యాప్నగరం

పాఠశాలలో పాము కాటు.. ఇద్దరు బాలికలు బలి

Chhattisgarh | పాఠశాలలో పాముకాటుకు గురై ఇద్దరు అమ్మాయిలు మరణించారు. ఛత్తీస్‌గఢ్‌లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఈ విషాదం చోటుచేసుకుంది.

Samayam Telugu 27 Jul 2019, 3:06 pm
దువు కోసం బడికెళ్తే పాము రూపంలో మృత్యువు కబళించింది. ప్రభుత్వ పాఠశాలలో మూడో తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థినిలను ఓ విషసర్పం కాటువేసింది. వారిని సకాలంలో ఆస్పత్రికి తరలించడంలో పాఠశాల సిబ్బంది నిర్లక్ష్యం వహించడంతో మృత్యువాతపడ్డారు. ఛత్తీస్‌గఢ్‌లోని జష్‌పూర్ జిల్లాలో శుక్రవారం (జులై 26) మధ్యాహ్నం ఈ విషాదం చోటుచేసుకుంది. ప్రభుత్వ పాఠశాలల్లో భద్రతా ప్రమాణాల లేమి, స్కూల్ సిబ్బంది నిర్లక్ష్యంపై విమర్శలు వస్తున్నాయి.
Samayam Telugu Snake
Representavive Image


జష్‌పూర్ జిల్లాలోని బచిగా డెవలప్‌మెంట్ బ్లాక్‌ పరిధిలో ఉన్న తట్కేలా గ్రామానికి చెందిన పాయల్ (10), పార్వతి (10) అనే ఇద్దరు విద్యార్థినులు స్థానిక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో మూడో తరగతి చదువుతున్నారు. శుక్రవారం మధ్యాహ్నం భోజన విరామ సమయంలో వీరిద్దరూ పాము కాటుకు గురయ్యారు. పాఠశాల సిబ్బంది సకాలంలో వీరిని ఆస్పత్రికి తరలించలేదు. దీంతో పాయల్‌ బచిగా ప్రైమరీ హెల్త్ సెంటర్‌లో చికిత్స పొందుతూ మృతి చెందగా.. పార్వతిని సమీపంలోని అంబికాపూర్‌ ఆస్పత్రికి తరలిస్తుండగా మరణించింది.

ప్రధానోపాధ్యాయుడు హత్‌కేశ్వర్ యాదవ్.. ముందస్తు సమాచారం లేకుండా విధులకు గైర్హాజరవడం విమర్శలకు తావిస్తోంది. విద్యార్థులను ఆసుపత్రికి తరలించడంలో ఉపాధ్యాయురాలు అనుపమా టక్రీ జాప్యం చేశారు. ఘటను సీరియస్‌గా తీసుకున్న ఉన్నతాధికారులు వీరిద్దరినీ సస్పెండ్ చేశారు.

తమ పాఠశాలలో సరైన భద్రత లేకపోవడం వల్ల భయానికి గురవుతున్నామని ఇటీవలే హర్యాణాలో ఐదుగురు విద్యార్థినులు హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసిన విషయం విదితమే. ఈ ఘటనపై చర్చ జరుగుతుండగానే.. తాజాగా ఛత్తీస్‌గఢ్ పాఠశాలలో ఇద్దరు విద్యార్థినిలు పాము కాటుకు బలవ్వడం పట్ల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల నిర్వహణలోని డొల్లతనానికి ఈ ఘటనలు నిదర్శనంగా నిలుస్తున్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.