యాప్నగరం

Madras High Court: సామాన్యుడిలా దర్శనానికి వెళ్లిన హైకోర్టు జడ్జికి చేదు అనుభవం.. వెలుగులోకి అక్రమాలు

Madras High Court: ఆలయాల్లో అనేక అవకతవకలు జరుగుతూ ఉంటాయి. కానీ భక్తులు వాటిని పెద్దగా పట్టించుకోరు. ఎవరైనా బయటపెడితే గానీ అవి వెలుగులోకి రావు. మద్రాస్ హైకోర్టు జడ్జి జస్టిస్ సుబ్రమణ్యం చెన్నైలోని వడపళని ఆలయంలో జరుగుతున్న అక్రమాలను బయటపెట్టారు. సామాన్య భక్తుడిలా తన కుటుంబసభ్యులతో కలిసి దర్శనానికి వెళ్లిన ఆయనకు ఊహించని ఘటనలు ఎదురయ్యాయి. ఓ వీఐపీ పట్ల అధికారులు ప్రవర్తించిన తీరు అనేక విమర్శలకు దారి తీస్తోంది.

Authored byవెంకట్రావు లేళ్ల | Samayam Telugu 24 Dec 2022, 1:33 pm

ప్రధానాంశాలు:

  • సామాన్యుడిలా దర్శనానికి వెళ్లిన మద్రాస్ హైకోర్టు జడ్జి
  • అసభ్యకరంగా ప్రవర్తించిన ఆలయ సిబ్బంది
  • కోర్టుకు హాజరైన ఆలయ ఈవో
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu madras highcourt
మద్రాస్ హైకోర్టు
Madras High Court: మద్రాస్ హైకోర్టు జడ్జి జస్టిస్ సుబ్రమణ్యంకు చెన్నైలోని వడపళని దండాయుధపాణి ఆలయంలో చేదు అనుభవం ఎదురైంది. తన భార్య, కూతురితో కలిసి శనివారం ఆయన దర్శనం కోసం వెళ్లారు. ప్రొటోకాల్ ప్రకారం వీఐపీ దర్శనం చేసుకునే అవకాశం ఉన్నా.. సామాన్య భక్తుడిలా తన కుటుంబసభ్యులతో కలిసి దర్శనం కోసం వెళ్లారు. రూ.50 మూడు స్పెషల్ దర్శనం టికెట్లను రూ.150కు కొనుగోలు చేయగా.. రెండు రూ.50 టికెట్లు, ఒకటి రూ.5 టికెట్ సిబ్బంది ఇచ్చారు. ఇదేంటని ప్రశ్నించగా.. అప్పుడు కౌంటర్ సిబ్బంది రూ.5 టికెట్ స్థానంలో రూ.50 టికెట్ జారీ చేశారు.
ఇతర భక్తులకు కూడా ఎక్కువ ధర టికెట్‌తో పాటు తక్కువ ధర టికెట్లను ఇస్తున్న విషయాన్ని జడ్జి కుటుంబసభ్యులు గుర్తించారు. ఆలయంలో జరుగుతున్న అవకతవకలపై ఫిర్యాదు చేసేందుకు తన కుటుంబసభ్యులతో కలిసి జడ్జి ఆలయ ఈవో రూమ్‌లోకి వెళ్లారు. అక్కడ ఆలయ ఈవో అందుబాటులోకి లేకపోవడంతో.. ఆమె నెంబర్ ఇవ్వాలని జడ్జి కోరారు. దీంతో అక్కడి సిబ్బంది జడ్జితో అసభ్యకరంగా, అహంకారపూరితంగా, దురుసుగా ప్రవర్తించారు. ఆలయంలో ఎలాంటి అవకతవకలు జరగలేదంటూ చెప్పుకొచ్చారు.

సిబ్బంది దరుసుగా ప్రవర్తించడంతో హైకోర్టు రిజిస్ట్రార్‌ సహాయం తీసుకుని స్ధానిక పోలీసులను సుబ్రమణ్యం సంప్రదించారు. పోలీసుల సమక్షంలో కూడా ఆలయ సూపరింటెండెంట్ ఈఓ ఫోన్ నెంబర్‌ చెప్పేందుకు నిరాకరించారు. దీంతో తమ పట్ల దుసురుగా ప్రవర్తించడం, టికెట్ల జారీలో అవకతవకలకు పాల్పడుతుండటంతో.. దీనిపై కంప్లైంట్ నమోదు చేసి ఈవోను కోర్టు ముందు హాజరుపర్చాలని సుబ్రమణ్యం ఆదేశించి వెళ్లారు. ఈ ఆదేశాలతో మరుసటి రోజు ఈవో కోర్టు ముందు హాజరయ్యారు.విచారణ సందర్భంగా ఈవో తీరుపై సుబ్రమణ్యం ఫైర్ అయ్యారు. అక్రమాలపై ప్రజలు ఫిర్యాదు చేసేందుకు నోటీస్ బోర్డులో అధికారుల నెంబర్లు ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు.

'సీఎం కూడా నెంబర్‌ను ప్రజలకు అందుబాటులో ఉంచేందుకు వెనుకాడనప్పుడు.. ఈవో నెంబర్ ఇవ్వడానికి ఇబ్బంది ఏంటని నా భార్య ప్రశ్నించింది. సీఎం ఇస్తారేమో కానీ మేము ఇవ్వం అని సిబ్బంది చెప్పారు. స్థానిక పోలీసులు వచ్చి నన్ను గుర్తించి ఉండకపోతే అక్రమాలను ప్రశ్నించినందుకు నన్ను కూడా ఇతర వ్యక్తుల తరహాలోనే సిబ్బంది బయటకు నెట్టేసేవారు. వందల కోట్ల రూపాయల ఆస్తులు, రూ.14 కోట్ల వార్షిక ఆదాయం కలిగిన దేవాలయం పరిస్థితే ఇలా ఉంటే.. ఇతర దేవాలయాల్లో పరిస్థితి ఎలా ఉందో ఊహించుకుంటేనే నాకు భయం వేస్తుంది' అని సుబ్రమణ్యం తెలిపారు.

సామాన్య వ్యక్తిలా బహిరంగ ప్రదేశాల్లో పర్యటించినప్పుడే ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, అధికారులు చేస్తున్న అక్రమాలు ప్రత్యక్షంగా తెలుస్తాయని, వీఐపీ హోదాలో వెళితే ఇలాంటి ఇబ్బందులు తెలియవని సుబ్రమణ్యం స్పష్టం చేశారు. ఆలయంలోని ఘటనపై అధికారులు విచారణ జరిపి ఈవోపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. చాలామంది వృద్ధులు, మధుమేహంతో బాధపడుతున్న రోగులు ఆలయాలను సందర్శిస్తారని, టాయిలెట్ సౌకర్యం కల్పించాలని సుబ్రమణ్యం సూచించారు.

రచయిత గురించి
వెంకట్రావు లేళ్ల
వెంకట్రావు లేళ్ల సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన తాజా వార్తలు, పొలిటికల్ అప్‌డేట్స్, పొలిటికల్ అనాలసిస్ అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాజకీయ, క్రీడా, సినిమా రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.