యాప్నగరం

లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ముగ్గురు అధికారులు సహా 16 మంది జవాన్లు దుర్మరణం

సైనికుల కాన్వాయ్‌లోని వాహనం ప్రమాదానికి గురైన ఘటన సిక్కిమ్‌లో శుక్రవారం ఉదయం చోటుచేసుకున్నట్టు ఆర్మీ ఓ ప్రకటన విడుదల చేసింది. జెమా మార్గంలో ఓ మలుపు వద్ద ఈ వాహనం అదుపుతప్పడంలో నిటారుగా ఉన్న లోయలోకి దూసుకెళ్లిందని, ఈ ఘటనలో 16 మంది ప్రాణాలు కోల్పోయారని తెలిపింది. వరుసగా మూడు వాహనాలు వెళ్తుండగా.. ప్రమాదవశాత్తూ బస్సు లోయలోకి జారిపడి పోయిందని ఆర్మీ అధికారులు తెలిపారు. పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదు.

Authored byఅప్పారావు జివిఎన్ | Samayam Telugu 24 Dec 2022, 7:28 am

ప్రధానాంశాలు:

  • జెమా మార్గంలో లోయలో పడిపోయిన వాహనం
  • ప్రమాదంలో మరో నలుగురు సైనికులకు గాయాలు
  • ఘటనపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ విచారం.
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Sikkim
సిక్కిమ్‌లో ఘోర ప్రమాదం సంభవించి.. 16 మంది భారత్ సైనికులు దుర్మరణం చెందారు. శుక్రవారం ఉదయం నార్త్ సిక్కిమ్‌లోని జెమా ప్రాంతంలో సైనికులతో వెళ్తోన్న వాహనం లోయలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు ఆర్మీ అధికారులు, 13 మంది సైనికులు మృతిచెందినట్టు సైన్యం ప్రకటించింది. ఈ ఘటనలో మరో నలుగురు సైనికులు గాయపడ్డారు. లోయలో బోల్తాపడి ట్రక్కు మూడు వాహనాల కాన్వాయ్‌లో భాగమని, ఉదయం చటెన్ నుంచి థాంగూ వైపు వెళ్తుండగా ప్రమాదం జరిగిందని సైన్యం తెలిపింది.
‘‘జెమా మార్గంలో ఒక మలుపు వద్ద నిటారుగా ఉన్న వాలు నుంచి వాహనం అదుపుతప్పి లోయలోకి జారిపోయింది. వెంటనే రెస్క్యూ మిషన్ ప్రారంభించాం.. గాయపడిన నలుగురు సైనికులను ఆస్పత్రికి తరలించారు’’ అని పేర్కొంది. ఈ కష్ట సమయంలో మృతుల కుటుంబాలకు అండగా నిలుస్తామని ఆర్మీ భరోసా ఇచ్చింది. నిటారుగా ఉన్న లోయలోకి దూసుకెళ్లడంతో వాహనం నుజ్జునుజ్జుయ్యింది.

సిక్కింలోని చటెన్ నుంచి థాంగూ ప్రాంతంలోని సరిహద్దు స్థావరాలకు పలువురు సైనికులు శుక్రవారం ఉదయం మూడు వాహనాల్లో బయలుదేరారు. వారి వాహనశ్రేణి జెమా వద్దకు చేరుకోగానే.. ఓ ప్రమాదకర మలుపు వద్ద రోడ్డు ఏటవాలుగా ఉండటంతో ఒక ట్రక్కు అదుపు తప్పి లోయలోకి జారిపడింది. వందల అడుగుల ఎత్తు నుంచి పడిపోవడంతో వాహనం తునాతునకలైంది.

ప్రమాదంపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘ఉత్తర సిక్కింలో జరిగిన రోడ్డు ప్రమాదంలో భారత ఆర్మీ సిబ్బంది ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరం.. వారి సేవ, నిబద్ధతకు దేశం ఎంతో కృతజ్ఞతలు తెలుపుతోంది.. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను’ అని రాజ్‌నాథ్ సింగ్ ట్వీట్ చేశారు. ప్రమాదం గురించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఘటనలో మృతిచెందిన సైనికుల వివరాలను ఆర్మీ వెల్లడించలేదు.

Read Latest National News And Telugu News
రచయిత గురించి
అప్పారావు జివిఎన్
జీవీఎన్ అప్పారావు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ జాతీయ, అంతర్జాతీయ అంశాలకు సంబంధించిన తాజా వార్తలు, కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 10 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో విద్య, జాతీయ రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.