యాప్నగరం

సీఏఏపై స్టేకి సుప్రీం నో.. కేసు ఐదుగురు జడ్జ్‌ల ధర్మాసనానికి బదిలీ

మత ప్రాతిపదికన భారత పౌరసత్వం కల్పించే కేంద్రం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంటూ పలువురు సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్లు దాఖలయ్యాయి.

Samayam Telugu 22 Jan 2020, 1:15 pm
పౌరసత్వ సవరణ చట్టాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై బుధవారం సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. కేంద్రం తీసుకొచ్చిన సీఏఏకి వ్యతిరేకంగా మొత్తం 144 పిటిషన్ల దాఖలు కాగా, వీటిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బాబ్డే, జస్టిస్ అబ్దుల్ నజీర్, జస్టిస్ సంజీవ్ ఖన్నాల త్రిసభ్య ధర్మాసనం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ అంశాన్ని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీచేసింది. అంతేకాదు, ఈ పిటిషన్లపై అఫిడ్‌విట్ దాఖలకు కేంద్రానికి నాలుగు వారాల గడువు ఇచ్చింది. సుప్రీంలో దాఖలైన పిటిషన్లలో సీఏఏ రాజ్యాంగ బద్ధతను కూడా సవాల్ చేస్తున్న పిటిషన్ కూడా ఉంది.
Samayam Telugu sc2


ఈ విషయంలో కేంద్రం వాదనల వినకుండా పౌరసత్వ సవరణ చట్టం అమలను నిలిపివేస్తూ ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులను ఇవ్వబోమని స్పష్టం చేసింది. సీఏఏపై అసోం, త్రిపుర దాఖలు చేసిన పిటిషన్లపై వేర్వేరుగా విచారణ చేపడతామని పేర్కొంది. సీఏఏపై దేశవ్యాప్తంగా వ్యక్తమవుతోన్న ఆందోళనలకు, అసోంలో పరిస్థితులు భిన్నం.. ఆ రాష్ట్రంలో పౌరసత్వం గడువు 1971 మార్చి 24 కాగా, ప్రస్తుతం సీఏఏ 2014 డిసెంబరు 31ను పరిగణనలోకి తీసుకుందని ధర్మాసనం వివరించింది.

ఇక, సీఏఏకి వ్యతిరేకంగా ఎంఐఏం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, ఆర్జేడీ నేత మనోజ్ ఝా, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మెయిత్రా తదితరులు సుప్రీంకోర్టు ఆశ్రయించినవారిలో ఉన్నారు. జమియత్ ఉలేమా ఐ హింద్, ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్, పీస్ పార్టీ, సీపీఏ సహా పలు స్వచ్ఛంద సంస్థలు సైతం పిటిషన్లు దాఖలు చేశాయి. ప్రస్తుతం కేంద్రం తీసుకొచ్చిన సవరణ చట్టం వల్ల 2014 డిసెంబరు 31కి ముందు అఫ్గనిస్థాన్, పాకిస్థాన్, బంగ్లాదేశ్‌లలో మతహింసకు గురై భారత్‌కు వచ్చిన హిందూ, సిక్కు, బౌద్ధులు, క్రిస్టియన్, జైన్, పార్సీలకు భారత పౌరసత్వం లభిస్తుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.