యాప్నగరం

లాక్‌డౌన్ 4.0: మరిన్ని సడలింపులు.. ఆ నిర్ణయాధికారం రాష్ట్రాలకే!

దేశవ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్ 3.0 రేపటితో ముగియనుండగా.. నాలుగో దశ లాక్‌డౌన్ ఎలా ఉంటుందనే చర్చ సాగుతోంది. ఎలాంటి నిబంధనలు విధించాలనే అధికారం రాష్ట్రాలకు వదిలేయనున్నట్టు తెలుస్తోంది.

Samayam Telugu 16 May 2020, 12:02 pm
కరోనా కట్టడికి విధించిన మూడో దశ లాక్‌డౌన్‌ ఆదివారంతో ముగియనుండగా.. లాక్‌డౌన్ 4.0కూడా ఉంటుందని ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటికే ప్రకటన చేసిన విషయం తెలిసిందే. దీంతో, సోమవారం నుంచి ఎలాంటి నిబంధనలు అమల్లోకి వస్తాయన్న ఉత్కంఠ అందరిలో నెలకుంది. కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యలు, లాక్‌డౌన్ తదితర అంశాలపై మే 11న రాష్ట్రాల ముఖ్యమంత్రులతో జరిగిన వీడియో సమావేశంలో మాట్లాడిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ.. అన్ని రాష్ట్రాలు బ్లూప్రింట్స్‌ పంపాలని సూచించారు.
Samayam Telugu లాక్‌డౌన్ 4.0


దీనికి సంబంధించిన గడువు శుక్రవారంతో ముగిసింది. రాష్ట్రాల నుంచి అందిన సూచనలు ఆధారంగా కేంద్రం నిర్ణయం తీసుకోనుంది. దీనికి సంబంధించిన నిబంధనలను శనివారం వెల్లడించే అవకాశం ఉంది. అయితే, లాక్‌డౌన్ పూర్తిగా ఎత్తివేయకుండా.. ఆర్ధిక కార్యకలాపాల నిర్వహణకు మరిన్ని సడలింపులను ఇవ్వాలని రాష్ట్రాలు కోరుతున్నట్టు కేంద్ర హోం శాఖ వర్గాలు వెల్లడించాయి. ఎక్కువ ఆర్థిక కార్యకలాపాల నిర్వహణకు అవకాశం కల్పించాలని కేరళ, కర్ణాటక, గుజరాత్‌, రాజస్థాన్‌, ఢిల్లీ తదితర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే ప్రధానికి విజ్ఞప్తి చేశాయి.

మే 18 నుంచి 50 శాతం సిబ్బంది కార్యాలయాలకు రావాలని తమిళనాడు ఉత్తర్వులు జారీ చేసింది. కంటెయిన్‌మెంట్‌ జోన్లలో మినహాయించి మిగిలిన అన్ని ప్రాంతాల్లో ఆర్థిక కార్యకలాపాలు కొనసాగనివ్వాలని ఆ రాష్ట్రం కోరుతోంది. రెస్టారెంట్లు, వ్యాయమశాలలు, గోల్ఫ్‌కోర్స్‌లు తెరవడానికి అనుమతించాలని కర్ణాటక అభ్యర్ధించింది. మెట్రో రైళ్లు, స్థానిక రైళ్లు, దేశీయ విమానాలు, రెస్టారెంట్లు, హోటళ్లు తెరవడానికి వీలు కల్పించాలని కేరళ అడిగింది.

మహారాష్ట్ర మాత్రం లాక్‌డౌన్‌ సడలింపులకు ఏమాత్రం సుముఖంగా లేదు. లాక్‌డౌన్ మరో రెండు వారాలు పొడిగించాలని అసోం ముఖ్యమంత్రి శర్వానంద్ సోనోవాల్ కేంద్రాన్ని కోరారు. బిహార్‌, మిజోరం రాష్ట్రాలు మే 31వరకు లాక్‌డౌన్‌ను పొడిగిస్తున్నట్టు శుక్రవారం ప్రకటించాయి. పంజాబ్, తెలంగాణ, పశ్చిమ్ బెంగాల్, ఝార్ఖండ్‌, ఒడిశా, లాక్‌డౌన్‌కే మొగ్గు చూపుతున్నాయి. దేశవ్యాప్త లాక్‌డౌన్‌ను పొడిగించాలని పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇదివరకే డిమాండ్‌ చేశారు.

ఈ నేపథ్యంలో జోన్స్, హాట్‌స్పాట్ల నిర్ణయం, ఆంక్షల అమలుపై ఈసారి రాష్ట్రాలకు మరింత నిర్ణయాధికారం కల్పించవచ్చనే సంకేతాలు వెలువడుతున్నాయి. క్షేత్రస్థాయి పరిస్థితులకు అనుగుణంగా ఒక నిర్ణీత ప్రాంతంలో ప్రజల కదలికల్ని, ఆర్థిక కార్యకలాపాలను అనుమతించడానికి, లేదా నియంత్రించడానికి రాష్ట్రాలకు దానివల్ల అవకాశం ఉంటుంది.

అవసరాలకు అనుగుణంగా రైళ్లను, దేశీయ విమాన సర్వీసులను వచ్చేవారం నుంచి పరిమితంగా పునఃప్రారంభించేలా నిర్ణయాలు ఉండవచ్చని తెలుస్తోంది. ఇప్పటికే ప్రత్యేక రైళ్ల పేరుతో పరిమిత సంఖ్యలో సర్వీసులు ప్రారంభం కావడం వల్ల భవిష్యత్తులో భౌతిక దూరం పాటిస్తూ విమాన, బస్సు సర్వీసులు, వ్యక్తిగత వాహనాలు, ఆటోలు, ట్యాక్సీలూ తిరగడానికి అవకాశం కల్పించొచ్చని భోగట్టా. కంటెయిన్‌మెంట్‌ ప్రాంతాలు లేనిచోట్ల స్థానిక రైళ్లు, మెట్రోలను పరిమిత సామర్థ్యంతో నడిచేలా అనుమతిస్తారని వినిపిస్తోంది.

గ్రీన్‌ జోన్‌లలో పూర్తిస్థాయి కార్యకలాపాలకు కేంద్రం అనుమతించనుందని కేంద్ర ప్రభుత్వ అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ఆరెంజ్ జోన్‌లో ఆంక్షలు స్వల్పంగా ఉంటాయని, రెడ్ జోన్‌లో మాత్రం కఠినంగా ఉంటాయని తెలుస్తోంది. విద్యా సంస్థలు, మాల్స్, సినిమా థియేటర్లు మాత్రం ఇప్పట్లో తెరచే ఉద్దేశం లేదని సమాచారం. అయితే, కంటెయిన్‌మెంట్‌ జోన్లు మినహా రెడ్‌జోన్లలో సెలూన్లు, కళ్లజోళ్ల దుకాణాలు వంటివి తెరిచేందుకు వీలు కల్పించవచ్చని సమాచారం.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.