యాప్నగరం

బిల్లులపై గవర్నర్లు త్వరగా నిర్ణయం తీసుకోవాల్సిందే: సుప్రీంకోర్టు

తెలంగాణ, తమిళనాడు, కేరళ సహా ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో గవర్నర్లు, ప్రభుత్వాల మధ్య ఇటీవల కాలంలో తరుచూ వివాదాలు చోటుచేసుకుంటున్నాయి. అసెంబ్లీ ఆమోదం తెలిపిన బిల్లులపై గవర్నర్లు ఎటువంటి నిర్ణయం తీసుకోకుండా తాత్సారం చేస్తున్నారని ఆందోళనలు, నిరసనలు చేస్తున్న సందర్భాలు ఉన్నాయి. ఇదే అంశంపై సుప్రీం కోర్టులో తెలంగాణ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. గవర్నర్లు అధికార పార్టీ పాలిత రాష్ట్రాల్లో ఒకలా, ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల్లో మరోలా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి.

Authored byఅప్పారావు జివిఎన్ | Samayam Telugu 25 Apr 2023, 7:01 pm

ప్రధానాంశాలు:

  • సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన తెలంగాణ
  • గవర్నర్ తమిళ్‌సై సౌందరాజన్‌పై ఆరోపణలు
  • ఆర్టికల్ 200 నిబంధనలు పాటించాలని సూచన
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Supreme Court
రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 200 నిబంధన ప్రకారం బిల్లులపై గవర్నర్‌ సాధ్యమైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. ప్రతిపక్ష పార్టీలు పాలనలో ఉన్న రాష్ట్రాలు అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను గవర్నర్లు సుదీర్ఘకాలంగా తన వద్ద పెండింగ్‌లో ఉంచుతున్నారంటూ నిరసన వ్యక్తం చేస్తోన్న తరుణంలో సుప్రీంకోర్టు ఈ ఉత్తర్వులు వెలువరించింది. తెలంగాణ ప్రభుత్వం పిటిషన్‌లో కోరినట్లుగా గవర్నర్‌లు బిల్లులను క్లియర్ చేయడానికి లేదా తిరిగి పంపించేందుకు సమయాన్ని నిర్దేశించలేదు. అయితే, సాధ్యమైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్, జస్టిస్ పీఎస్‌ నరసింహతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది.
అసెంబ్లీ ఆమోదించిన 10 బిల్లులపై గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సుదీర్ఘంగా పెండింగ్‌లో ఉంచడాన్ని వ్యతిరేకిస్తూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన సీజేఐ ధర్మాసనం ముందు తెలంగాణ తరఫున సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే, కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా గవర్నర్ వద్ద ఎలాంటి బిల్లులు పెండింగ్‌లో లేవని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు తెలిపారు.

‘ఈ నెల 23న తెలంగాణ గవర్నర్‌ కార్యదర్శి నుంచి సొలిసిటర్‌ జనరల్‌కు వచ్చిన వర్తమానంలో గవర్నర్‌ వద్ద పెండింగ్‌లో ఉన్న బిల్లుల తాజా పరిస్థితి గురించి చెప్పారు.. వీటిని దృష్టిలో ఉంచుకొని పిటిషనర్‌ ఈ కేసులో ప్రస్తావించిన మెరిట్స్‌ పరిధిలోకి ప్రస్తుతదశలో వెళ్లడంలేదు.. క్వశ్చన్‌ ఆఫ్‌ లాను అలాగే ఓపెన్‌గా ఉంచుతున్నాం’ అని సీజేఐ వ్యాఖ్యానించారు.

ప్రస్తుతం ప్రజా ప్రభుత్వాలు గవర్నర్ల దయాదాక్షిణ్యాలపై ఆధారపడాల్సి వస్తోందని, ఈ మొత్తం వ్యవహారంపై సరైన నిర్ణయం వెలువరించాలని తెలంగాణ న్యాయవాది దుష్యంత్‌ దవే విజ్ఞప్తి చేశారు. దీనికి సీజేఐ బదులిస్తూ బిల్లులను తిప్పి పంపే రాజ్యాంగ అధికారాలు గవర్నర్‌కు ఉన్నాయని గుర్తుచేశారు. అలాగే, గవర్నర్‌ సాధ్యమైనంత త్వరగా బిల్లులను తిప్పి పంపాలని నిబంధన ఏమైనా ఉందా? సీజేఐ ప్రశ్నించారు. దీనికి అవునని సమాధానం ఇచ్చిన దుష్యంత్ దవే.. రాజ్యాంగంలోని ఆర్టికల్ 200ను ప్రస్తావించారు.

సీజేఐ స్పందిస్తూ.. ఆర్టికల్‌ 200లో ఏం ఉందో ఒకసారి చూద్దామంటూ దాన్ని పరిశీలించారు. తాము విషయం లోతుల్లోకి వెళ్లడంలేదని, కేవలం ఆర్టికల్‌ 200లోని మొదటి నిబంధన గురించి ప్రస్తావిస్తున్నామని చెప్పారు. దీనికి తుషార్‌ మెహతా అభ్యంతరం వ్యక్తం చేశారు. ఉత్తర్వుల్లో అలా ప్రస్తావిస్తే అక్కడ రాజ్యాంగ నిబంధనలు అమలు కావడంలేదన్న సంకేతం వస్తుందని చెప్పారు. వాదోపవాదాలు విన్న అనంతరం ఉత్తర్వులు జారీ చేసిన ధర్మాసనం.. ఆర్టికల్‌ 200లో ఉన్నట్లుగా ఆమోదం కోసం పంపిన బిల్లు ఆర్థిక బిల్లు కాకపోతే గవర్నర్‌ సాధ్యమైనంత త్వరగా తిప్పి పంపడంతోపాటు, సభ/ సభలు ఆ బిల్లును పూర్తిగానో లేదంటే అందులోని నిర్దిష్ట నిబంధనలను పునఃపరిశీలించాలనో సందేశాన్ని జత చేయాలని నిర్దేశించారు.


ఇక్కడ సాధ్యమైనంత త్వరగా అన్న పదబంధంలో ముఖ్యమైన రాజ్యాంగ విషయం ఉందని, రాజ్యాంగ వ్యవస్థలు ఆ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలని సూచించారు. దీనికి సొలిసిటర్ జనరల్ తుషార్‌ మెహతా అభ్యంతరం తెలిపారు. ఉత్తర్వుల్లో ఈ రకమైన అభిప్రాయం వ్యక్తం చేయనవసరం లేదని వ్యాఖ్యానించారు. ఈ సమయంలో సీజేఐ స్పందిస్తూ అభిప్రాయాన్ని కేవలం ఈ గవర్నర్‌ను దృష్టిలో పెట్టుకొని చెప్పడంలేదని, రాజ్యాంగవ్యవస్థలను దృష్టిలో పెట్టుకొని చెప్పామన్నారు.


Read More Latest National News And Telugu News
రచయిత గురించి
అప్పారావు జివిఎన్
జీవీఎన్ అప్పారావు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ జాతీయ, అంతర్జాతీయ అంశాలకు సంబంధించిన తాజా వార్తలు, కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 10 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో విద్య, జాతీయ రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.