యాప్నగరం

థియేటర్లలో నిలబడక్కర్లేదు: సుప్రీం కోర్టు

ప్రజలు తమ దేశభక్తి రుజువు చేసుకోవాలంటే థియేటర్లలో సినిమా ప్రదర్శనకు ముందు జాతీయ గీతాలాపన సమయంలో తప్పనిసరిగా లేచి నిల్చోవాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.

TNN 24 Oct 2017, 10:16 am
ప్రజలు తమ దేశభక్తి రుజువు చేసుకోవాలంటే థియేటర్లలో సినిమా ప్రదర్శనకు ముందు జాతీయ గీతాలాపన సమయంలో తప్పనిసరిగా లేచి నిల్చోవాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. సుమారు 11 నెలల క్రితం ఇచ్చిన తీర్పును సవరించేందుకు దేశ అత్యుత్తమ న్యాయస్థానం అంగీకరించింది. జాతీయ జెండా నిబంధనల్ని సవరించే విషయాన్ని పరిశీలించాల్సిందిగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలో ధర్మాసనం కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. జాతీయ గీతాన్ని వినిపిస్తున్నప్పుడు ఎవరైనా లేచి నిల్చోకపోతే వారిని ‘తక్కువ దేశభక్తులు’గా ఎలా పరిగణిస్తామని ప్రశ్నించింది.
Samayam Telugu supreme court hints at modifying its order making anthem must in theatres
థియేటర్లలో నిలబడక్కర్లేదు: సుప్రీం కోర్టు


ఈ మేరకు దేశవ్యాప్తంగా సినిమా థియేటర్లలో చిత్రం ప్రారంభానికి ముందు జాతీయ గీతాన్ని తప్పనిసరిగా వినిపించాలన్న ఉత్తర్వుల్ని సవరించాల్సిందిగా కోరుతూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. దేశభక్తిని, జాతీయ భావాన్ని పెంపొందించడానికి వీలుగా.. సినిమా మొదలయ్యేముందు జాతీయ గీతాన్ని వినిపించడం, ఆ సమయంలో ప్రేక్షకులంతా లేచి నిల్చోవడం తప్పనిసరి అని గతేడాది డిసెంబర్ 30న సుప్రీంకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. అప్పట్లో శ్యాంనారాయణ్‌ ఛోక్సీ అనే వ్యక్తి దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై ఆ ఆదేశాలు వెలువడ్డాయి. ఆ ఉత్తర్వుల్ని పునఃసమీక్షించాలంటూ కేరళకు చెందిన కొడుంగల్లూర్‌ ఫిలిం సొసైటీ పిటిషన్‌ దాఖలు చేసింది.

ఈ పిటిషన్‌పై సోమవారం విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు.. జాతీయ గీతం నిబంధల్ని సవరించాలని కేంద్రాన్ని ఆదేశించింది. ఈ సందర్భంగా జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఎ.ఎం.ఖన్విల్కర్, డి.వై.చంద్రచూద్‌తో కూడిన ధర్మాసనం ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. థియేటర్లలో జాతీయ గీతం ఆలపించినప్పుడు లేచి నిలబడని వారికి దేశభక్తి లేదనడం సమంజసం కాదని స్పష్టం చేసింది. ‘ప్రజలు వినోదం కోసం సినిమాకు వెళ్తారు. రేపు కొంతమంది.. థియేటర్లలో జాతీయ గీతం వేస్తారు కాబట్టి ప్రజలు టి-షర్టులు, షార్ట్స్‌తో వేసుకుని రాకూడదు అంటారు. సమాజానికి నైతిక పోలీసింగ్‌ అవసరం లేదు’ అని జస్టిస్ చంద్రచూద్ వెల్లడించారు.

సినిమా హాళ్లలో జాతీయగీతాన్ని వినిపించడానికి సంబంధించి ‘జాతీయ పతాక నియమావళి’ సవరణపై నిర్ణయాన్ని జనవరి 9న జరిగే తదుపరి విచారణ నాటికి తమకు తెలియజేయాలని సుప్రీం కోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. జాతీయ గీతాలాపనపై మునుపు ఇచ్చిన ఉత్తర్వులో ‘తప్పనిసరిగా’ అనే పదానికి బదులుగా ‘చేయవచ్చు’ అని సవరించడానికి సంసిద్ధత వ్యక్తం చేసింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.