ అని వ్యాఖ్యానించాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అఫ్తాబ్ ఎక్కువ సమయం చదరంగం ఆడుతూ గడుపుతున్నాడు.
‘‘పూనావాలా తరుచూ ఒంటరిగా, అప్పుడప్పుడు ఇద్దరు తోటి ఖైదీలతో చదరంగం ఆడుతూ సమయాన్ని గడుపుతున్నాడు.. అఫ్తాబ్‌కు చదరంగం అంటే చాలా ఇష్టం.. విభిన్న వ్యూహాలతో రెండు వైపుల నుంచి బోర్డ్‌ను ప్లే చేస్తాడు.. మంచి చదరంగం ఆటగాడు’’ అని తెలిపాయి. అఫ్తాబ్‌తో సెల్‌లో ఉన్న ఇద్దరు దొంగతనం కేసులో అరెస్టయినవారు కాగా... అతడి ప్రవర్తన గురించి నిశితంగా గమనించాలని ఈ ఇద్దరికీ పోలీసులు సూచనలు చేసినట్టు తెలుస్తోంది.

‘‘అఫ్తాబ్ చాలా జిత్తులమారి.. చదరంగంలో రెండు వైపుల నుంచి ఆడుతున్నట్టుగా అతడి ప్రతి కదలిక పక్కా ప్రణాళికతో కూడిన కుట్రలో భాగమే అనిపిస్తుంది... ఢిల్లీ పోలీసులు మొదటి నుంచి అనుమానిస్తున్న విషయం కూడా ఇదే’’ అని జైలు వర్గాలు తెలిపాయి.

ఈ కేసు దర్యాప్తులో పాల్గొన్న ఓ అధికారి అంతకుముందు ఏఎన్ఐ వార్తా సంస్థతో మాట్లాడుతూ.. పోలీసులు చెప్పినట్లు తన నేరాన్ని అంగీకరించడం, పోలీసులకు సహకరించడం, పాలిగ్రాఫ్, నార్కో పరీక్షలకు ఒప్పుకోవడం సహా అన్నింటికీ సమాధానాలు సక్రమంగా ఉన్నాయి. కానీ, అతడి మంచి ప్రవర్తనపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

అఫ్తాబ్ ‘విధేయత’తో కూడిన ప్రవర్తన, అతడు ఇచ్చిన ‘రిహార్సల్’ సమాధానాలపై ఢిల్లీ పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ‘అఫ్తాబ్ చర్యలు, సత్ప్రవర్తన సందేహాస్పదంగా ఉంది.. ప్రతి ప్రశ్నకు ఒక సమాధానం ఎలా ఉంటుంది? నిందితుడు ఇప్పటికే సమాధానాలను రిహార్సల్ చేసినట్లు కనిపిస్తోంది’ అని అధికారులు తెలిపారు.

అయితే, విచారణలో శ్రద్ధా మృతదేహాన్ని ముక్కలు చేయడానికి చైనీస్ క్లీవర్‌ను ఉపయోగించినట్లు అఫ్తాబ్ అంగీకరించాడు. ఢిల్లీ పోలీసులు అఫ్తాబ్ మనస్తత్వాన్ని అంచనా వేయడానికి, ఆలోచనవిధానాన్ని తెలుసుకోడానికి బ్రెయిన్ మ్యాపింగ్ పరీక్షకు అనుమతికోరే అవకాశం ఉంది. ‘మేము ఇంకా డీఎన్ఏ నివేదిక కోసం ఎదురుచూస్తున్నాం.. ఆ తర్వాత మాత్రమే బ్రెయిన్ మ్యాపింగ్ పరీక్షను పరిశీలిస్తాం’’ అని పోలీసులు తెలిపారు.

మొదట్లో ముంబై పోలీసులను తప్పుదోవ పట్టించేందుకు అఫ్తాబ్ ప్రయత్నించాడు. అయితే, ఈ కేసు ఢిల్లీ పోలీసుల పరిధిలోకి రావడంతో తన నేరాన్ని అంగీకరించడం ప్రారంభించాడు. ఇది అతడి ‘వంచక’ పథకంలో భాగమని పోలీసులు అనుమానిస్తున్నారు.

‘శ్రద్ధా వాకర్ హత్య కూడా అతడి చదరంగం వ్యూహాల మాదిరిగానే లోతైన కుట్రలో భాగమేనని చర్యలను బట్టి తెలుస్తోంది’ అని జైలు వర్గాలు పేర్కొన్నాయి. శ్రద్ధాను హత్య చేసి, ఆమె మృతదేహాన్ని ముక్కలు చేసినట్టు అంగీకరించిన ప్రశ్నలకు తప్పుదారి పట్టించే సమాధానాలు చెబుతున్నాడని పోలీసులు ఇంతకు ముందు చెప్పారు. అఫ్తాబ్ తప్పుడు సమాచారం ఇస్తున్నారని, దర్యాప్తును తప్పుదోవ పట్టిస్తున్నారని ఢిల్లీ పోలీసులు కోర్టులో పేర్కొన్నారు.

Read Latest National News And Telugu News
రచయిత గురించి
అప్పారావు జివిఎన్
జీవీఎన్ అప్పారావు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ జాతీయ, అంతర్జాతీయ అంశాలకు సంబంధించిన తాజా వార్తలు, కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 10 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో విద్య, జాతీయ రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.