యాప్నగరం

23 ఏళ్లుగా భారత్‌లోనే ఉన్నా.. నన్నెలా బహిష్కరిస్తారు: పాక్ వ్యక్తి

తాను 23 ఏళ్లుగా భారత్‌లోనే ఉంటున్నానని, ఇప్పుడు భారతీయుడిని కావని దేశం నుంచి బహిష్కరించడం అన్యాయమని ఓ పాకిస్థాన్ వ్యక్తి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

TNN 15 Mar 2018, 4:35 pm
తాను 23 ఏళ్లుగా భారత్‌లోనే ఉంటున్నానని, ఇప్పుడు భారతీయుడిని కావని దేశం నుంచి బహిష్కరించడం అన్యాయమని ఓ పాకిస్థాన్ వ్యక్తి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 23 ఏళ్ల క్రితం పాకిస్థాన్ నుంచి వచ్చి ముంబైలో నివాసం ఉంటున్న సిరాజ్ ఖాన్‌ను భారత అధికారులు సోమవారం వెనక్కి పంపారు. ప్రస్తుతం పాకిస్థాన్‌లోని మన్సేరా పట్టణంలో ఉన్న 32 ఏళ్ల సిరాజ్.. ముంబై మిర్రర్‌తో ఫోన్ ద్వారా తన ఆవేదనను వెల్లగక్కారు. ఆయనకి భారత్‌లోనే భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. అయితే వారు ప్రస్తుతం ముంబైలోనే ఉంటున్నారు. ఎందుకంటే వారు భారతీయులు.
Samayam Telugu siraj khan if pakistani singer can become indian citizen after 14 years why cant i after 23 years
23 ఏళ్లుగా భారత్‌లోనే ఉన్నా.. నన్నెలా బహిష్కరిస్తారు: పాక్ వ్యక్తి


‘నాకు నా భార్య పిల్లలు కావాలి. ముంబైలో ఉంటున్న వాళ్ల దగ్గరికైనా నన్ను పంపడి. లేదంటే వాళ్లనే పాకిస్థాన్‌కు పంపించండి’ అని సిరాజ్ ఖాన్ కోరుతున్నారు. సోమవారం పంజాబ్‌లోని వాగా ఇమ్మిగ్రేషన్ స్టాప్ నుంచి ఎంతో బాధతో పాకిస్థాన్‌కు వెనుదిరిగానని చెప్పారు. అక్కడ ఓ భారత అధికారి తనను ‘మళ్లీ వెనక్కి రాకు’ అని గర్జించినట్టు కూడా సిరాజ్ ఆరోపించారు. తాను భారత్‌లో ఎలాంటి నేరాలకు పాల్పడలేదని, కావాలంటే పోలీస్ స్టేషన్లకు వెళ్లి వాకాబు చేసుకోవచ్చని తెలిపారు.

ముంబైలోని ఆంటోప్ హిల్‌లో నివాసం ఉంటున్న తన భార్య సాజిదా, ముగ్గురు పిల్లలను కలవడానికి తనను అనుమతించాలని కోరారు. అంతేకాకుండా తన భార్య, పిల్లలతో ఇక్కడే చట్టబద్ధంగా జీవిచండానికి అనుమతివ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అదే తాను సెలబ్రిటీని అయి ఉంటే అధికారులు తనకు ఎప్పుడో భారత పౌరసత్వం ఇచ్చేవారని ఆరోపించారు. ‘నేనే గనుక సెలబ్రిటీని అయి ఉంటే, భారత హోం మంత్రి నా ఇంటికి వచ్చి ఓ కప్పు టీ తాగే లోపల నాకు పౌరసత్వం ఇచ్చేవారు. పాకిస్థాన్‌లో ప్రముఖ గాయకుడు అయిన ఓ వ్యక్తి భారత్‌లో 14 ఏళ్లుగా నివసిస్తుంటే ఆయనకు పౌరసత్వం ఇచ్చారు. మరి నేను భారత్‌లో 23 ఏళ్లుగా నివసిస్తున్నాను’ అని సిరాజ్ ప్రశ్నించారు.

10 ఏళ్ల వయసులోనే భారత్‌కు..
అప్పుడు సిరాజ్‌కు పదేళ్లు. స్కూళ్లోని పరీక్షలకు బయపడి స్వదేశం పాకిస్థాన్‌లో రైలు ఎక్కేశాడు. అది తన మావయ్య నివాసముండే కరాచీకి వెళ్తుందని అనుకున్నాడు. తీరా చూస్తే ఆ రైలు భారత్‌లోని అమృత్‌సర్ వచ్చి ఆగింది. అప్పటి నుంచి కొన్నేళ్లపాటు గుజరాత్‌లో జీవించాడు. అక్కడి నుంచి ముంబైకి వచ్చి హోటళ్లలో పనిచేయడం మొదలుపెట్టాడు. ఈ సమయంలో సాజిదాతో పరిచయం ఏర్పడింది. అది పెళ్లికి దారితీసింది. తన పౌరసత్వానికి సంబంధించి 2009 నుంచే సిరాజ్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఓ సామాజిక కార్యకర్త సహాయంతో బహిష్కరణకు వ్యతిరేకంగా న్యాయం కోసం పోరాడారు. కానీ చివరికి విజయం సాధించలేకపోయారు. 23 ఏళ్లపాటు భారత గడ్డపై జీవించిన సిరాజ్.. సోమవారం పాకిస్థాన్‌కు వెళ్లిపోవాల్సి వచ్చింది.

Cilck Here to read Siraj Khan complete interview in Mumbai Mirror

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.