యాప్నగరం

అడుగు కదలనీయని అయ్యప్ప భక్తులు.. తృప్తి దేశాయ్‌ తిరుగుముఖం

13 గంటలకు పైగా పోరాడిన తృప్తికి తప్పని నిరాశ. వెనక్కి తగ్గని అయ్యప్ప భక్తులు. తృప్తి దేశాయ్ తిరుగుముఖం.

Samayam Telugu 16 Nov 2018, 8:16 pm
బరిమల ఆలయంలోకి అడుగుపెట్టి తీరుతానంటూ శపథం చేసిన తృప్తి దేశాయ్‌కు చివరికి నిరాశే మిగిలింది. కొచ్చి విమానాశ్రయానికి చేరుకొని 13 గంటలకు పైగా అక్కడే నిలిచిపోయిన సామాజిక కార్యకర్త, భూమాత బ్రిగేడ్ వ్యవస్థాపకురాలు తృప్తి దేశాయ్ ఎట్టకేలకు పుణేకు తిరుగుముఖం పట్టేందుకు సిద్ధమయ్యారు. రాత్రి 9.25 గంటలకు ముంబై విమానంలో ఆమె తిరుగు ప్రయాణం కానున్నారు. అయ్యప్ప భక్తులు ఆమెను విమానాశ్రయం నుంచి అడుగు ముందుకు కదలనీయడలేదు. పోలీసులు కూడా చేతులెత్తేయడంతో ఆమెకు నిరాశ తప్పలేదు. ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఆమెను తిరిగి వెళ్లాల్సిందిగా కోరారు. వెనుదిరగడానికి ముందు ఆమె మీడియాతో మాట్లడనున్నారు.
Samayam Telugu desai


శబరిమల ఆలయాన్ని దర్శించుకునేందుకు ఆరుగురు మహిళలతో కలిసి శుక్రవారం (నవంబర్ 16) ఉదయం 4.40 గంటలకు తృప్తి దేశాయ్ కొచ్చి విమానాశ్రయానికి చేరుకున్నారు. అప్పటికే అక్కడికి చేరుకున్న ఆందోళనకారులు ఆమెను అడ్డుకోవడం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఆందోళనకారులు దిగ్బంధించడంతో తృప్తి దేశాయ్ బయటకు రాలేకపోయారు..

పోలీసుల సాయంతో మరో గేటు నుంచి విమానాశ్రయం బయటకు వెళ్లడానికి తృప్తి దేశాయ్ ప్రయత్నించినప్పటికీ.. అక్కడ కూడా ఆందోళనకారులు అడ్డుకున్నారు. దీంతో ఆమె తీవ్ర అసహనానికి గురయ్యారు. అసలు ఏం జరుగుతోందంటూ పోలీసులపై మండిపడ్డారు. అయ్యప్ప దర్శనం అయిన తర్వాతే అక్కడ నుంచి కదులుతానంటూ తెగేసి చెప్పారు. అయితే.. ఉద్రిక్త పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ముందుకు వెళ్లాలనే ఆలోచనను పునరాలోచించుకోవాలని పోలీసులు ఆమెకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. చాలా సేపటి తర్వాత చివరకు తిరుగుముఖం పట్టడానికే మొగ్గచూపారు.

కొచ్చి విమానాశ్రయం ఎదుట ఆందోళనకారులు చప్పట్లు చరుస్తూ.. నినాదాలతో, అయ్యప్ప నామ స్మరణతో హోరెత్తిస్తున్నారు. ‘తృప్తి అయ్యప్ప దర్శనానికి వెళ్లాలనుకుంటే.. మా గుండెల మీద నుంచే నడిచి వెళ్లాలి’ అంటూ ఆందోళనకారుల తరఫున సామాజిక కార్యకర్త రాహుల్ ఈశ్వర్ చెప్పడం పరిస్థితి తీవ్రతకు అద్దంపడుతోంది.

Also Read: తెరుచుకున్న అయ్యప్ప ద్వారాలు.. తృప్తి దేశాయ్ 13 గంటలుగా దిగ్బంధం

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.