యాప్నగరం

2014లో కాంగ్రెస్ ఘోర ఓటమికి ఆ ఇద్దరే కారణం.. ప్రెసిడెన్సియల్ ఇయర్స్‌లో ప్రణబ్ విమర్శలు

మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ రాసిన మరో పుస్తకం వచ్చే నెలలో విడుదల కానుండగా.. అందులో ఆయన కాంగ్రెస్ పార్టీ నాయకుల గురించి ప్రస్తావించిన కీలక విషయాలు బయటకు వచ్చాయి.

Samayam Telugu 12 Dec 2020, 8:36 am
మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ రాసిన ‘ది ప్రెసిడెన్సియల్ ఇయర్స్’ పుస్తకం చివరి భాగం వచ్చే నెలలో విడుదల కానుంది. ఆ పుస్తకంలో కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌పై తీవ్ర విమర్శలు గుప్పించడం గమనార్హం. ‘2014 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయానికి సోనియా, మన్మోహనే కారణం.. 2004లో తాను ప్రధాని అయ్యుంటే, పార్టీ అధికారం కోల్పోయేది కాదని కొందరు కాంగ్రెస్ నాయకులు అంటుండేవారు.. ఆ వ్యాఖ్యలతో తాను ఏకీభవించకపోయినా, తాను రాష్ట్రపతి అయిన తర్వాత కాంగ్రెస్‌ నాయకత్వం బలహీనపడిందని’ ప్రణబ్ వ్యాఖ్యానించారు.
Samayam Telugu ప్రణబ్ ముఖర్జీ
Pranab Mukherjee


‘పార్టీ వ్యవహారాలను సోనియా సమర్థవంతంగా నిర్వహించలేకపోయారు.. మన్మోహన్ సింగ్ సుదీర్ఘకాలం పార్లమెంట్‌కు గైర్హాజరు కావడం వల్ల ఇతర ఎంపీలతో వ్యక్తిగతంగా ఆయనకు సంబంధాలు తెగిపోయాయి’ ప్రణబ్‌ అభిప్రాయపడ్డారు. మన్మోహన్ సింగ్‌, నరేంద్ర మోదీ పాలన గురించి ప్రణబ్ పోల్చారు.

ప్రధానికి నైతిక అధికారం ఉందని నేను నమ్ముతున్నాను.. దేశం మొత్తం స్థితి ప్రధాని, అతని పరిపాలన విధానం, పనితీరును ప్రతిబింబిస్తుంది. డాక్టర్ మన్మోహన్ సింగ్ సంకీర్ణ ప్రభుత్వాన్ని కాపాడటంలో మునిగి తేలారు.. ఇది పాలనను దెబ్బతీసింది.. మోదీ తొలిసారి పదవీకాలంలో ప్రభుత్వం, శాసనవ్యవస్థ, న్యాయవ్యవస్థల మధ్య దిగజారిన సంబంధాలను చూస్తే ఆయన ఒక నిరంకుశమైన పాలనను సాగించినట్లు అనిపించింది.. ఈ ప్రభుత్వానికి రెండోసారి పదవీకాలంలో ఇలాంటి విషయాలపై మంచి అవగాహన ఉంటే కాలం మాత్రమే తెలియజేస్తుంది’ దాదా అభిప్రాయపడ్డారు.

‘2015లో అప్పటి అమెరికా అధ్యక్షుడు భారత్‌లో పర్యటించారు.. ఆ సందర్భంగా ఆయన కారులో నన్ను కూర్చోమన్నారు. అందుకు నేను గౌరవంగా, గట్టిగా తిరస్కరించాను. అమెరికా అధ్యక్షుడు భారత రాష్ట్రపతితో కలిసి ప్రయాణించేటప్పుడు భారత ప్రభుత్వ భద్రతా ఏర్పాట్లను విశ్వసించాలి.. అదే విషయాన్ని అమెరికా అధికారులకు తెలియజేయమని విదేశీ వ్యవహారాల శాఖకు చెప్పాను’ అని ప్రణబ్‌ తన పుస్తకంలో పేర్కొన్నట్టు పబ్లిషర్‌ సంస్థ తెలిపింది.

1984-2004 వరకు ఎన్నిసార్లు ఆశించినా ప్రణబ్‌ను వరించని ఒకే ఒక పదవి ప్రధానమంత్రి. ఇందిర అనుయాయుడిగా పేరున్న ప్రణబ్‌ ముఖర్జీ సహజంగానే ఆ పదవిని ఎప్పటికైనా పొందుతారని కాంగ్రెస్ పార్టీలో చాలామంది భావించారు. కానీ బీజేపీలో అద్వాణీలా ఆయన కూడా ప్రధాని పదవిని అందుకోలేకపోయారు. అయితే, ఎప్పుడూ తన అసంతృప్తిని బయటపెట్టని ప్రణబ్.. ప్రెసిడెన్సియల్ ఇయర్స్‌లో మాత్రం ప్రధాని పదవిపై తాను అభిప్రాయాన్ని పరోక్షంగా వెల్లడించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.