యాప్నగరం

యూపీ రైలు ఘటన.. నిర్లక్ష్యమే కారణం

రైల్వే సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే ఉత్తరప్రదేశ్‌లో ఘోర రైలు ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక ఆధారాల ద్వారా తెలుస్తోంది.

TNN 20 Aug 2017, 9:00 am
రైల్వే సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే ఉత్తరప్రదేశ్‌లో ఘోర రైలు ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక ఆధారాల ద్వారా తెలుస్తోంది. మరమ్మతులు జరుగుతున్న రైల్వే ట్రాక్‌పై రైలు అత్యంత వేగంగా దూసుకెళ్లడంవల్లే బోగీలు పట్టాలు తప్పాయంటున్నారు. పూరీ నుంచి హరిద్వార్ వెళ్లే కలింగ ఉత్కళ్ ఎక్స్‌ప్రెస్ శనివారం సాయంత్రం ఉత్తరప్రదేశ్‌లో పట్టాలు తప్పిన సంగతి తెలిసిందే. ముజఫర్‌నగర్‌కు 40 కిలోమీటర్ల దూరంలోని ఖతౌలీలో జరిగిన ఈ ఘోర ప్రమాదంలో 23 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 70 మంది తీవ్రంగా గాయపడ్డారు. అయితే ఉత్కళ్ ఎక్స్‌ప్రెస్ ప్రయాణిస్తున్న మార్గంలో ట్రాక్ నిర్వహణ మరమ్మతులు జరుగుతున్నాయని, అయితే ఈ విషయం లోకో పైలట్‌కు రైల్వే సిబ్బంది చెప్పలేదని సమాచారం.
Samayam Telugu unofficial track maintenance could be reason behind utkal train accident
యూపీ రైలు ఘటన.. నిర్లక్ష్యమే కారణం


ప్రమాదం జరిగిన సమయంలో రైలు సుమారు 106 కి.మీ. వేగంతో వెళ్లినట్లు తెలుస్తోంది. అందుకే మొత్తం 23 బోగీలు ఉంటే వాటిలో 14 బోగీలు పట్టాలు తప్పాయి. ఈ రైల్వే ట్రాక్ ఊరి మధ్యలో నుంచి వెళ్తుండటంతో కొన్ని బోగీలు ఇళ్లలోకి దూసుకెళ్లాయి. రైల్వే ట్రాక్ పక్కన ఉన్న రోడ్డులో నడుచుకుంటూ వెళ్తున్న ఓ వృద్ధురాలు బోగీ కిందపడి చనిపోయింది. ప్రమాదానికి సుమారు ఒక గంట ముందు ఇదే ట్రాక్‌పై ఢిల్లీ-సహరన్‌పూర్ డీఈఎంయూ రైలు వెళ్లింది. ఆ తరవాత సుమారు 15 మీటర్ల మేర పట్టాలను రైల్వే కూలీలు తీసేసి మరమ్మతులు చేస్తున్నారు. దూరం నుంచి ఉత్కళ్ ఎక్స్‌ప్రెస్ రైలు రావడం గమనించిన కూలీలు హడావుడిగా అప్పటికప్పుడు రైలు పట్టాలను అమర్చారు. ఈ పట్టాలే ప్రమాదం జరిగిన తరవాత ఏ1 కోచ్ కింద కనిపించాయి. వాటికి బిగించిన క్లాంపులు సైతం చెల్లాచెదురుగా దూరంగా ఎగిరిపడ్డాయి.

విచిత్రం ఏమిటంటే ఇక్కడ మరమ్మతులు జరుగుతున్న సంగతి ఖతౌలీ రైల్వే స్టేషన్ సిబ్బందికి కూడా తెలియదట. రైలు పట్టాల మరమ్మతులు జరుగుతున్న సంగతి తనకు తెలియదని, కనీసం ఎర్ర జెండాలు కూడా పెట్టలేదని లోకోపైటల్ చెబుతున్నారు. వాస్తవానికి పట్టాల మరమ్మతులు జరుగుతున్న చోట రైలు గంటలకు 10 నుంచి 15 కి.మీ. వేగంతో మాత్రమే వెళ్లాలి. కానీ ఉత్కళ్ ఎక్స్‌ప్రెస్ 100 కి.మీ. పైగా వేగంతో వెళ్లడంతో ఈ ఘోర ప్రమాదం జరిగింది. 23 మంది మృతికి కారణమైంది. ప్రమాదం జరిగిన లైను సింగిల్ ట్రాక్ కావడంతో బోగీల తొలగింపు పనులు యుద్ధప్రాతిపదికన జరుగుతున్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.