యాప్నగరం

లోక్‌సభ ఉప ఎన్నికల్లో బీజేపీకి షాక్.. సీఎం యోగి కంచుకోట బద్దలు

యూపీ, బీహార్ ఉప ఎన్నికల్లో బీజేపీకి గట్టి షాక్ తగిలింది. ఉత్తరప్రదే‌శ్‌లో రెండు సిట్టింగ్ స్థానాల్లోనూ ఆ పార్టీ ఓటమి పాలైంది. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ నియోజకవర్గం గోరఖ్‌పూర్‌లోనూ బీజేపీ పరాజయం పాలైంది.

TNN 14 Mar 2018, 8:57 pm
ఉత్తరప్రదేశ్, బీహార్ ఉప ఎన్నికల్లో అధికార బీజేపీకి గట్టి షాక్ తగిలింది. ఉత్తరప్రదే‌శ్‌లో రెండు సిట్టింగ్ స్థానాల్లోనూ ఆ పార్టీ ఓటమి పాలైంది. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ నియోజకవర్గం గోరఖ్‌పూర్‌లోనూ బీజేపీ పరాజయం పాలైంది. బీజేపీకి కంచుకోటగా ఉన్న గోరఖ్‌పూర్‌ స్థానంలో ఎస్పీ-బీఎస్పీ కూటమి ఘన విజయం సాధించింది. ఇక్కడ బీజేపీ అభ్యర్థి ఉపేంద్ర దత్ శుక్లాపై సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థి ప్రవీణ్‌ నిషాద్‌ 20 వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.
Samayam Telugu up bypolls bjp loses both gorakhpur and phulpur
లోక్‌సభ ఉప ఎన్నికల్లో బీజేపీకి షాక్.. సీఎం యోగి కంచుకోట బద్దలు


ఇక డిప్యూటీ సీఎం కేశవ్‌‌ ప్రసాద్‌ మౌర్య రాజీనామాతో ఖాళీ అయిన పూల్‌పూర్ నియోజకవర్గంలోనూ బీజేపీకి పరాభవం తప్పలేదు. ఈ స్థానంలో బీజేపీ అభ్యర్థిపై ఎస్పీ అభ్యర్థి నాగేంద్ర ప్రతాప్‌ సింగ్‌ పటేల్‌ 59,613 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. ఈ రెండు లోక్‌సభ నియోజకవర్గాల్లోనూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు డిపాజిట్ కోల్పోవడం గమనార్హం.

యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, డిప్యూటీ సీఎం కేశవ్ మౌర్య రాజీనామాలతో ఖాళీ అయిన లోక్‌సభ రెండు స్థానాల్లోనూ బీజేపీ ఓటమి పాలవడం ఆ పార్టీకి పెద్ద ఎదురుదెబ్బే. గోరఖ్‌పూర్‌ లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 1991 నుంచి ఇప్పటి వరకూ ఒక్కసారి కూడా ఓటమి చెందలేదు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ గోరఖ్‌పూర్ నుంచి 1998, 1999, 2004, 2009, 2014 వరస ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీచేసి విజయం సాధించారు. కానీ, తాజాగా జరిగిన ఉప ఎన్నికల్లో 27 ఏళ్ల తర్వాత బీజేపీ ఇక్కడ తొలిసారి ఓటమి చవిచూసింది.

మరోవైపు.. బీహార్‌ ఉప ఎన్నికల్లోనూ బీజేపీకి ఎదురుగాలి వీచింది. అరారియా లోక్‌సభ ఉప ఎన్నికల్లో ఆర్జేడీ అభ్యర్థి సర్ఫరాజ్ అలాం 61,988 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. జెహనబాద్ అసెంబ్లీకి జరిగిన ఉప ఎన్నికలో ఆర్జేడీ అభ్యర్థి కుమార్ కృష్ణ మోహన్ గెలుపొందారు. భబువా నియోజకవర్గం ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి రింకీ రాణి పాండే విజయ సాధించడం ఆ పార్టీకి కాస్త ఊరటనిచ్చే అంశం.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.