యాప్నగరం

నోట్ల రద్దుపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..

నిజాయతీ గల పౌరులను ఇబ్బందులకు గురి చేయడం తగదని, మరోసారి గడువు ఇచ్చే అంశంపై రెండు వారాల్లోగా బదులివ్వాలని ప్రభుత్వాన్ని తీవ్రంగా హెచ్చరించింది..

TNN 4 Jul 2017, 1:05 pm
నోట్ల రద్దుపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. రద్దైన నోట్లను మార్చుకోవడానికి మార్చి 31 వరకే గడువు ఎందుకు ఇచ్చారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. నిజాయతీ గల పౌరులను ఇబ్బందులకు గురి చేయడం తగదని, మరోసారి గడువు ఇచ్చే అంశంపై రెండు వారాల్లోగా బదులివ్వాలని ప్రభుత్వాన్ని తీవ్రంగా హెచ్చరించింది. డిసెంబర్ 31లోగా మార్చుకోలేక ఇబ్బందులు పడ్డవారు అనేక మంది ఉన్నారని, జనం కష్టపడి సంపాదించుకున్న సొమ్ము వారికి నిరూపయోగంగా మారితే ఎలా..? అని సర్వోన్నత న్యాయస్థానం ప్రశ్నించింది. 2 వారాల్లో దీనిపై సమగ్ర నివేదిక సమర్పించాలని కేంద్రం, ఆబీఐకి నోటీసులు జారీ చేసింది.
Samayam Telugu supreme court gives centre 2 weeks to decide on another chance to deposit old notes
నోట్ల రద్దుపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..


మరోవైపు రద్దైన నోట్లను గడువులోగా మార్చుకోవడంలో విఫలమైన ప్రతి వ్యక్తి అంశాన్ని పరిశీలిస్తామని కేంద్రం తెలిపింది. బహిరంగంగా మళ్లీ అందరికీ నోట్లు మార్చుకునే వెసులుబాటు కల్పిస్తే కొత్త ఇబ్బందులు తలెత్తుతాయని సోలిసిటర్ జనరల్ రంజిత్ కుమార్ వ్యాఖ్యానించారు. గతంలో ప్రకటించిన గడువు లోగా మార్చుకోలేని పౌరులకు సంబంధించిన అంశాన్ని ఒక్కోటి కూలంకషంగా పరిశీలించి నిజాయతీ తేలితేనే.. అవకాశం కల్పిస్తామని ఆయన ఇంతకుముందే పేర్కొన్నారు.

గత ఏడాది నవంబర్ 8న రూ. 500, రూ. 1000 నోట్లను రద్దు చేస్తూ కేంద్ర ప్రభత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. రద్దైన నోట్లను మార్చుకోవడానికి బ్యాంకుల్లో డిసెంబర్ 31 వరకు, ఆర్బీఐ వద్ద మార్చి 31 వరకు గడువు విధించారు. ఈ గడువులోగా మార్చుకోలేక ఇబ్బందులు పడ్డవారు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ​ఈ అంశంపై న్యాయస్థానం మంగళవారం (జులై 4) విచారణ చేపట్టింది.

సరైన కారణాలతో డబ్బు జమచేయలేక పోయిన నిజాయతీపరులకు మరో అవకాశం కల్పించాలని కోర్టు సూచించింది. కేంద్రం చెప్పిన గడువు సమయంలో ఓ వ్యక్తి జైల్లో గనుక ఉంటే.. ఆ వ్యక్తికి ఇప్పుడు అవకాశం ఇవ్వకపోవడం సరికాదని ఉదహరణగా పేర్కొంది. ‘ఇలాంటి వ్యక్తులకు ఎలా సాయపడతారు. వీరి కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తారా?’ అని కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసింది.

సుప్రీంకోర్టు నిర్ణయంపై స్పందించిన కేంద్ర ప్రభుత్వం దీనిపై సమగ్ర నివేదికతో అఫిడవిట్‌ దాఖలు చేస్తామని కోర్టుకు తెలిపింది. ఈ కేసులో తదుపరి విచారణను న్యాయస్థానం జులై 18కి వాయిదా వేసింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.