యాప్నగరం

బెంగాల్ గవర్నర్‌కు అక్షరాభ్యాసం.. 26న సీఎం సమక్షంలో సరస్వతీ పూజ

Bengal Governor Ananda Bose: పశ్చిమ బెంగాల్ గవర్నర్ ఆనంద బోస్‌కు ఈ నెల 26న ‘అక్షరాభ్యాసం’ జరుగునుంది. ఈ వయస్సులో అక్షరాభ్యాసం ఏంటి? అని ఆశ్చర్యపోవచ్చు. ఆశ్చర్యపోయినా.. ఇది నిజం. పలకా, బలపం బట్టి ఆయన అక్షరాలను దిద్దనున్నారు. రాజ్‌భవన్‌లో నిర్వహించనున్న సంప్రదాయ కార్యక్రమంలో బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సమక్షంలో.. గవర్నర్ ఆనంద బోస్.. బెంగాలీ అక్షరాలను దిద్దనున్నారు. ఇప్పటికే హిందీ, ఇంగ్లిష్, మలయాళం భాషల్లో పుస్తకాలు రాసిన ఆనంద బోస్.. త్వరలో బెంగాలీలో బుక్ రాయనున్నారు.

Authored byశ్రీనివాస్ గంగం | Samayam Telugu 20 Jan 2023, 3:54 pm
బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్‌కు (CV Ananda Bose) జనవరి 26న అక్షరాభ్యాసం జరుగనుంది. ఈ వయస్సులో అక్షరాభ్యాసం ఏంటి? పైగా గవర్నర్‌కు.. అని ఆశ్చర్యపోవచ్చు. ఆశ్చర్యకరమైనా.. అదే నిజం. పలకా, బలపం పట్టి ఆయన అక్షరాలు దిద్దనున్నారు. బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సమక్షంలో ఈ కార్యక్రమం జరుగనుంది. జనవరి 26న సరస్వతీ పూజ సందర్భంగా బెంగాల్ రాజ్‌భవన్‌లో ఈ కార్యక్రమం తలపెట్టారు.
Samayam Telugu Ananda Bose
బెంగాల్ గవర్నర్ ఆనంద బోస్


ఐఏఎస్‌గా రిటైర్ అయ్యి రాజకీయాల్లోకి వచ్చిన ఆనంద బోస్‌కు పలు భాషల్లో ప్రావీణ్యం ఉంది. సాహితీవేత్త కూడా. ఇంగ్లిష్, హిందీ, మలయాళం భాషల్లో ఇప్పటికే 40 పుస్తకాలు రాశారు. పశ్చిమ బెంగాల్ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టిన తొలి రోజుల్లోనే బెంగాలీలోనూ ఓ పుస్తకం రాయాలని ఆనంద బోస్ ఆసక్తి వెలిబుచ్చారు. ఇందు కోసం బెంగాలీ భాష నేర్చుకోవాలని నిర్ణయించుకున్నారు.

బెంగాలీ భాషలోని అక్షరాలను నేర్చుకునే ముందు చిన్నారులకు ‘హతే ఖోరీ’ (Hathe Khodi) పేరుతో సంప్రదాయ రీతిలో కార్యక్రమం నిర్వహిస్తారు. తెలుగు రాష్ట్రాల్లో ‘అక్షరాభ్యాసం’ కార్యక్రమం మాదిరిగా ఈ తంతును నిర్వహిస్తారు. ఇప్పుడు గవర్నర్ ఆనంద బోస్ కూడా ఇలా సంప్రదాయ పద్ధతిలో అక్షరాభ్యాసం తర్వాత బెంగాలీ భాషను నేర్చుకునే ప్రక్రియకు శ్రీకారం చుడతారన్నమాట.

బెంగాల్‌తో పాత సంబంధం
కేరళలో పుట్టిన ఆనంద బోస్‌కు బెంగాలీ భాష కొత్తేం కాదు. మాట్లాడటం వచ్చు. తనకు బెంగాల్‌తో పాత సంబంధం ఉందని ఆయన తెలిపారు. ఆయన తన కెరీర్‌ను బెంగాల్‌లోనే ప్రారంభించారు.

‘బ్యాంకర్‌గా నా కెరీర్ కోల్‌కతాలోనే ప్రారంభమైంది. కోల్‌కతాలోని శ్యామ్ బజార్, చౌరిగీలోని రాస్‌బిహారీ అవెన్యూలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో నేను ప్రొబేషనరీ ఆఫీసర్‌గా పని చేశాను. బెంగాల్ నాకు తెలియనిది కాదు. బెంగాల్ సంస్కృతి, కళలు నాకు బాగా తెలుసు’ అని గవర్నర్ ఆనంద బోస్ తెలిపారు.

సుభాష్ చంద్రబోస్ అంటే గౌరవం.. పిల్లల పేర్ల చివరన బోస్
సీవీ ఆనంద బోస్ తండ్రి వాసుదేవన్ నాయర్‌ స్వాంతంత్య్ర సమరయోధుడు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంటే ఆయనకు ఎనలేని గౌరవం. అందుకే, తన పిల్లలందరి పేర్లకు చివరన ‘బోస్’ అని పేరు పెట్టుకున్నారు. ఆ పేర్లు: మోహన్ బోస్, ఆనంద బోస్, సుందర్ బోస్, సుకుమార్ బోస్ & కమలా బోస్, ఇందిరా బోస్.

రచయిత గురించి
శ్రీనివాస్ గంగం
శ్రీనివాస్ రెడ్డి గంగం సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ అంశాలపై వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. EJS నుంచి శిక్షణ పొందిన శ్రీనివాస్‌కు జర్నలిజంలో 12 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. JNTU నుంచి BTech చేశారు. గతంలో ప్రముఖ పత్రికల్లో వార్తలు, విద్యా సంబంధిత అంశాలు అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.